Saturday, August 31, 2013

కుల వాసన నెంచిచూడ గుమగుమ లాడెన్!!!

 అలనాటి బాల్య మిత్రుడు
చెలికాడగుహరికినిడె కుచేలుడు భక్తిన్
పలుచని మూటను, చిరుయటు
కుల వాసన నెంచిచూడ గుమగుమ లాడెన్!!!

(శంకరాభరణం  బ్లాగులో  23-06-2013 నాటి  సమస్యా పూరణ-   1091 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, August 30, 2013

దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్ !!!

పోరుట నేరము గాదుగ
దారిద్ర్యమునందు ; సుఖము తప్పక దొరకున్
ధీరతగలవారికి చే
కూరును విజయములు పెక్కు, కువలయమందున్ !!!
(శంకరాభరణం  బ్లాగులో  22-06-2013 నాటి  సమస్యా పూరణ-   1090 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

లోభి!!!

ధనమునకు మూడు గతులని
వినయముగాజెప్ప లోభి వినడెవ్వారిన్
దిననీయడు తానుదినడు
మనుచుండును బంధుగణపు మాటలు బడుచున్ !!!

Thursday, August 29, 2013

వందే శిఖిఫించమౌళి!!!


 


వందే వసుదేవ సుతా
వందే శిఖిఫించమౌళి వారిజ నేత్రా
వందే వారిరుహాసన
వందే జ్ఞానప్రదాత వందనమయ్యా !!!

ధర్మమున్న చోట దైవముండును గదా !!!

అంబ తోడునుండు సాంబుడండగనుండ
భయము తొలగుచుండు  జయము గలుగు
ధర్మమున్న చోట దైవముండును గదా
మందవారిమాట మణుల మూట !!!

సోమరెపుడు సాకు జూ పుచుండు !!!

సాధకుండు జూచు సానుకులతలను
సోమరెపుడు సాకు జూ పుచుండు
పనులు జేయుటందు పనులమానుటయందు
మందవారిమాట మణుల మూట !!!

Wednesday, August 28, 2013

నిండుకుండ తొణుకు చుండునా!!

విద్యయున్నవాడు వినయుడై భాసిల్లు
విషయ శూన్యుదెపుడు విఱ్ఱ వీగు
నిండుకుండ తొణుకు చుండునా యెపుడైన
మందవారిమాట మణుల మూట !!!

Sunday, August 25, 2013

తెలుగు భాష !!!


అక్షరాలేబది యారుతో నలరారు
లక్షలారు పదాల లలిత భాష !
అచ్చులు హల్లులు అరుదైన అరసున్న
సున్నయును విసర్గలున్న భాష!
నెలవంక ముడులతో తలపైన గుడులతో
తలకట్టు కొమ్ముతో దనరుభాష !
ఏత్వాల ఓత్వాల ఔత్వాల ఋత్వాల
ఒత్తులైత్వాల గమ్మత్తు భాష!

పూర్ణచంద్రుని రూపమ్ము బోలుభాష!
భాను బింబంబు రీతి గన్పట్టుభాష !
గుండ్రముగనుండు నిండు భూగోళభాష!
వింత అనుభూతి నిడెడు అజంత భాష!

క్షీరాబ్ధి చిలుకంగ క్షితిపైన తెలుగింట
ఒలికిన తేనెయో తెలుగుభాష !
హరునిశిరంబందు సురగంగ దూకంగ
దివినుండి జారెనో తెలుగుభాష !
వాగ్దేవి నుదుటన బాలార్క బింబమై
వెలుగొందు తిలకమో తెలుగుభాష !
చంద్రవంకలపైన ఇంద్రచాపము లీల
వెలుగు వర్ణమ్ములో తెలుగుభాష !

చేవగల్గిన విశ్వ ప్రాచీన భాష !
దేవరాయలు మెచ్చిన జీవ భాష!
విశ్వ భాషల ధీటుగా వెలుగు భాష!
దేశ భాషల మణిపూస తెలుగుభాష !!!

Tuesday, August 6, 2013

అరటి తొక్క పైన నడుగిడి నట్లేను!!!

అల్పుడైనవాని కధికారమొసగుట
అధిక వడ్డి పైన నప్పు గొనుట
అరటి తొక్క పైన నడుగిడి నట్లేను
మంద వారిమాట మణులమూట!!!

Monday, August 5, 2013

వ్రాయ దగిన పనుల చేయుటొప్పగునేడు!!!


చదువదగిన యట్టి సారంపు రచనలే
వ్రాయుటొప్పునేటి రచయితలకు
వ్రాయ దగిన పనులె చేయుటొప్పగునేడు
మంద వారి మాట మణుల మూట!!!

Sunday, August 4, 2013

కలుగు శుభములు పెక్కులు!!!

సాకు వెదకి పనుల సాగదీయుటలోన
చూపు నేర్పు నోర్పు జూప పనుల
సుఖము హెచ్చుకలుగు శుభములు పెక్కులు
మంద వారిమాట మణుల మూట !!!