Tuesday, November 30, 2010

తిరుమల గిరి వేంకటపతి తీరెను కొలువై!

తిరుపతి నగరపు సిగపై
తిరుమల గిరి వేంకటపతి తీరెను కొలువై!
అరిచిరి అలిపిరి నుండే
మురిపెపు మూటల ముడుపులు ముంగిట దింపన్ !

పిలిచిన పలుకగ లేవా!
అలిసితివా?కలిసి సోలిసి అలివేణులతో!
వెలిసెను  తమ ఇలవేల్పని
తలిచిరి పలువురు!నినుగన తరిలిరి గొలువన్!  

Monday, November 29, 2010

మనిషి మనిషేల మనిషౌను? మహిష మౌను!

మనిషి ,మనిషిని,మనిషిగ మదిని గనని,
మనిషి మనిషేల మనిషౌను? మహిష మౌను!
మదము మనిషిని,మనుసును మలిన పరచు,
మనసు నిండుగా మమతున్న మనిషె మనిషి!

Sunday, November 28, 2010

ఏదారిన పరుగిడెనో ?

పాదాలు లేక పరుగులు,
రాదారుల యందు ఏల రాజకుమారా,
ఏదారిన పరుగిడెనో ,
ఆదాయపు పన్ను గట్టె అచ్చెరు వొందన్!

Saturday, November 27, 2010

ప్రీతి గొలిచిరి శ్రీరాము త్రేత మందు !!!

నృపుల కనులార గాంచిరి కృతము లోన
ప్రీతి గొలిచిరి శ్రీరాము త్రేత మందు
నేటి నేతల దలుపగా ఏటి కంచు
కాంక్ష లుండవు ప్రజలకు కలి యుగమున!

Friday, November 26, 2010

ఎదుగు బొదుగు లేని వదరు బోతులు నూట...

పాడి యైన మాట పగవాడు పలికినా,
వినగ తగును విధిగ విమల మతులు!
ఎదుగు బొదుగు లేని వదరు బోతులు నూట
పదుగు రాడు మాట పాప మగును !

Thursday, November 25, 2010

మత్తు గుమ్ముగా మనిషిని చిత్తు జేయ!

పాడ,పదముల పరుగుల పట్టు రాక,
ఆడ, తడబడి గడిబిడి అడుగు  లేయ,
మత్తు గుమ్ముగా మనిషిని చిత్తు జేయ,
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె!

కోరి వచ్చె పదవి పోరు లేక !!!

మార్పు జరిగి ముఖ్య మంత్రయ్యె స్పీకరు,
కిరణు రెడ్డి మనసు మురిసి మెరిసె,
సోని యమ్మ కరుణ సోకెరా రెడ్డిపై!
కోరి  వచ్చె పదవి  పోరు  లేక !!!   

శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు!!!!! 

Wednesday, November 24, 2010

కాకి గోల జేసి పీక్కుతింటుంటారు!

ప్రజల సొమ్ము పైన పట్టింపు లేదురా!
పార్ల మెంటు లోని పాలకులకు,
కాకి గోల జేసి కేకలేస్తుంటారు
మంద వారి మాట మణుల  మూట!

(గత కొన్ని రోజులుగా పార్లమెంటు జరుగుతున్నతీరు ఆవేదన కలిగిస్తుంది
  సమావేశం ప్రారంభం కావడం,అతి పెద్ద కుంభ కోణముపై J P C వేయాలని,
  ప్రతి పక్షాలు పటుబట్టడము,అంతే పట్టుదలతో అధికార పక్షం J P C వేయడము కుదరని
  బెట్టు చేయడం కొద్ది రోజులుగా జరుగుతున్నతంతు.అసలే లక్షా డెబ్బది వేల కోట్ల స్కాం అని
  అంటున్నారు.పార్లమెంటు సమావేశాలకు నిముషానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని
  లెక్కలు చెప్పేది వాళ్ళే! ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగము చేసేది వాళ్ళే!జవాబు దారితనము
  లేనే లేదు, ఆపై అధికారానికి ప్రాకులాట.అవినీతికి ఆస్కార మిచ్చేది,అవినీతిని పెంచి పోషించేది,
  అవినీతిని సర్వ శక్తులోడ్డి రక్షించేది ప్రభుత్వమే నని సామాన్యుల కనిపిస్తుంది.అందులో అతిశయోక్తి
  లేదు.
 గత 60 ఏండ్లలో  అవినీతి తో దోచి ,విదేశాలకు తరలించిన సంపద లెక్కలు తెలుసుకొంటే మీరు
 ఆశ్చర్య చకితు లౌతారు .వివరాలకు "మీ కోసం"బ్లాగు లోని "భారత దేశం  లోని అక్రమ
 సంపాదకులు 1948  నుండి  2008  వరకు 20 లక్షల కోట్ల డబ్బును విదేశాలకు తరలించేరు "
 అన్న 22 -11 -2010 తేది పోస్టును  చూడండి.ఇదంతా మనదేనా అని గుండెలు బాదుకుంటారు.)

ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర!

ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
గాలి కొడుకునకును గలరు మువురు
నరుని కిరువురు మరి నకులుని కొక్కరే
పంచ పాండ వులన పదుగురు కద !

(నలుగురు +మువ్వురు  +ఇరువురు +ఒక్కరు = పదుగురు.)
  4+3 +2 +1 =10 .

ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు
పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడుగ
చెప్పు వారి గనక చెప్పెను పంతులే
పంచ పాండ వులన పదుగురు కదా ! 
( పది లొ =పదవ తరగతి ,డీవొ = D E O  సరదాగా వ్రాసినది ఎవరినీ నొప్పించాలని కాదు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు క్షమాపణలతో}

Tuesday, November 23, 2010

వన్నె లాడి వలచి, వెన్నంటి వచ్చిన?

ఇంద్ర సఖుడుగాదు, ఇంతుల నెఱుగడు,
వేద మంత్ర పఠన, వేల్పు కొలువు,
వన్నె లాడి వలచి, వెన్నంటి వచ్చిన
చంద్ర ముఖిని జూసి జెడిసెనయ్యొ !             

Monday, November 22, 2010

అర్ధ రాత్రి సతిని అచ్చోటె వదిలేసి!,

అర్ధ రాత్రి సతిని అచ్చోటె వదిలేసి,
దిగెను సెల్లు కొఱకు దిగులుపడక
తల్లి ,పిల్ల  కంటె సెల్లంత  ముఖ్య మా?
మంద వారి మాట మణుల మూట!

(ఇది 15 -11 -2010 నాడు జరిగిన సంఘటన.మేము ప్రయాణిస్తున్న  షిర్డి నుండి సికింద్రాబాదు ట్రైన్ నంబర్7001 . స్లీపర్ S8 కోచ్ లో తోటి ప్రయాణికుడు అర్ధ రాత్రి పూట 3 గంటల సమయాన   పర్భని -ఉస్మానాబాద్ మధ్య సెల్లు టాయిలెట్ లో జారి పడిందని ,భార్య దగ్గరలో ఉన్న సెల్లును కుడా తీసుకొనివెంటనే రైలును దిగేసాడు.పాపం ఆమె కళ్ళ నీళ్ళ పర్యంత మైంది.ఇద్దరు చిన్నపిల్లలు ,మూడు పెద్ద మూటలు.ఆవిడకు రెండు సమస్యలు భర్త చీకట్లో అర్ధ రాత్రి పూట సెల్లు వెదుకులాటలో ఎన్ని అవస్థలు
పడ్తున్నాడో , ఇంటికి ఏలా రాగలడో అని ఒకటి, తనకు తన భర్త సెల్ నెంబర్ మాత్రమే జ్ఞాపకం ఉంది.దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది .తన సెల్ నెంబర్ కాని, ఇతర బంధువుల సెల్ నెంబర్లు గాని జ్ఞాపకము లేవు.ఇంటికి ఏలా చేరాలి అనే బాధ మరొక వైపు.అలా రాత్రంతా బాధ పడుతూనే ఉంది .మేము ధైర్యం చెప్పి ,ఆమెకు తోడుగా ఉండి,వారి పిల్లల్ని ,సామాన్లను మా సామాన్ల తో పాటు మోసి,సికింద్రాబాద్ స్టేషన్ బయటకు వచ్చి వారిని దగ్గరలోనే ఉన్న వారి బంధువుల ఇంటికి సురక్షితంగా పంపించడం జరిగింది. మరునాడు ఆవిడ మాకు కాల్ చేసి    తనభర్తతెల్లవారురాత్రి11గంటలకుఇంటికివచ్చినట్లుతెలిపింది,కృతఙ్ఞతలుతెలియజేస్తూ! .సెల్లు మాత్రం దొరకనే లేదట!  ప్రయాణంలో సెల్లులను జాగ్రత్తగా పెట్టుకోవడము,ముఖమైన సెల్ నెంబర్లను వేరేగా వ్రాసి పెట్టుకోవడము ఎందుకైనా  మంచిదని అనిపించింది.అతను అలా వెళ్ళడం ఎంతవరకు సబబో మీరే చెప్పాలి?)
  
                                                                                               

సూటి పోటైన మాటల ధాటి ఘాటు!

సూటి పోటైన మాటల ధాటి ఘాటు,
చేటు చేయును, స్నేహము బీటవారు,
కాటి కట్టెలా కడదాక కాల్చుచుండు,
ఈటెలే మేలు బాధించు మాటకంటె!

Sunday, November 21, 2010

రుద్రుని భజించువాడు దరిద్రుడగును!

చపల చిత్తముతోనెంత తపన జేయ
గలుగ నేరదు సిద్దియు ,కలిమి రాదు!
నిద్ర మత్తులో మునిగిన ముద్ర లోన
రుద్రుని భజించువాడు దరిద్రుడగును!

వెండి కొండపై నివసించు వేల్పు ఎవడొ,

వెండి కొండపై నివసించు వేల్పు ఎవడొ,
ముక్తి దాయకుండఖిలాండ శక్తి ఎవడొ ,
అట్టి జగజెట్టి ముక్కంటి ఆత్మలోని
భూత ములకు బ్రణతుడయ్యె బురహరుండు !

హరిసంకీర్తన యిడుముల నార్చును,

కార్తీ కమ్మున గిరిజా
మూర్తిని, కీర్తింప గలుగు మొక్షము! హరిసం 
కీర్తన యిడుముల నార్చును,
ఆర్తుల కోర్కెలు దీర్చును,అనితర కీర్తిన్!

శ్రీరమ కన్నుదోయి మురిసెన్ హరి చిన్మయ రూపు గాంచి,శ్రీ 
గౌరియు ఈశుజేరి మమకార సరాగపు డోలలూగె,వా  
ణీ రమణీయమై కమల నేత్రుని నాథుని  ప్రీతిజేసె,శృం 
గారత మీరగా పతుల గానము జేసిరి మొహనంబుగా!

Saturday, November 20, 2010

ఆయ కట్టు లేక ఆంధ్రలో ప్రాజెక్టు!!!

ఆయ కట్టు లేక ఆంధ్రలో ప్రాజెక్టు,
కట్టి రంచు వార్త పుట్టుకొచ్చె,
గుడ్డి పాలనంత చెడ్డవింతలసంత!
మంద వారి మాట మణుల మూట!

(11-11-2010 నాటి ఈనాడు దిన పత్రికలో "కాల్వలు తవ్వాక ఆయకట్టు వెదుకులాట"
శీర్షికన  "హింద్రి  నీవా" పై వచ్చిన వార్త చూసి వ్రాసినది ) 

దీన జనుల సేవ దివ్య మార్గమ్మనె!

సాయి షిర్డి లోన సత్యమై వెలిసెను,
సాయిని  గన గలిగె సంతసంబు,
దీన జనుల సేవ  దివ్య మార్గమ్మనె,
మంద వారి మాట మణుల మూట!

సాయికి సత్య కీర్తికిని,సద్గురు సద్గుణ సాధు మూర్తికిన్,
హాయిని గూర్చ మంగళపు హారతు లిచ్చిరి సజ్జనోత్తముల్,
శ్రేయము సేవ మార్గమని చేతల జెప్పిన చిద్విలాసి! నే
నాయువు గల్గునన్ వరకు ఆయన మార్గమె  నాశ్రయించెదన్ !!!

