Friday, December 31, 2010

సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!!!

పరిణయ పూర్వము తరుణిరొ,
పరిపరి విధముల కనుగొనె ప్రణయపు తీరుల్,
వరునకు లేవని,పరసతి
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!
(శంకరాభరణం  బ్లాగు లో08-11 -2010 నాటి  సమస్యా పూరణ-145లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, December 30, 2010

చుక్క నీరు లేని చక్కని నూయేల?

సోమరైన వాడు భీముడైనను యేల,
దాన గుణము లేని ధనికు డేల,
చుక్క నీరు లేని చక్కని నూయేల?
మంద వారి మాట మణుల మూట!

రాజ నీతి బుధుడు రాణిoచె ఆనాడు!!!

రాజ నీతి బుధుడు రాణిoచె ఆనాడు
రాజ కీయ మందు,రణము నందు ,
గెలిచి పేరు దెచ్చె లాలు బహద్దూరు .
పొట్టి వాడె కాని గట్టి వాడు !

Wednesday, December 29, 2010

వెన్నలలో తనువునుండి వెడలెను సెగలే!!!

వన్నెలవరూధిని గనియె,
ఎన్నడు ఎఱుగని ప్రవరుని ఎదురుగ,నాడా
పున్నమి చంద్రుని సాక్షిగ,
వెన్నలలో తనువునుండి వెడలెను సెగలే! 
(శంకరాభరణం  బ్లాగు లో02 -11 -2010 నాటి  సమస్యా పూరణ-141లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, December 28, 2010

సిరివలదనువానికిలను చిక్కులె గాదా!

హరి కైనను, హరు కైనను
సురపతికైన,ధరనేలు శూరుని కైనన్,
నిరతము గావలె జీవన
సిరి,వలదనువానికిలను చిక్కులె గాదా!

ముండై యుండుట మేలుగాదె జగతిన్ ముత్తైదువుల్ మెచ్చగన్!!!.

గండంబుల్ పలు రానిపోని ,ధరలో గర్వాంధులన్ ద్రుంచ,భీ
ముండైయండగ నుండు వాడు,మదిలొ మ్రోగించ రాగంబు కృ
ష్ణుండై,తోడును వీడకుండ నెపుడున్ శోకంబు దీర్పంగ,రా
ముండై యుండుట మేలుగాదె జగతిన్ ముత్తైదువుల్ మెచ్చగన్!!!.

Monday, December 27, 2010

నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !!!

వైతాళికుడెవ్వడు,గన,
బేతాళుడె,నీతుల అతిభీతిగ గోతిన్
పాతర జేసిన ఘనుడే,
నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !
(శంకరాభరణం  బ్లాగు లో31-10 -2010 నాటి  సమస్యా పూరణ-139లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, December 26, 2010

సరకుల ధర మింటి కెగిసె!!!

సరకుల ధర మింటి కెగిసె,
వరి పంటలు నీట గలిసె, వరదలు రాగా,
చిరు సాయము సరి పోదని
సిరి వలదను వాని కిలను చిక్కులు గాదా!!

ఖర పదముల మ్రొక్కి నపుడె కలుగును సుఖముల్!!!

హరి పదములు, రమకు వరము,
పురహరి పదములు, గిరిజకు పరమై పోయెన్,
పుర జనులకు సద్గుణ శే
ఖర పదముల మ్రొక్కి నపుడె కలుగును సుఖముల్!
(శంకరాభరణం  బ్లాగు లో30-10 -2010 నాటి  సమస్యా పూరణ-138లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, December 25, 2010

బలరాముడు సీత జూసి ఫక్కున నవ్వెన్!!!

తుల నాడిన వాడిని గని,
తల నంటెను చెప్పు తోడ, తరుణిరొ ,భద్రా
చలమున నవమిన నేటి స
బల!రాముడు సీత జూసి ఫక్కున నవ్వెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో 29 -10 -2010 నాటి  సమస్యా పూరణ-137 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

క్రీస్తు శిలువ నెక్కి కీర్తి శిఖరమెక్కె !!! క్రిస్టమస్ శుభా కాంక్షలు.!!!

