Thursday, October 31, 2013

పిల్లి !!!

పిల్లికి బిక్షమ్ము బెట్టనేరని వాడు
....పిలిచి సంతర్పణ పెట్ట గలడె ,
పిల్లికి భయపడు పిరికి వాడెపుడైన
....పులిముందు తలయెత్తి నిలువ గలడె
పిల్లి మార్చిన యట్లు పిల్లల పలుచోట్ల
....మార్చిసమస్యల తీర్చ గలడె
పిల్లి కంటబడిన వల్లుగాలేదంటు
....యింటిలోనె బ్రతుకు నీడ్వ గలడె
పిల్లి స్వభావమ్ము పిల్లి ప్రభావమ్ము
....యింటింట యూరుర కంట బడదె

"పిల్లి ఎలుకకు సాక్ష్యమ్ము" "పిల్లికి చెల
గాటమెలుకకు ప్రాణ సంకటము" గాదె
"గోడమీదిపిల్లి" మనకు గోపి . పిల్లి
తెలుగు భాషలోనిటుల జాతీయమయ్యె !!!

పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయులిలన్!!!

కోపోద్రేకుల పాలిటి
పాపాత్ములె , పూజ్యులగు నుపాధ్యాయులిలన్
దీపశిఖలు, విజ్ఞానపు
రూపాలను జూపు సద్గురువులకు ప్రణతుల్ !!!

(శంకరాభరణం  బ్లాగులో 05-09-2013 నాటి  సమస్యా పూరణ-   1165లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, October 26, 2013

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.

 


గురువుగా విజ్ఞాన తరువుగా విశ్వాన
....ఘనకీర్తి బొందిన ఘనుడెవండు ?
ప్రాక్పశ్చిమంబుల  పండితారాధ్యుడై
....విభవమ్ము వడసిన విభుడెవండు ?
రాయబారములందు రాజకీయములందు
....రాణించి మెరిసిన రత్నమెవరు ?
భారత రత్నయై పరతత్వ వేత్తయై
....ధర్మ కోవిదు డైన దక్షుడెవరు ?

పదవులకు వన్నె దెచ్చిన ప్రభువెవండు ?
సత్య సారమ్ము నెరిగిన సాధువెవరు ?
రాష్ట్రపతియెసర్వేపల్లి రాధ కృష్ణ
పండితుడతండు విజ్ఞాన మండితుండు !!!

Monday, October 21, 2013

శూలితనయ గంగ సోదరి యుమ!!!

పండితులకె దెలియు వరసలు బంధాలు
తెలిపి రిటుల వరుస తీరుమనకు
విశ్వ కారకుడగు విష్ణు మూర్తికి బావ
శూలి, తనయ గంగ, సోదరి యుమ!!!

(శంకరాభరణం  బ్లాగులో 03-09-2013 నాటి  సమస్యా పూరణ-   1163లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, October 18, 2013

హంతకునకు; వరమొసంముగె నలరజగము !!!

ధర్మ సంస్థాప నార్ధమై ధరను కృష్ణు
నిగనవతరించితి విజయ, నిజమువినుము
పాపమంటదు బుణ్యంబు వచ్చుదుష్ట
హంతకునకు; వరమొసంముగె నలరజగము !!!

(శంకరాభరణం  బ్లాగులో 02-09-2013 నాటి  సమస్యా పూరణ-   1162లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, October 13, 2013

విజయ దశమి శుభాకాంక్షలు.

 కవి మిత్రులకు ,పాఠకమహాశయులకు విజయ దశమి శుభాకాంక్షలు.

Thursday, October 3, 2013

జాతి పిత!!!

  పోరుబందరునందుబొడిచిన సూర్యుండు
    ....నస్తమించగ జేసె నాంగ్ల ప్రభను,
    ఊతకర్రను బట్టి జాతిని కదిలించి
    ....చైతన్య స్పూర్తిని జ్వలన జేసె,
    సత్యాగ్రహమ్మునే సాధనంబుగ జేసి
    ....సామ్రాజ్య వాదుల సాగనంపె,
    కరవాలమునులేక పరపాలనంబుకు
    ....చరమ గీతము పాడి చరితకెక్కె,

    హింస హేయమన్న పరమ హంస గాంధి,
    నీతి నియమాల దప్పని నేత గాంధి,
    స్పూర్తి నొసగిన కారుణ్య మూర్తి గాంధి,
    జాతి పిత గాంధి ధార్మిక  గీత గాంధి !!!

మాటలాడు చోట మౌన వ్రతము!!!

అనుచితమగు చోట నధిక ప్రసంగమ్ము
మాటలాడు చోట మౌన వ్రతము
పాడిగాదు రెండు ఫలితంబు నీయవు
మంద వారి మాట మణులమూట !!!

Wednesday, October 2, 2013

చేయ దగిన పనిని చేయకునికి !!!

కూడనట్టి  పనిని కుదురుగా జేయుచు
చేయ దగిన  పనిని చేయకునికి 
తరచి చూడ రెండు తప్పులే యగుగాదె !
మంద వారి మాట మణుల మూట!!!