భాష్పాంజలి
నీవు లేనిదే గడువదనుకున్న నిమిషము గంటలయ్యె,
గంటలు గడిచె వడివడిగ , దినములు దొర్లిపోయె,
పక్షముల గతి మారె ,మాసముల్ మాయమయ్యె,
పలు వసంతాలు కాల గర్భాన పండిపోయె ,
గడిచిన గతమెల్ల మీదు స్మృతులతో నిండిపోయె!
అవియె తారకలు ,నెలరాజు,గగన మదియె ,
దిశలు,దిక్కులు దినములు రాత్రులవియె ,
ఏడు గుర్రాల రాయని పయన మదియె,
ఏడ్పు నగవుల కలబోత బ్రతుకు లవియె!
ఏది ఆబాట, ఆపాట పలుకు తీరు,
ఏదిఆ నీతి, ఆ ప్రీతి మాట సౌరు,
ఏది ఆ కసురు,ఆ విసురు,
ఎదను పండించి,పిండించి
పంచిన అమృత తుల్య మైన
ఆ అవ్యాజ వాత్సల్య ధార నే
నడుపు చున్నది మమ్ము ,
యిది సునృతము సుమ్ము,
నీ మూర్తిత్వ మావిష్కరింప దలంపగా
అక్షరాలేల పదములై అల్లు కోవు?
కలము సాగదు ముందుకు కవిత సేయ ,
భావములు రావు , ఎద యేల పేదయయ్యె
మీ మహోన్నత వ్యక్తిత్వ మహిమ నేమొ ,
మాటల కతీత మైనట్లు తోచె
పలుకులాకృతి ఆలోచన పరిధి రాక
లోచనా భరితమై, భావనా వేశమై
సలిలమై, సరళమై
మా అశ్రుభాష్పమ్ము లే సుమ జల కుంజములైనవి
నీ పద యుగ్మ మందు
మేమంజలి ఘటి యింపగ
అందుకో తండ్రీ !
మమ్ము కరుణింపగ బూనుము యెల్ల వేళలన్ !
( మా తండ్రి గారైన శ్రీ మంద రాజన్న 24 వ వర్ధంతి సందర్భం గా వారికి మా భాష్పాంజలి )
మంద నారాయణ , మంద పీతాంబర్ మరియు కుటుంబ సభ్యులు 19 -01 -2011
|
పీతాంబర్ గారు నమస్కారములు
ReplyDeleteమీ భాస్పాంజలి చదువు తుంటే చాలా బాధ గా అనిపించింది..గుండె బరువెక్కింది
శ్రీమతి రాజేశ్వరిగారు నమస్కారములు నా బ్లాగులో కవితలు చూస్తున్నందులకు ధన్య వాదములు
ReplyDelete