క్రీస్తు శిలువ నెక్కి, కీర్తి శిఖరమెక్కె ! 
ప్రజలు గొలిచి రతని ప్రభువు జేసి !
పాపు లందు నతడు  పరమాత్మనే జూసె!!!
మంద వారి మాట !మణుల మూట !

క్రిస్టమస్ శుభా కాంక్షలు.

Friday, December 24, 2010

పుత్తడి ధగ ధగలు,ఇత్తడి కబ్బునా?

ఉత్తముండు పలుక చిత్తగించుట మేలు,
చెత్త మాట లేల చెవిని  నింప,
పుత్తడి ధగ ధగలు,ఇత్తడి కబ్బునా?
మంద వారి మాట!మణుల మూట!!

పచ్చి మాంసమ్ము దినువాడు,బ్రాహ్మణుండు!!!

పచ్చి మాంసమ్ము దినువాడు,బ్రాహ్మణుండు,
ప్రక్క ప్రక్కనే నిలబడి మ్రొక్కినారు,
పరమ నిష్టతో పరమేశు పార్వతులను,
భుక్తి కొరకునొకరు,మరి ముక్తికొకరు!

Thursday, December 23, 2010

గురువు పరువు ఊరి మురుగులో గలిపిరి.!!!

చదువు చెప్పు బుధులు  సరసాల కొడగట్టి,
శిష్యు రాండ్ర నకట చెరచి రైరి
గురువు పరువు ఊరి  మురుగులో గలిపిరి.
మంద వారి మాట మణుల మూట!
(నేడు TV9 లో ప్రసారమైన వార్తలకు స్పందించి వ్రాసినది )

పగటి పూట చంద్రుని గనె పద్మ నయన!

గగన మంటిన సౌధమ్ము సిగన నున్న,
రవిని మరిపించు   నంబాని భవన కాంతి,
రేయి వెళ్ళినా రేరాజు రేఖ వోలె,
పగటి పూట చంద్రుని గనె పద్మ నయన!
(శ్రీ ముఖేష్ అంబాని గారి భవనాన్ని
మొన్ననే నెట్లో చూసాను చాల బావుంది)

పరిచయంబులు,ప్రణయంబు,పరిణయంబు,
వరుసక్రమమున జరిగె శ్రీవాణి,చంద్ర
ములకు,తొలిరేయి కోమలి కలలుపండ,
పగటిపూట చంద్రునిగనె పద్మనయన!
(శంకరాభరణం  బ్లాగు లో 27 -10 -2010 నాటి  సమస్యా పూరణ-135 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, December 22, 2010

బాధ నార్చువాడు భగవంతుడే గదా!

బాధ లెఱుగ లేరు బాధించు వారలు,
బాధితులకు  తెలియు బాధ తీరు,
బాధ నార్పు వాడు భగవంతుడే గదా!
మంద వారి మాట మణుల మూట!!!

నీతి విలువలు దిగజారె ! రీతి మారె!!! & వెన్నదొంగని బిలిచిరి చిన్నజేసి!!!

ధీరుల దరిన జేరిన ,తీరు టెట్లు
కలలు? కడుపు నిండదు,కాసు లేల రాలు?
నీతి విలువలు దిగజారె ! రీతి మారె!
జార చోరుల కీర్తించు వారె ఘనులు!

గిరిని కొనగోట నిలిపిన హరిని గనిరి,
ఉల్లముల నెత్తుకెళ్ళిన గొల్లడనిరి,
వెన్నదొంగని బిలిచిరి చిన్నజేసి,
జారచోరుల కీర్తించువారె ఘనులు! 

Tuesday, December 21, 2010

సంయ మీoద్రుడు గోరెను సంగమమును!

జ్ఞాన మూర్తుల, తత్వ విజ్ఞాన ధనుల,
నుర్వి జనులకు ,అధికార గర్వితులకు,
మంచి చెడులను, సూచించ నెంచి,తపసి ,
సంయ మీoద్రుడు గోరెను సంగమమును! 
(శంకరాభరణం  బ్లాగు లో25-10 -2010  నాటి సమస్యా పూరణ133 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షింఛి ఆనందింప వచ్చును.) 

మనసు మలిన పడిన మార్గమ్ము చీకటౌ!

మనసు మలిన పడిన మార్గమ్ము చీకటౌ!
కళ్ళు గాన రావు ముళ్ళు గ్రుచ్చు,
మాధవుడిని  గొలువ మలినములెడమౌను !
మంద వారి మాట! మణుల మూట!

Sunday, December 19, 2010

కవుల కొలను లోకి కలహంస లడుగిడె!!!

కవుల కొలను లోకి కలహంస లడుగిడె,
గనుడు కన్ను లార కవిత లెల్ల,
పూరణాలు కనక తోరణాలై దోచు,
మంద వారి మాట!మణుల మూట!!!
(శంకరాభరణం బ్లాగులో ఉద్దండు లైన కవి పండితుల సమస్యా పూరణలకు స్పందించి వ్రాసిన పద్యం)

దైవమున్నదె సుతునకు తల్లి కంటె!

వెతల నెన్నింటి కోర్చెనో వెలుగు నీయ,
బ్రతుకు తీపిగా జేసెను భవ్య రీతి,
అన్ని లోకమ్ము లందున నరయ వేఱె
దైవమున్నదె సుతునకు తల్లి కంటె! 

(శంకరాభరణం  బ్లాగు లో24 -10 -2010  నాటి సమస్యా పూరణ132 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షింఛి ఆనందింప వచ్చును.) 

Saturday, December 18, 2010

సొర చెట్టుకు బీర కాయ సొంపున గాచెన్!

ఎరువులు ఎచటివి వేసెనొ,
బరువులు తరువుకు తగవని భావింపగనో,
గురువులు బ్రహ్మము చెప్పెనొ !
సొర చెట్టుకు బీర కాయ సొంపున గాచెన్! 

(శంకరాభరణం  బ్లాగు లో 23 -10 -2010 నాటి  సమస్యా పూరణ-131 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, December 17, 2010

కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !

1) రవి గాంచని చోటుల నిల
    కవి గాంచును తన మనముతొ కవితలు సేయన్ ,
    కవి కొమ్మల గెంతి నపుడు,
    కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !

2 . రవియు తన కిరణములతో,
     కవి తనపద చరణములతొ గంతులు వేయన్,
     యువసతి కోతని తిట్టెన్
     కవివరు కపితోడ బోల్చగా మెచ్చి రహో !
(శంకరాభరణం బ్లాగులో  లోగడ  సమస్యా పూరణ-130 లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.
  ఇతర కవి మిత్రుల పూరణలను యీ బ్లాగులో చదివి రసాస్వాదన పొందవచ్చును.)

చవితి చంద్ర వంక చందంబుగా నుండు!!!

 ఓర్పు లేని నేర్పు ,మార్పులేనీకూర్పు,
 బాధ నార్ప లేని బడుగు  తీర్పు,
 చవితి చంద్ర వంక చందంబుగా తోచు !
 మంద వారి మాట! మణుల మూట!!!

Thursday, December 16, 2010

గణ నాయకు గళము నందు గరళము నిండెన్ !!!

1) గణతంత్రపు భారతమున
    గణి యింపగ గలరు పెక్కు ,గర్వము మీరన్,
    రణ శూరులు, మును చైనా
    గణ నాయకు గళము నందు గరళము నిండెన్ !
2) గణపతుల నంప,విద్యుత్
    మణి కాంతుల మధ్య జలము మలినము కాగన్
    ఫణి భూషణు సుతు మనుగగ
    గణ నాయకు గళమునందు గరళము నిండెన్ !

(శంకరాభరణం బ్లాగులో లోగడ సమస్యా పూరణ -129 లో ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.బ్లాగులో ఇతర కవి మిత్రుల
పూరణలు చదివి ఆనందించ వచ్చును. 

Wednesday, December 15, 2010

బోధించుట రాని గురువె పుజ్యుండయ్యెన్ !!!

