Monday, September 27, 2010

పచ్చని చేలలో సైతం

     విలువల వలువూడ దీసి
     నీతిని  గోతిలో పాతి
     న్యాయానికి తారు పూసి
     సత్యానికి శిలువ వేసి
     చట్టాలను సంకెళ్ళను
     సామాన్యుల మెడన చుట్టి
     అదరగొట్టి బెదరగొట్టి
     పసి పిల్లల నోళ్ళు గొట్టి
     ప్రజల కడుపు మాడ గొట్టి
     పచ్చని చేలలో సైతం
     సెజ్జుల కార్చిచ్చు  పెట్టి
     అసత్యాల పునాదిపై
     అక్రమ హార్మ్యాలు గట్టు
     దుష్టుల దాష్ట్యీకానికి
     అంతమెప్పుడో ?
     ఈకుట్రలు కుతంత్రాలు ఆగుటేప్పుడో?
     బలహీనుల గుండె చప్పుడాగి నప్పుడా !
     శ్రమ జీవుల  స్వేదజలం మరిగినప్పుడా ?
    

Saturday, September 25, 2010

అ గణితుడు

      నుదుటన  కస్తూరి  తిలకమై  మెరిసిన
         నూత్నమౌ వెలుగులు నూరు సేయు
      వెదురు వేణువు నోటి పేటిలో వీణయై
          వీచిన రాగాలు వేయి చేయు
      అక్షయ మైనట్టి కరుణ కారణ నయన
          వీక్షణ క్షణ ఫలము లక్ష సేయు
      కొనగోట గిరినెత్తి సురనాథు నెదిరించి
           గోపాలకుని లీల కోటి సేయు
         నని భ్రమసి వెలగట్ట నవని తరమె!
         అవని నేలెడు దొరగొల్వ అస్త్రమెద్ది?
         అగణితుని  గణి యింపగా గణితమెద్ది?
         అతులుని తులన జేసెడి  తూకమెద్ది? 
          
     

Tuesday, September 21, 2010

ఈ ప్రపంచ రూపం .

         కర్షకుడు కలం పడితే  ఆహరమౌతాడు
         శ్రామికుడు కలం పడితే  పరిశ్రమౌతాడు
         సైనికుడు  కలం  పడితే  రక్షకు డౌతాడు
         న్యాయమూర్తి కలం పడితే తీర్పౌతాడు
        డాక్టర్  కలంపడితే  ఆరోగ్యమౌతాడు
        గురువు కలంపడితే  మార్గదర్షౌతాడు 
        కవి కలంపడితే  కావ్యమౌతాడు
        శాస్త్రవేత్త  కలంపడితే రమ్య హర్మ్యమౌతాడు
         ఎందరో మహానుభావుల అనుభవాక్షరాల
         సారమే  ఈనాటి ప్రగతి ,ఈ ప్రపంచ రూపం .
      

Monday, September 20, 2010

మనువు సున్న.

తెలుగు వారి  సంస్కృతిలో  బొట్టు, మంగళసూత్రాలు,మట్టెలు, గాజులు   పూలు ఇత్యాదివన్నీ పుణ్య స్త్రీలకు పవిత్ర మైనవి.
తర తరాల నుండి వీటిని ధరిస్తూ సంప్రదాయాన్ని ఇష్టపూర్వకంగా  గౌరవిస్తూ ఉండడం  అందరికీ  తెలియ నటువంటిది  కాదు
కాని కేవలం  ఇవిమాత్రమే స్త్రీలకు ఆనందాన్ని కలుగజేస్తాయని,  వారి  వ్యక్తిత్వాన్ని పెంపోదిస్తాయని అనుకోవడానికి లేదు
వేదింపులకు వెటకారాలకు  గురి చేసే   అత్త మామలు , చులకనచేసి  గౌరవానికి భంగం  కలిగిస్తూ ఎత్తిపొడుపు మాటలతో
అధికారం చెలాయించే ఆడబిడ్డలు ,మనసు అర్థం చేసుకోలేని, అసలు  మనిషే అర్థం కాని భర్త  ఉంటే  అసలు ఆనందం
ఎక్కడ  ఉంటుంది ?   వ్యక్తికి    ఆదరణ   కరువై , ఆత్మీయత దూరమైతే,  ప్రేమగా చూసికోని, ఎన్నిచదివినా తన మనసు మాత్రం 
చదవని  ఎన్ని తెలిసినా  మమత మాత్రం  తెలియని  భర్త  అయితే  ఇక ఆనందం ఎలా ఉంటుంది ? డబ్బు,దర్పం  మనిషికి కొంత
వరకు సుఖాన్ని ఇవ్వగలవేమో గాని  సంతోషాన్ని మాత్రం   ఇవ్వలేవు  ఎందుకంటే సంతోషం, ఆనందం అనేవి మనస్సులో
జనించేవి అని పెద్దలు చెబుతారు .
                 కుదురుగా దిద్దిన ముదురు కుంకుమ రేఖ
                         బడతుల ప్రణయ సౌభాగ్య రేఖ
                మంగళ ప్రదమైన  మాంగల్య చిహ్నంబు
                         పుణ్యాంగనల ప్రీతి పుస్తె  త్రాడు .
  .              జడనిండ సొంపైన జాజి మల్లెల దండ
                         చెలువంపు గాజులు  చేతినిండ
                  వ్రేళ్ళకు  తోడైన  వెండి మట్టెల  జోడు
                         పాదాల కమరిన పట్ట గొలుసు
                   
                    ఇన్ని యున్నను ఇంతులకింపు గలదె
                     అత్త గయ్యాళి వెటకారి మామ యున్న
                    ఆడు బిడ్దల కవ్వింపు జాడలున్న
                     మనసు జదవని మొగడున్న మనువు సున్న.

సరదాకి చిరు కవిత: వందే వందే మాతరం

సరదాకి చిరు కవిత: వందే వందే మాతరం: " వందే వందే మాతరం బహు సుందరం మన భారతం ''వందే'' జన గణ మన భాషితం జల వన నగ భూషితం రాగ వర్ణ రంజితం సువర్ణ వజ్ర శోభితం '..."

వందే వందే మాతరం

    వందే వందే  మాతరం
    బహు సుందరం మన భారతం ''వందే''
    జన గణ మన  భాషితం
    జల వన నగ భూషితం
    రాగ వర్ణ రంజితం
    సువర్ణ వజ్ర శోభితం  "వందే"
    తలపైన హిమవన్నగము
    తనచుట్టూ సాగర జలము
    ఫాలభాగమున  రమ్య కాశ్మీరం
    పద  పీటమ్మున   కన్యకుమారిం
    తూరుపు దిక్కున అరుణ ప్రదేశం
    పడమటి మెడలో మహ రాష్ట్రీయం  "వందే"
    భిన్న భిన్న జాతులు  విభిన్నమైన రీతులు
    ఎన్నెన్నో భాషలు  వెలుగుల మణిపూసలు
    పలుమతాల తోరణం ధర్మ శాస్త్ర మేళనం
    సత్య శాంతి అహింసలకు చక్కని సమ్మేళనం  "వందే"
    సింహా లేలిన గడ్డ ఇది  గాడిదలకు తల వంచేనా
    పిరికి పందలకు   గుంట నక్కలకు
    పులు లెపుడైనా  బెదిరేనా
    వీరజవానుల ప్రతాపాగ్నిలో
    ఎవరైనా మాడకపోరా
    బొగ్గై  బుగ్గై  మగ్గకపోరా .
    మిగిలిన  ఉరికంబం  ఎక్కగ పోరా .
   ( ఈ కవిత ముంబై తాజ్ హోటల్  పై పాక్ తీవ్రవాదుల దాడి సందర్భంలో వ్రాసినది .ఈదాడిలో
     అసువులు బాసిన అమర వీరులందరికీ అంకితం .)      

సరదాకి చిరు కవిత: పాద మహిమ

సరదాకి చిరు కవిత: పాద మహిమ: " గజ్జెలందియలు ఘల్లు ఘల్లని మ్రోయ నహిమౌలి తాండవం బాడె నెద్ది భువన పావనమైన దివిజ స్రవంతికి ప్రభవ కారణ మౌ చు బరిగె నెద్ది స్వ..."

పాద మహిమ

   గజ్జెలందియలు ఘల్లు ఘల్లని మ్రోయ
   నహిమౌలి తాండవం బాడె  నెద్ది
   భువన పావనమైన దివిజ స్రవంతికి 
   ప్రభవ కారణ మౌ చు   బరిగె నెద్ది
   స్వారాజ్యమును గొన్న వైరోచనుని ద్రొక్కి                   
   పాతాళ భూమికి బంపె నెద్ది 
   పతి శాప వశమున గతి లేక పడియున్న
   చట్రాతి నాతిగా సలిపె నెద్ది
         ఆది లక్ష్మి నిచ్చెడు వేళ నబ్దిరాజు
         కనకపుం బల్లెరమున    కడిగె నెద్ది
         అట్టి నీ పాద పంకజం బమల చరిత
         నా కఠిన దేహమును  దాకి నవసి యుండు.  
        
    (  చిలకమర్తి  గారి  గయోపాఖ్యానము  లోనిది )

  

Thursday, September 16, 2010

తీర్పు.

     జగన్ ఓదార్పు
     అధిష్టానం ఓర్పు
     ప్రసారాల కూర్పు 
     స్వపక్షాల నేర్పు
     విపక్షాల వార్పు
     ప్రజల బతుకుల్లో లేనేలేదు మార్పు
     ఎన్నికల్లోనే ఇస్తారు తగిన తీర్పు.
  

Wednesday, September 15, 2010

ఇవే కదా

కోడలిపై  కన్నేసిన మామ
అత్తను ఆశించిన అల్లుడు
భార్యను నరికిన భర్త
తండ్రిని చంపిన తనయుడు
బిడ్డను అమ్మిన అమ్మ
తనయను చెరిచిన తండ్రి
ఇవి కావా ఆత్మీయ బంధాలకు పడ్డ చిల్లులు
ఇవే కదా మానవీయతకు గుచ్చుకొంటున్న ముల్లులు  

నేటి నాయకుడు

  తొలుత  నమస్కారం
  ఆపై అధికారం
  అన్నిటికీ బేరం
  ప్రజల కంట్లో కారం       

తెలంగాణం

తెలుగు గానం
తమిళ రాగం
కన్నడ తాళం
ఇటలీ మేడం
ఇచ్చేనా తెలంగాణం