Tuesday, June 28, 2011

ఓనమాలు రాని యొజ్జ మేలు!!!

విద్య వచ్చి యుండి ,వినయమ్ము లేనట్టి,
నీతి,రీతి లేని భీతి గొల్పు
పనులు జేయు నట్టి,బరమ మూర్ఖునికంటె

ఓనమాలు రాని యొజ్జ మేలు!!!


(శంకరాభరణం  బ్లాగు లో26-06-2011 నాటి  సమస్యా పూరణ-374లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

నవరత్న పద్య మాలిక!!!

 శ్రీ కొక్కు  అశోక్ కుమార్  B .Sc .B.Ed  మేడిపెల్లి(జగత్యాల)మండల M.E.O గారుఈ నెల జూన్ 30{2011) న   పదవీ విరమణ చేస్తున్న సందర్భమును పురస్కరించుకొని వారి చిన్న బావ మంద పితాంబర్  గారు సమర్పిస్తున్న నవరత్న పద్య మాలిక!!!  
1
"కొక్కు సత్య నారాయణ" కొడుకతండు ,
సుమతి "రాధకు " గారాల సుతుదతండు,
నామము "అశోక్ కుమారు"డు,నయము మీర
సతి "సుజాతకు" రాగాల పతియతండు.!!!
2
 ఆచార్యుని తనయుండై
నాచార్యుల కెల్ల మిగుల నాత్మీ యుండై
నాచార్యుండే నతడై 
నాచార్యు లకే నతండు నధికారయ్యెన్!!!


3
తెల్లని నవ్వుల రువ్వుచు,
పిల్లల మది దోచినావు ,ప్రేమగ వారిన్ 
మెల్లగ విద్యా గంధపు  
వెల్లువలో తడిపినావు  విజ్ఞాన నిధీ !
4
అధికారతనే యైనన్ 
నధికారిగగాక నతడు నాత్మీయతతో 
విధులన్నియు సంప్రీతిగ 
బుధులందరుమెచ్చ,జేసి  పూజ్యుండయ్యెన్ !!!

5
హంగులు లేవుజూడ , దరహాసము మోమున జిందులేయ ,నే
రంగుల నద్దినా వొగద ,రాళ్ళకు విద్దెల సారమద్ది,"సా
రంగ పు రంబునందు ",గిరి రాజుల పిల్లల కెల్ల వర్ణ  సా 
రంగమవై ,జనాదరణ రాజస మొప్పగ బొందినావిలన్ !!!    


6
వేడకనే వరము లొసగి 
తోడుగ నెప్పుడు నిలబడి త్రోవను జూపే 
వాడివనిరి "మేడి పెల్లి" న , 
వాడని బంధము గనబడె వారిజ నేత్రా!!!

7
పాఠశాల  లన్న ప్రాణంబు నిచ్చును
పిల్లలందుప్రేమ   వెల్లి విరియు
విద్య గొప్ప దనము వినయమ్ముగాజెప్పి
వినుతి కెక్కె నతను విమల మతుడు !
8
మాననీయుండు  విద్దెల  మాంత్రికుండు,
గర్వ మిసుమంతయునులేని కార్మికుండు
దాన ధర్మమ్ము జేసిన ధార్మి కుండు ,
భావి పౌరుల  మేలెంచు భావుకుండు ,
శుభ కరుండు సద్గుణ శోభితుండు ,
సత్య వచనుండు సజ్జన సమ్మతుండు!!!
9
మదిలో మల్లెలు  పూయగ
పదుగురు నిను మెచ్చినారు ,పరిణిత మతితో
పదవికి వన్నెల నద్దిన
చదువుల దొర ,నీకుగల్గు చక్కటి శుభముల్!

Monday, June 27, 2011

ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!


చెలువము మీరగ నాడిరి
వలపన్నియు మునిపనుపున వగలొలుకంగన్,
యిలనేలు హరిశ్చంద్రుని, 

యెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!

 (శంకరాభరణం  బ్లాగు లో21-06-2011 చమత్కార పద్యాలు -82     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Sunday, June 26, 2011

ఐక మత్యమ్ము, గలిగించు నధిక హాని!!!