వేదించు టె పని పాటై,
శోధించును తప్పులన్ని చోద్యము తోడన్,
బాధించు మంత్రి కొడుకై,
బోధించుట రాని గురువె పుజ్యుండయ్యెన్ ! 
(శంకరాభరణం బ్లాగులో 20 -10 -2010 నాటి సమస్యా పూరణ  -128 లో ఇచ్చిన  పూరణకు చేసిన పూరణ.
ఇతర కవిమిత్రుల మేటి పూరణలను ఆ బ్లాగులో  చూసి రసాస్వాదన చేయ వచ్చును.

Tuesday, December 14, 2010

చర్చ లేవి లేవు, కుర్చీల సాక్షిగా !!!

 చర్చ లేవి లేవు, కుర్చీల సాక్షిగా ,
 శీత కాల సభలు, భీతి గొలిపె !!! 
 పార్ల మెంటు తీరు! పౌరులు బేజారు!!
 మంద వారి మాట ,మణుల మూట !!

కూడు, గూడు, గుడ్డ కుందేటి కొమ్మాయె!

రోజు గోటి పైన రోకటి పోటాయె,
ధరలు పెరిగి, బ్రతుకు నరక  మాయె,
కూడు, గూడు, గుడ్డ కుందేటి కొమ్మాయె!
మంద వారి మాట, మణుల మూట! 

Monday, December 13, 2010

కలలు దీరినాక కాసులు దెమ్మనె?

ఏరి,కోరి,పోరి,నారిని చేపట్టి
కాపు రమ్మువరకు కథలు జెప్పె !
కలలు దీరి పోయె  కాసులు దెమ్మనె?
మంద వారి మాట మణుల మూట! 

యతి, విటుడు గాక పోవునే యతివ బిలువ!

యవ్వనపు ప్రాయమున వాంఛ లెవ్వరికిని
మతుల బోగొట్టు, మగువల మనసు దోయ
వెతలు బలు రీతి బడుదురు, వెకిలి ప్రేమ
యతి, విటుడు గాక పోవునే యతివ బిలువ! 

(శంకరాభరణం బ్లాగులో 19 -10 -2010 నాటి  సమస్యా పూరణ -127
 లొ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ .తోటి కవిమిత్రుల యితర మేటి పూరణలను మీరు
 ఆ బ్లాగులో చూసి రసాస్వాదన పొందవచ్చును.)

Sunday, December 12, 2010

చీకాకు పరిచి చివరకు!!!

చీకాకు పరిచి చివరకు,
ఏకాకిని చేసినారు, ఎదిగిన మేకై,
మాకేమి వదులు మెతుకని,
కాకా కేకే నటంచు కాకులు అరిచెన్! 

Saturday, December 11, 2010

కోడలు మామ జూసి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్ !.

మేడలొ దూరినారు కను మేరన కాంచి(చ)న భూషణాల, కై
దాడిని జేసినారు నవ దంపతులిర్వురి గట్టి వేసి, నో
గోడకు నెట్టిరా ధములు కోమలి నోటిన మాటరాక ,నా
కోడలు మామ జూసి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్ !.
వేడెను వేల్పు లెల్లరను వీరిని వారిని జాబు కోసమై
వీడెను మబ్బులట్లు తన యిక్కటు లన్నియు,మంచి జీతమే
జూడగ, చూడగా కుదిరె జోడు, సహోదరి ముద్దు కూతురే ,
కోడలు మామ జూసి కను గొట్టెను రమ్మని సైగ జేయుచున్!

(శంకరాభరణం  బ్లాగు లో 03 -10 -2010 నాడు వారాంతపు సమస్యా పూరణ లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

చేప చిక్క కుంటె,చెఱువు తప్పెట్లౌను?

 చేవ లేక పరుల చేతలు నిందించ ,
విజయ మెట్లు వచ్చు విశ్వమందు!
చేప చిక్క కున్న చెఱువు తప్పెట్లౌను?
మంద వారి మాట మణుల మూట !!!

Friday, December 10, 2010

పాహియని వేడితే పరమ పదమే నంట!!!

శశి ధరుడు,
విషగళుడు,
శుభకరుడు ,
భవహరుడు,
శివుడు,ఉమాదేవి విభుడు,శివుడు !!!
విశ్వజన హితమునకు విషము ద్రాగిన వాడు,
కోడెనాగుల దండ మెడను దాల్చిన వాడు,
పులితోలు వలువగా మొలను జుట్టిన వాడు,
శూల డమరుకములను కేల బట్టిన వాడు,
శివుడు  శోకమాపకుడు,.శివుడు!
కోరితే తీరైన వరము లిచ్చునటంట,
ముడుపు కడితే చాలు యిడుము లెడ మౌనంట,
మ్రొక్కితే ముక్కంటి  ముక్తి నొసుగునటంట,
పాహియని వేడితే పరమ పదమే నంట!
శివుడు లోక బాంధవుడు, శివుడు!!!

సీతా !మానస చోరు డెవ్వడనినన్ శ్రీ కృష్ణ మూర్తే గదా !!!

మాతాజానకి నిన్ను నే ను గొలుతున్ మాపాలి దైవంబుగా
నాతో డె ప్పుడు వీడ కుండుము సదా నా భాగ్య సంధాయినీ
నీతో జెప్పెద జాంబవంతుని సుతన్ నీ రాము తో జెప్పవే
సీతా !మానస చోరు డెవ్వడనినన్ శ్రీ కృష్ణ మూర్తే గదా ! 
(శంకరాభరణం బ్లాగులో 18 -10 -2010 నాటి వారాంతపు సమస్యా పూరణ -13
 లొ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ .తోటి కవిమిత్రుల యితర మేటి పూరణలను మీరు
 ఆ బ్లాగులో చూసి రసాస్వాదన పొందవచ్చును.) 

Thursday, December 9, 2010

సోనియా వెలుగై వరముల దానము చేసిన,!!!

దీనుల చీకటి బ్రతుకులు,
హీనముగా మారె ధరలు హెచ్చుట చేతన్!
సోనియ వెలుగై వరముల
దానము చేసిన,మనమున దైన్యత తొలుగున్!!!

(శ్రీమతి సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.)

కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!!

భీష్మ తీక్షణoపు భీకర పోరును,
నోపలేక శౌరి నోర్మివీడె!
వీరు డుండ!, రాదు విజయమ్ము,ననిజెప్పె
కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!! 

(శంకరాభరణం  బ్లాగులో సమస్యాపూరణం-163  లొ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ )

Wednesday, December 8, 2010

లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రు పై ..!!!



శృంగార జ్వర రోగ పీడితు లిలన్ చూడంగ నున్నారుగా 
శృంగారంబను రాగ భూతము మదిన్ చిత్రంబుగా జేర , దై
త్యాంగన్ తా చరబట్ట లేచి మద పైత్యంబెక్కి , పైపైన , వా
లంగా నెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె  దైత్యేంద్రు పై ..
(శంకరాభరణం బ్లాగులో లోగడ యిచ్చిన వారాంతపు సమస్యా పూరణకు చేసిన పూరణ.)

Tuesday, December 7, 2010

భవ దీయుల మమ్ము బ్రోవు బాధలు దీరన్ !!!

భవ మోచని, కాత్యాయని,
భవ దీయుల మమ్ము బ్రోవు బాధలు దీరన్
నవవిధ పూజలు సేతుము,
నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్ !
(శంకరాభరణం  బ్లాగులో  లోగడ యిచ్చిన సమస్యా పూరణం-121  కి చేసిన  పూరణ.)

Monday, December 6, 2010

కడకు ప్రజల బ్రతుకు , కన్నీటి పాలురా!

పాలకులకు జూడ పాలుగా కనుపించు,
వైరి పక్షముకవి నీరు తీరు !
కడకు  ప్రజలకవియె కన్నీరుగాతోచు !
మంద వారి మాట మణుల మూట!!!

భార్య లిద్దరు, శ్రీ రామ భద్రునకును !

ఇడుము లనెడము జేయువాడిన కులేషు
డొక్క డేయని దలపోసి మ్రొక్కి నారు
ప్రభువు దక్కగా, చిక్కగా, ప్రభువు దేవు
భార్య లిద్దరు, శ్రీ రామ భద్రునకును ! 
(ప్రభుదేవ్ ప్రఖ్యాత  డ్యాన్సు మాస్టరు  మరియు నటుడు .ఆయన సమస్యను
 సమస్యా పూరణంలో తీసుకోవడం జరిగింది.)
(శంకరాభరణం బ్లాగులో లోగడయిచ్చిన సమస్యకు  చేసిన పూరణ ). 

