Sunday, October 31, 2010

చదువులమ్మ గుడిన బుధుల కేమాయెనో!

మనుమ రాలి వయసు మగువను మనువాడ ,
డెబ్బ దేండ్ల కెట్టి జబ్బు పుట్టె  ?
చదువులమ్మ గుడిన బుధుల  కేమాయెనో!
మంద వారి మాట మణుల మూట!
(బాసర దేవాలయంలో డెబ్బై ఏండ్ల  వృద్దుడు
13 వత్సరాలు నిండని బాలికను బంధువుల,భక్తుల
సాక్షిగా పెళ్లి చేసుకున్నట్లు, ''ఈనాడు''పత్రికలో వచ్చిన
వార్తకు స్పందించి వ్రాసిన పద్యం యిది.దురాచారము
నశించు గాక.)

మనసెoతొ వగచెరా!

తెలుగు లలిత కళల వెలుగైన పేరును ,
సుబ్బి రామి రెడ్డి డబ్బులిచ్చి,
మబ్బు సేయ బూన మనసెoతొ  వగచెరా!
మంద వారి మాట మణుల మూట!

Saturday, October 30, 2010

బైబులు తో పాటు చదివె భగవద్గీతన్.

వైభవ ఏసు చరిత్రను ,
యీ భువి  జనములకు తెలిపి యిడుములు దీర్పన్
రాబర్టు దీక్ష తోడను
బైబులు తో పాటు చదివె భగవద్గీతన్.

కేబులు రాకన్ , సాయికి
సైబరు కేఫుకు జనుటకు సైకిలు లేకన్,
టేబులు పైనన్ బెట్టిన
బైబులు తో పాటు చదివె భగవద్గీతన్ .
(సాయి యశ్వంత్ మనుమని పేరు ) 
(శంకరాభరణం  బ్లాగులో లోగడ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణలు.)

Friday, October 29, 2010

జ్వర పీడితుడచటి నుండి జారుకొనె !


స్వరపేటిక చెడి పోయెను,
సరిగమలను పలికి పలికి సాధన లోనే, 
బరిలో నిలువక, రాగ  
జ్వర పీడితుడచటి నుండి జారుకొనె గదా!

మూఢ నమ్మకాలు ముప్పురా ప్రగతికి !!!

చేత బడులు  నమ్మి చేతులు  గాల్చిరి,
చేత లందు యముని దూత లైరి,
మూఢ నమ్మకాలు ముప్పురా ప్రగతికి !!!
మంద  వారి మాట మణుల మూట!

(కొన్ని రోజుల  క్రితమే చేత బడుల నెపమున ఒక  వృద్దున్ని
గ్రామస్తులు కొందరు సజీవ దహనము చేసిన సంఘటనను
మరువక  ముందే మళ్లీ మొన్న ఒక మహిళ చేతుల్ని
కాల్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.ఇలాంటి దురాగతాలు
అందరికి బాధ కలిగించేవే . అవిద్యనే వీటికి మూల కారణము.
ప్రజలను చైతన్య వంతుల చేయడమొక్కటే దీనికి విరుగుడు .
కొన్ని సంస్థలు ఇప్పటికే నడుం బిగించాయి.ఆయా ప్రాంతాలలో  ఉన్న
విజ్ఞులు కూడ సహకరిస్తే  ఇలాంటివి కొంత వరకు తగ్గ వచ్చు .)
   

Thursday, October 28, 2010

పరమ పావను ముద్దాడె పార్వతమ్మ!

చిన్న మనుమడు గీసిన చిత్రమందు,
పరమ పావను ముద్దాడె పార్వతమ్మ!
పంచదారను సిగపైన నుంచె నేమొ,
చందమామను ముద్దాడ సాగె చీమ!

చేటు గూర్చు పనులు జేయ నేల?

 పాటి యైన పనుల దాట వేయగ నేల?
 చేటు గూర్చు పనుల జేయ నేల?
 ఊరు నొచ్చు పనుల కుపయోగ ముండునా!
 మంద వారి మాట మణుల మూట!

Wednesday, October 27, 2010

హనుమంతుని పెండ్లి

వనచర యోధుని మదిని మ
దన భావన కలుగ లేదు; దాని కతము రా
వణుఁడో, రాముఁడొ, వాలియొ
హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో!.

ఎదుటి వాని చెవిన ఎక్కు వరకె!

బానిసౌను మనకు పరమ రహస్యమ్ము,
పరుల చెవుల లోన పడెడు వరకు
నిజము, పడిన యంత యజమాని మనకౌను!
మంద వారి మాట మణుల మూట!

Tuesday, October 26, 2010

గాలి నీరు నేల కలుషిత మైపోవ

ప్రాణవాయు విచ్చి ఫలపుష్పములనిచ్చి ,
జీవ జాతి కెల్ల చేవ నిచ్చి,
గాలి నీరు నేల కలుషిత మైపోవ
పచ్చనైన చెట్టు భగ్గు మనెను.

నాన్న కన్న మిన్న

అన్న లందు మేటి,అలనాటి రామన్న,
ఎంటి యారు తెలుగు యింటి  అన్న,
నాన్న కన్న మిన్న నా అన్ననేకదా !
మంద వారి మాట! మణుల మూట!
 (మా  అన్న శ్రీ మంద నారాయణ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాను.)

Monday, October 25, 2010

విద్య వివేకము

వీరు,వారు వాడ, విద్య వివేకమ్ము,
తరుగ బోవు నెపుడు ,  పెరుగు చుండు,
నీరు బావి లోన ఊరు విధమ్మున,
మంద వారి మాట! మణుల మూట!

వెధవగ దోచున్

కని పించిన వారలకున్ 
కని పించిన వన్ని జెప్పి కథ వినిపింపన్
మనమున విసుగని పించును
వినువారికి చెప్పు వారు వెధవగ దోచున్!

ఆడి తప్పగ రాదు!

      అతిగ వాగరాదు నాడి తప్పగ రాదు 
      ఎండి నట్టి మండ నెక్క రాదు!
      పరువు పోవు,కాలు పట్టును గోల్పోవు,
      మంద వారి మాట మణుల మూట!
    

Sunday, October 24, 2010

అధము గొలువ నెపుడు అవమానముల పాలె,

అల్పు లైన వారి నాశ్రయించగ  రాదు,
చెడ్డవారి చెంత చేర రాదు.
అధము గొలువ నెపుడు  అవమానముల పాలె!
మంద వారి మాట మణుల మూట!

మనుసు యంత్రమైతె

   మనిషి రోబొ కాగ మార్గము సులువాయె
   రోబొ మనిషి యైన రోష మొచ్చె,
   మనుసు యంత్రమైన  మమతల గతియేమి ?
   మంద వారి మాట మణుల మూట !

Friday, October 22, 2010

గాడిద అరిచెన్!

ఏ పని చేయక ,సోమరి యై ,జులాయిగా దిరుగే ఎదిగిన
కొడుకును కోపం తో "పనికి రాని గాడిదా " అని ఓ తండ్రి
తిట్టగా ,ఆ ప్రక్కనే ఉన్న పరువు గల గాడిద ఏలా అరిచిందో
వినండి!
             పని చేయని ప్రతి వెధవను,
             తనతో సరిజేసి బోల్చ తగదని జెప్పన్,
             తన పరువును తీయొద్దని ,
             ఘనముగ బరువులు మోసెడు గాడిద అరిచెన్!          

           

కష్ట సుఖాలకు కారణాలు

  కలిమి లేములకును కష్ట సుఖాలకు,
  కారణాలు దెలియ గలమె మనము ,
  పూర్వ జన్మ సుకృత పుణ్యాల ఫలమేమొ !
  మంద వారి మాట మణుల  మూట !

Wednesday, October 20, 2010

వేద సార మంత వేమన జెప్పెరా !

    ఏర్చి,కూర్చి,పేర్చి ఎన్నెన్నొ నీతులు
    మూడు పదము లందు మృదువు గాను,
    వేద సార మంత వేమన   జెప్పెరా !
    మంద వారి మాట మణుల  మూట 1
   (వేమన పద్యాల స్పూర్తే ,ప్రేరణే యీ నా మాట}

క్షణము దాట ఏది క్షీణించునో గదా!

    రేపు చేయు పనికి రూపమివ్వుము నేడు,
    నేడు జేయు పనుల  జూడు మిపుడె
    ఘడియ గడవ యేది గతియించునో గదా!
    మంద వారి మాట!మణుల  మూట !
  ( కబీర్ దాసు గారి దోహ స్పూర్తితో )

అతివ మొగము పైన యాసీడు వద్దురా!!!


లవ్వు లవ్వటంచు రివ్వున గంతులా!
కాదు కూడ దనిన క్రౌర్య మేల ?
అతివ మొగము పైన   యాసీడు వద్దురా !
మంద వారి మాట మణుల మూట !!!


    

  
    

  

మాట,మర్యాద,మన్నన

     మంచి మనసు,మాట,మర్యాద,మన్నన
     మనిషి ఎదుగు దలకు పనికి వచ్చు,
     చెరుపు  చేయు వాడు చేటురా జగతికి  
     మంద వారి మాట మణుల మూట  !
  

మేలు గూర్చు

ఉత్తములగు వారు నుపకారమును సేతు
లుర్వి జనుల కెల్ల నుచిత రీతి
ఉదకమగ్ని గాలి నుర్వియాకస మట్లు
మంద వారి మాట మణుల మూట !

Sunday, October 17, 2010

పాప మేల పోవు ? పావనుండెట్లౌను?

  కొంప లంటు పెట్టి కోవలకెళ్ళినా
  గంగ లోనికెళ్ళిదొంగ మునుగ
  పాప మేల పోవు ? పావనుండెట్లౌను?
  మంద వారి మాట మణుల  మూట !

చెడుకు చెరుపు,మంచికి మెరుపు,

బీడులన్ని పచ్చని పోలాలై  పోయి నప్పుడు
మోడు లన్ని మళ్లీ నిండుగా చిగురించి నప్పుడు,
అన్నార్తుల కడుపు లన్ని అన్నం తో నిండి నప్పుడు
నిరుద్యోగుల  కలలన్నీఉపాధితో పండి  నప్పుడు,
నలిగిన   చీకటి బ్రతుకుల్లో చిరు  కాంతులు వెలిగి నప్పుడు,

అధర్మం  సమాధియై ధర్మమే పునాదై నప్పుడు,
అసత్యం ఉరి కంబమెక్కి సత్యానికి ఊరట కలిగి నప్పుడు,
అన్యాయం పై న్యాయం గెలుపును సాధించి నపుడు
చెడుకు చెరుపు,మంచికి మెరుపు,
ఎప్పుడో అప్పుడే విజయ దశిమి
అది ఎప్పుడూ రావాలని
మన అడుగు
ముందుకే పడాలని
అందుకే మనం మారాలని
ఆ దశను నిండుగా కోరుకుందాం
ఈ దశమి పండుగ చేసుకుందాం.!
అందరికి దసరా శుభా కాంక్షలు.

Saturday, October 16, 2010

మనను ఏలు కింగు

    మాట తూల బోడు మర్యాద వీడడు
    నీతి దప్పు తప్పు రీతి  లేదు
    మనను ఏలు కింగు  మన్మోహనా సింగు
    మంద వారి  మాట మణుల  మూట !
   

Tuesday, October 12, 2010

నడ్డి విరుగు

ఆశ ఎక్కు  వైన   అసలుకే మోసమౌ
వడ్డి రాదు తుదకు  నడ్డి విరుగు
కన్నులుండి మురికి  కాల్వలో పడ్డట్లు ,
మంద వారి మాట మంచు మూట !
                                            
సింధు వందు బుట్టె సిరిబాల జాబిల్లి
మనుసు  చిలుక బుట్టు  మంచి, మమత
బుద్ది శుద్ధి గాగ , శుద్దోదనులు గారె,
మంద వారి మాట మంచు మూట !

పరుగులు వచ్చునా

  కంద పద్యబెంత అందంగా జెప్పినా
  భావ లేమి చేత  బౌన్సు గాదె
  పాడు పిచ్చు పైన పరుగులు వచ్చునా
  మంద వారి మాట మణుల  మూట !

Friday, October 8, 2010

మంచి మాట లెపుడు మనబాగుకే గదా !

  
ఉప్పు తక్కు వైన  ఊరేమి మునుగునా
కొంచ మెక్కువైన  పొంచు ముప్పు
మంచి మాట లెపుడు మనబాగుకే గదా ! 
మంద వారి మాట మణుల  మూట.! 
(శ్రీ మంతా సత్య నారాయణ గారి ఆరోగ్య సూత్రాలు వింటున్నప్పుడు వ్రాసినది
ఉప్పు అసలే వద్దంటా రాయన అది తెచ్చే ముప్పును గూర్చి చెబుతూ )

ముత్యాలు రాలునా ?

పొట్ట చేత బట్టి  పొద్దంత కష్టించు 
కూలి వాని గూడు కూల్చనేల
ముష్టి వాని మొట్ట ముత్యాలు రాలునా ?
మంద వారి మాట మణుల  మూట!

సెల్లు చెవిన బెట్టి చేత బైకును బట్టి
సొల్లు మాట లాడి సోలి పడగ
ముప్పదారు పళ్ళు మూడు పళ్ళవ్వవా
మంద వారి మాట మణుల మూట !

తప్పు  తాము జేసి  ఒప్పుగా వాదించు
మూఢ  మతుల వలన ముప్పు పొంచు
అట్టి వారి జట్టు కట్టిన ఫలమేమి ?
మంద వారి మాట మణుల మూట!