ఐక్య మౌదురు నవినీతి నట్టె బెట్ట
ఐక మత్యమ్ము గనిపించు నణగ ద్రొక్క ,
దోచు కొనుటలో మిన్నగా  దొరల కున్న
ఐక మత్యమ్ము, గలిగించు నధిక హాని!!
!



(శంకరాభరణం  బ్లాగు లో24-06-2011 నాటి  సమస్యా పూరణ-373లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Saturday, June 25, 2011

మందారము వంటి మోము

పొందుగ కందెన పూయగ
మందారము వంటి మోము మారెను,హోళీ
సందడి నందున,సుందరి
నందవికారమె బ్రతుకుననానంద మిడున్!!!



కందెన = ఒకవిధమైన నల్లని రంగు   

(శంకరాభరణం  బ్లాగు లో22-06-2011 నాటి  సమస్యా పూరణ-371లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Friday, June 24, 2011

వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి!

వన్య జీవుల రక్షింప వలెనటంచు
వ్యాఘ్ర సింహాల జింకల వర్ణ పటము
లడవి ముంగిట బెట్టిగ నావు యొకటి
వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి!




(శంకరాభరణం  బ్లాగు లో21-06-2011 నాటి  సమస్యా పూరణ-370లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Thursday, June 23, 2011

కప్పిచెప్ప నదియె కవిత యగును !

తప్పు పనుల జేయ తగదని వారించి 
యొప్పు పనుల గొప్ప విప్పి జెప్పి 
ముప్పు దెచ్చు నట్టి మూఢ నమ్మకముల
కప్పి,చెప్ప నదియె కవిత యగును !




(శంకరాభరణం  బ్లాగు లో20-06-2011 నాటి  సమస్యా పూరణ-369లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Tuesday, June 21, 2011

చింతా మణికంటెమంఛి చెలువలుగలరే !


ఎంతగ సంపదనున్న,శ 
మంతకమణి బోలునొక్కమణియేదైనన్
చెంతన గలిగిన, తొలగదె  
చింతా! మణికంటెమంఛి  చెలువలుగలరే


(శంకరాభరణం  బ్లాగు లో18-06-2011 నాటి  సమస్యా పూరణ-367లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  



Monday, June 20, 2011

ఉత్తరమున భాను బింబ ముదయంబాయెన్ !!!

చిత్తరువు గీసి, కోమలి
చిత్తమ్మును దోచెనేమొ,చిన్నది ప్రేమో
న్మత్తునబడె, నేమున్నదొ
నుత్తరమున, భాను బింబ ముదయంబాయెన్ !   

  
(శంకరాభరణం  బ్లాగు లో18-06-2011 చమత్కార పద్యాలు -79     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     

Saturday, June 18, 2011

భారతీయత మనకిదే భారమయ్యె !

నీతి యన్నది గనరాదు నేత లందు,
ప్రీతి లేదులే పేదకు భీతి దప్ప
ప్రజలు గోరున దేమిటో ప్రభుత గనదు
భారతీయత మనకిదే భారమయ్యె ! 
(శంకరాభరణం  బ్లాగు లో10-06-2011 నాటి  సమస్యా పూరణ-359లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Friday, June 17, 2011

వల్లకాడులో వివాహ మయ్యె!!

వద్దు, పెళ్లివద్దు ,వల్లకాడునవద్దు
తగిన చోటు గాదు తమకు ననిన,
భూతనాథుడుండు  భూమియదేనన 
వల్లకాడులో వివాహ మయ్యె!!
(శంకరాభరణం  బ్లాగు లో09-06-2011 నాటి  సమస్యా పూరణ-358లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Friday, June 10, 2011

చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!!!

రామ పత్నినాశించిన రావణుండు
రాము తోపోరి జచ్చెను రణమునందు !!
కోమలమ్మైన మానిని గోరి,మదన 
చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు!!! 
(శంకరాభరణం  బ్లాగు లో08-06-2011 నాటి  సమస్యా పూరణ-357లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Thursday, June 9, 2011

గొడ్డుటావుపాలు కుండనిండె!!!