Sunday, December 5, 2010

పుడమి తల్లిని సేవించి పూజ్యులైరి !!!

పదులు వందలు వేలను పక్కనెట్టి
పుడమి తల్లిని సేవించి పూజ్యులైరి
ఎదగడానికి ఎన్నెన్నొ ఎత్తుల మర
చదువు రానట్టి వారె విజ్ఞాన ఖనులు
(శంకరాభరణం  బ్లాగులో లోగడ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ)

గతి తప్పిన రావణపురి గాల్చెన్ కూల్చెన్!!!

అతులిత బలధాముడు,కడు
చతురతతో రఘుకులపతి సతియగు సీతన్,
వెతుకగ మారుతి  జొచ్చెన్,
గతి తప్పిన రావణపురి గాల్చెన్ కూల్చెన్!!!

Saturday, December 4, 2010

ఎలుక ఎగిరి దూక ఏనుగు బెదురునా!

ఎదుటి వాని బలము ఏమాత్ర మెంచక,
బరిలొ దిగిన గలుగు భంగపాటు!  
ఎలుక వెక్కిరించ  ఏనుగు బెదురునా!
మంద వారి మాట మణుల మూట!

సుచరితులెవ్వరు మెచ్చరు!

ఉచితానుచితములు మరిచి,
విచలితులుగ జేయు మాట విధమును చరితన్,
సుచరితులెవ్వరు మెచ్చరు!
వచియించిన చతుర మతిన వసుధయె వశమౌ!!!  

గౌరికుమారరార మము గావగ!!!

గౌరికుమారరార మము గావగ రావగదేల? మేము మీ
వారలమేర! మమ్ములను వర్ధిల జూడగ నేరమౌర?మా
వారును వారివారి పరివారము వారల బ్రోవుమంచు,బం
జారులు పూజ సేయగని సాధు జనుల్ పులకించి రెల్లరున్!  

(శకరాభరణం బ్లాగులో 3 .11 .10 నాడు వారాంతపు సమస్యాపురణ -14 లో  ఇచ్చిన  సమస్యకు చేసిన పూరణ .)

Friday, December 3, 2010

సిరిపురిలో బుట్టలేదు,చింతామణిగా !

సిగన నెలరాశి చిద్విలాసి, జడ సుడిన
పరుగుల తరంగ గంగ,సగాన పారు,
విలయ కారుని విలక్షణ విశ్వరూప,
రూప్యమున కారు డాలర్లు గోప్యమనర.
కరమున కాసులు చాలవు
సిరిపురిలో బుట్టలేదు,చింతామణిగా
ఎర వేయగ బెట్టన్ ఏ
కరువు, మగన కంపుమూట కష్టము దీర్చెన్. 

( లోగడ శంకరాభరణం బ్లాగులో చేసిన పూరణలు)

Wednesday, December 1, 2010

చదువుల్నిచ్చెడు, వాణినే గొలుతు, నా సర్వస్వ మర్పించుచున్ !!!!!

దియా గౌతమి తీరమందు వెలిసెన్ నవ్య ప్రభల్ జిమ్ముచున్ ,
నదియే బాసర! వాసియై భువికి కి యానందమ్ము జేకూర్చగా,
హృదిలో భక్తిసరాగముల్ గలుగ యా యుల్లాస హాసాన యా
చదువుల్నిచ్చెడు, వాణినే గొలుతు, నా సర్వస్వ మర్పించుచున్ !

(శకరాభరణం బ్లాగులో(13-10 -2010) దత్తపది-8 లో యిచ్చిన "నయా, కియా,దియా,గయా  ."పదాల నుపయోగించి
ఏ వృత్తములో నైనా ఇష్టదేవతా  ప్రార్థన జేయవచ్చునన్న దత్తపది కి స్పందించి వ్రాసిన పద్యం )