(బాబా గారిని షిర్డి లో 14 -11 -2010 నాడు దర్శించు  కొన్న
 సందర్భములో కలిగిన అనుభూతికి అక్షరరూపం )

Friday, November 12, 2010

పిల్లలు తారా జువ్వలు,పిల్లలు నవ్వుల ముల్లెలు,

బాలల దినమును (14 -11 -2010 ) పురస్కరించుకొని వ్రాసిన కవితలు .
కల్లలు తెలియని వారము,
యెల్లలు మామధ్య లేవు,యెపుడును మా మా
యుల్లము లందున స్నేహపు
జల్లులె కురియును తరగని  జయములు కలుగున్ !

పిల్లలు నవ్వుల ముల్లెలు,
పిల్లలు చల్లని  పిడుగులు  ,ప్రేమపు జల్లుల్,
పిల్లలు తారా జువ్వలు,
పిల్లల యల్లరె పుడమికి పెన్నిధి చూడన్ !

పసి బాలుడు మద్యమడిగె పాలొన్నననెన్ !

ముసి ముసి నగవుల బుడతడు
పసి వయసునె తన జనకుని పద్దతి గాంచెన్,
దసరకు మాత్రమె తండ్రికి,
పసి బాలుడు మద్యమడిగె పాలొన్నననెన్ !

అసుర పురిలోన జరిగిన ,
నిసి రాతిరి వేడుకలలొ నేమని చెప్పన్
అసురుల ఏలిక,నతి రూ
పసి,బాలుడు మద్య మడిగె పాలొన్న నన్ !

మంచి చెడుల చర్చ మాన్యులే జేతురు,

మంచి పనులు చేసి మరిచి పోవుట మేలు,
డప్పు వేసి గొప్ప చెప్ప తగదు,
మంచి చెడుల చర్చ మాన్యులే జేతురు,
మంద వారి మాట!మణుల మూట!

Thursday, November 11, 2010

సెల్లు లన్ని మాయ బల్లులై పోవంగ,

లాలు,బాబు గూడి లండనుఏలంగ,
లాడెనన్న దొరికి లాస్యమాడ,
సెల్లు లన్ని మాయ బల్లులై పోవంగ,
భాస్కరుడుదయించు(చె)పడమటి దెస !

Wednesday, November 10, 2010

రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్!

వేషము మారగ నేరడు
భాషయు విన సొంపు గొల్పు,పరువుకు లేదే
దోషము భేషజ మెరుగడు
రోషమ్మును వీడు వాడె రోషయ్య యగున్!

చేటు కాలమొచ్చె, చెప్పినా వినరాయె!

   చేటు కాలమొచ్చె, చెప్పినా వినరాయె,
   తాగి కారు తోల, తలలు పగిలె,
   బుద్ది మొద్దు బార సుద్దులు నిలుచునా!
   మంద వారి మాట!మణుల మూట!

Tuesday, November 9, 2010

ఆదా సేయగ కావలె

ఆదా సేయగ కావలె
ఆదాయపు వనరులు పలు ,అoధుoడేలా
ఆధారము లేక నడుచు
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే !

సింహములకు నుండు చిలిపి దోమల బాధ !

జనుల హితము కెట్టి పనులెన్ని జేసినా,
తృప్తి కలుగ బోదు తృణమె యగును
సింహములకు నుండు చిలిపి దోమల బాధ !
మంద వారి మాట!మణుల మూట!

Monday, November 8, 2010

చను పాలకు డబ్బపాలు సరిపో గలవా?

పెనిమిటికి రాణి మగనికి
చను పాలకు డబ్బపాలు సరిపో గలవా?
ఇనుమునకు కనక పూసలు
కను బొమలకు మీసము గన్నెర్ర గదా!

Sunday, November 7, 2010

తెలుగు పలుకు లందు తేనె లొలుకు,

  తెలుగు అక్షరంబు  తేజంబు ప్రాణంబు,
  తెలుగు పలుకు లందు తేనె లుండు ,
  భాష లందు వెలుగు,బంగారు  తెలుగురా!
  మంద వారి మాట!మణుల మూట!

తెలుగు బాల! తెలుగు పలుక వేల?

 తెలుగు అక్షరంబు  తేజంబు ప్రాణంబు,
 తెలుగు పదము లందు  తేనె లొలుకు
 భాష లందు వెలుగు! బంగారు  తెలుగురా !
 తెలుగు బాల! తెలుగు పలుక వేల?

Wednesday, November 3, 2010

డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బేర సర్వము,

డబ్బు, డబ్బు, డబ్బు, డబ్బేర సర్వము,
డబ్బు తల్లి,దండ్రి,డబ్బు సఖుడు,
డబ్బు లేని బ్రతుకు మబ్బురా మహిలోన,
మంద వారి మాట మణుల మూట !

డబ్బు పైన ప్రేమ,డబ్బుపై పేరాశ ,
తగదు గాక తగదు,తగదు తగదు,
అవసరమును మించి నత్యాశ చేటురా
మంద వారి మాట మణుల మూట!

(ధనం మూలం మిదం జగత్ ,అన్నారు పెద్దలు. ధనం, జీవన గమనంలో
అతి ముఖ్య మైనది అని  అందరు చెబుతారు మన అనుభవమూ చెబుతుంది,
అన్నింటికీ కావలసింది డబ్బే!అది లేకుంటే ఏది కదలదు ఏదీ జరగదు. కడుపు నిండదు,
 కాలు ముందుకు పడదు.అందుకే చతుర్విధ పురుషార్థ ములలో అర్థము
 అతి  ముఖ్య మైనదని  చెబుతారు పెద్దలు.అలాగని డబ్బే సర్వస్వము కాదు
ఆత్మీయత ,అనుబంధం ,అనురాగం, ఆప్యాయత ,మానసిక ఆరోగ్యం
ఇవన్ని డబ్బుతో కొనుక్కుంటే వచ్చేవి కావు.ధనమును సంపాదించే మార్గాలపైనే
అంతా ఆధారపడి  ఉంది.డబ్బు మీద తగని ప్రేమ,మొహం ,స్వార్థ  బుద్ది ఇవియే
అన్ని అనర్థాలకు హేతువులు.ధనార్జనకు ధర్మ మార్గానుసరణ యే అభిలషణీయం.
అది న్యాయం కూడ.నైతిక విలువలను తుంగలో త్రొక్కి,అవినీతి మార్గాలలో
అక్రమార్జన జేయడం ,అన్నీ తమకే కావాలనే దురాశ అన్నీ అవకతవలకు కారణం
అందుకే డబ్బును ఆర్జించడములో,వినియొగించడములో విచక్షణతో మెలగడమే
ఉత్తమం.)
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.   .   

Tuesday, November 2, 2010

పుట్టుటయె గాని గిట్టని పుణ్యజీవి

పుట్టుటయె గాని గిట్టని పుణ్యజీవి
ఉనికి నూహించఁ దరమె యీశునకు నైన
సుధను గ్రోలిన సురలను చూచి నామె?
పుట్టి నప్పుడే లిఖియించు గిట్టు మనుచు.

Monday, November 1, 2010

పండు ముసలి దెచ్చి కొండపై వదిలిరి,

   పండు ముసలి దెచ్చి కొండపై వదిలిరి,
   కన్న తల్లి పట్ల కఠిను లైరి  ,
   తనయు లైన వారి  తలపండు  పగలదా !
   మంద వారి మాట మణుల మూట!

(పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా వాసులు తమ కన్నతల్లిని
మభ్యపెట్టి తెచ్చి తిరుమల కొండపై వదిలి వెళ్ళిన ఉదంతం నిన్న
TV9 లో చూడ  కళ్ళలో నీళ్లుతిరిగాయి .తనను వదిలించు కోవడానికి
తన తనయులు పన్నిన పన్నాగానికి బలై ,చిగుటాకులా వణుకుతూ
ఆ మాతృమూర్తి పడుతున్న  ఆవేదన ,ఆమె హృదయ వేదన నిజంగా
కదిలించి వేసింది. ఆమె ఎప్పటినా తన వారలను చేరుకోవాలని కోరుకుంటున్నాను)