గొడ్డుటావుపాలు కుండనిండెననుచు
యడ్డగోలు మాటలాడతగునె?
గడ్డిమేయమఱిగి గద్దెనెక్కిన గొడ్డు
పాలనిచ్చుననుట పాడియౌనె?
(శంకరాభరణం  బ్లాగు లో07-06-2011 నాటి  సమస్యా పూరణ-356లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

భామాకుచమండలంబు భస్మం బాయెన్!

తామర గర్భుడు,కృష్ణుని 
 నామంబునబుట్ట,వానినస్యముజేయన్,
మామయె బంపిన పూతన
భామాకుచమండలంబు భస్మం బాయెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో08-06-2011 చమత్కార పద్యాలు -69     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 

Wednesday, June 8, 2011

కల్ల లాడువారె కవులు గాదె!

మేఘుడెన్నడైన మేసేజులిచ్చునా!
రాయికరుగునెట్లు రాగమునకు?
పూలునోళ్ళువిప్పి జాలిగాపలుకునా !
కల్ల లాడువారె కవులు గాదె!

మేసేజు = message=సందేశం
(శంకరాభరణం  బ్లాగు లో06-06-2011 నాటి  సమస్యా పూరణ-355లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 


Tuesday, June 7, 2011

తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్!

మాతృ మూర్తుల దినోత్సవ సందర్భంగా నొక తనయ తన తమ్ములతో అమ్మను సత్కరించు కొరకు ఒకరత్నాల హారాన్ని తెమ్మని, తాను గులాబిహారాన్ని తెచ్చి వేయు సమయంలో,

తమ్ములు  వేసినామనిరి తల్లికి ,రత్నపు హారమొక్కటిన్,
యమ్మకు బ్రీతి గూర్చగను, యన్నులమిన్న గులాబి పూలహా
రమ్మును ,వేయబోయి గనె, రత్నపు హారము లేకబోవుటన్,
తమ్ముల గాంచి కోపమున దామరసేక్షణ తిట్టె నయ్యెడన్!
(శంకరాభరణం  బ్లాగు లో08-05-2011 నాటి  సమస్యా పూరణ-333లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 
 

Monday, June 6, 2011

మగువను; బెండ్లాడె మగువ మరులుదయించన్!!!

సెగ దాకెనేమొ రాగపు,
నగు మోమునుజూచెనేమొ,నారిని మెచ్చెన్,
మొగమాట పడక నడిగెను
మగువను; బెండ్లాడె మగువ మరులుదయించన్!!! 
(శంకరాభరణం  బ్లాగు లో02-06-2011 నాటి  సమస్యా పూరణ-351లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 


Sunday, June 5, 2011

మూడు కనుల వేల్పు, ముర హరుండు !

ధర్మమాచరించి దానంబుజేయుచు
సత్య పథమునందు సాగు వారి
వాక్కులందునెపుడు వసియింతు మందురు,
మూడు కనుల వేల్పు, ముర హరుండు ! 
(శంకరాభరణం  బ్లాగు లో31-05-2011 నాటి  సమస్యా పూరణ-348లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )    
 


Wednesday, June 1, 2011

గొప్ప వారికుండు గొంచె బుద్ధి !!

(మాజీ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నారాయణ దత్ తివారి ఉదంతము దృష్టిలో బెట్టికొని)

రాజ్య పాల కుండు రాసలీలల దేలి
రాజ భవను విడిచె రచ్చగాగ
తప్పు డైన పనులు ముప్పు దెచ్చెను గదా
గొప్ప వారికుండు గొంచె బుద్ధి !!

ధర్మసూను డతను ధర్మమ్మునేవీడి
ద్రోణుని హత మార్చ దోషియయ్యె
నంత రాత్మ జంపి వింతగా మాట్లాడె
గొప్ప వారికుండు గొంచె బుద్ధి!!!.  

(శంకరాభరణం  బ్లాగు లో20-05-2011 నాటి  సమస్యా పూరణ-343లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )