Tuesday, July 31, 2012

సిరులు గురియు!!!

సిరులు గురియు నెపుడు  ధరలోన పనిచేయు
వారి కెల్ల  తగిన దారి దొరికి,
చెప్పు  సాకు, పనులు  జేయక సోమరి 
మందవారిమాట మణుల మూట !!!


Monday, July 30, 2012

తెలుగు పేరు తెలిపిన శుభమౌ,!!!


  Date of Birth : 05-12-2011
                                                      

పేరింకపెట్ట లేదట
తీరౌ నొకతెలుగు పేరు తెలిపిన శుభమౌ,
చారెడు కన్నుల చిన్నది 
నీరజముఖి నుతులుజేయు  నిర్ణేతలకున్ !!!


                                                   


                                             
                          

సుందర మూర్తి!!!

 

ఒజ్జలందరు మెచ్చురీతిన  నోర్పునన్  ఖలునార్పుచున్
ముజ్జగంబులస్పూర్తి సుందర మూర్తి నర్తన జేయగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన   గానమెవ్వడు జేసెనో
సజ్జనావళి సంతసంబున సాగి మ్రొక్కెనుపాహిమాం !!!

(శంకరాభరణం బ్లాగు లో  28-07-2012  నాటి పద్య రచన-64 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

Sunday, July 29, 2012

కేళీ వినోది !!!


 

బాలుదతండుగాడు జనపాలుడు పూతనపూతచన్నులన్
పాలును గ్రోలిగూల్చినకృపాళువు దేవకిముద్దుబిడ్డడున్
చేలముఫించముoదడువ చెంగునదూకెసరస్సునందునన్
లీలలునద్భుతంబు,నవలీలగగర్వమడంచెసర్పికిన్!!!

కాళింది మడుగు నందున
కాళీయుని మదమడంచ కాలయముండై
కేళీ వినోది కృష్ణుడు
కాళీయుని పడగపైన కథకళి సలిపెన్ !!!


(శంకరాభరణం బ్లాగు లో  26-07-2012  నాటి పద్య రచన-62లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

Saturday, July 28, 2012

వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

సిరులిడుశ్రీదేవినెపుడు
వరలక్ష్మి వ్రతము జేయు వనితల కెల్లన్
త్వరపడి నాషాడంబున
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్!!!

 (శంకరాభరణం  బ్లాగులో 27-07-2012 నాటి  సమస్యా పూరణ-775 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

వరలక్ష్మి పూజ!!!



వందే  శ్రీకరి శుభకరి
వందే వరలక్ష్మి మాత వందన మమ్మా !
వందే హరిదొరసానికి
వందే సిరులిడెడు రాణి  వందనశతముల్ !!!

వరలక్ష్మి పూజ జేసిన
సిరులన్నియుగురియునింట చింతలుదీరున్
పెరుగును పతులకు నాయువు
పరమానందమ్ముగలుగు పడతులకెల్లన్ !!!

 (శంకరాభరణం బ్లాగు లో  27-07-2012  నాటి పద్య రచన-63 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

Friday, July 27, 2012

కాకర పూపూచి నిమ్మ కాయలు కాచెన్ !!!

వేకువన రైతు మొలకల
చేకొని జలకములబెట్టి చేనుననాటన్
ప్రాకెను ,చిక్కుడు,బీరయు
కాకర, పూపూచి నిమ్మ కాయలు కాచెన్ !!! 

 (శంకరాభరణం  బ్లాగులో 26-07-2012 నాటి  సమస్యా పూరణ-774 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, July 26, 2012

వారధి!!!


 


రావణ సంహారమునకు
కావలె వారధియొకటని కపులందరుసం
భావించి కట్ట నెంచిరి
పావనశ్రీరామనామ పరికరములతో!!!

(శంకరాభరణం బ్లాగు లో  23-07-2012  నాటి పద్య రచన-59 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

Wednesday, July 25, 2012

కృతివి ఖ్యాతుడు శ్రీత్యాగరాజు!!!




 


గీతములకు సుస్వరసం
గీతమ్మును మేళవించి కీర్తనలెన్నో
ప్రీతిగవ్రాసిన కృతివి
ఖ్యాతుడు శ్రీత్యాగరాజు గాంచినశుభమౌ !!!

(శంకరాభరణం బ్లాగు లో  24-07-2012  నాటి పద్య రచన-60 లో  వ్రాసినపద్యం)



Saturday, July 21, 2012

కంటిని భద్ర గిరీశువాసమున్,!!!

కంటిని గౌతమీ తటిని, కంటిని భద్ర గిరీశువాసమున్,
కంటిని గోపురప్రభలు, కంటిని మందిరదివ్యకాంతులన్,
కంటిని లక్ష్మణున్ , కపిని గంటిని, సీతనురామభద్రునిన్ 
కంటిని కన్నులారగను ,కంటి నయోద్యను మానసంబునన్ !!!

Friday, July 20, 2012

వందన మయ్యా!!!

వందే కరిచర్మాంబర
వందే కైలాసవాస వైరి వినాశా !
వందే భక్తవశంకర
వందే బాలేందు మౌళి వందన మయ్యా!!!

Thursday, July 19, 2012

గలుగును శుభముల్ !!!


విరివింటి వేల్పు తలపును
ఛురకంటిన కాల్చినట్టి సురవందితునిన్
కరమెత్తి మ్రొక్కు కంటెను
వరమంటును వేఱు గలదె వసుధన్ వెదకన్!!!

గణనాయకుప్రియ జనకుడు
ఫణిభూషణ శోభితుండు పార్వతినాథున్
ప్రణవ స్వరూపు ,సురముని
గణమాన్యుని మనన జేయ గలుగును శుభముల్ !!!



Tuesday, July 17, 2012

సీతా రామ కల్యాణం !!!

ముక్కంటి యొక్క వింటిని
పెక్కండ్రునుచూచుచుండ ఫెళ్ళున విఱువన్,
చుక్కంటి సీత ,రాముని
ఒక్కంటను చూసి వేసె నొప్పెడు మాలన్ !!!

Friday, July 6, 2012

సా నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ !!!

దీనుల  మొరవిను వీనుల
మేనేల్లన్ గల వినీల మేఘశ్యామా!
మానస వశ  తిరుమల వా
సా ! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ !!! 

 (శంకరాభరణం  బ్లాగులో 05-07-2012 నాటి  సమస్యా పూరణ-754 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)