Monday, April 29, 2013

తగినది గాదయ్య !వేదధర్మము మనకున్ !!!


జగడము జీవన ప్రగతికి
తగినది గాదయ్య !వేదధర్మము మనకున్
జగతినగలవారలకున్
తగినది!తగుదారిచూపు తడబడువేళన్ !!!   
(శంకరాభరణం  బ్లాగులో  05-04-2013 నాటి  సమస్యా పూరణ-   1014 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, April 27, 2013

జనన మరణ గతులు జగదీశు క్రీడయౌ

నిన్న జనన మైన నేడు జీవితమౌను
తరలివచ్చురేపు మరణ మౌను
జనన మరణ గతులు జగదీశు క్రీడయౌ
మందవారి మాట మణుల మూట  !!!

Friday, April 26, 2013

శివశంకరయనిన బాప చింతన లెసగున్!!!

"శివరాతిరి దినమంతయు
శివనామముభక్తిమీర చింతనజేతున్
అవినీతి మకిలి తుడువుము
శివశంకర"యనిన బాప చింతన లెసగున్!!!

 (శంకరాభరణం  బ్లాగులో11-03-2013 నాటి  సమస్యా పూరణ- 990 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, April 25, 2013

సూనుని దీవనలు మనకు శుభకరము లగున్!!!

పూనికతోతనమనమున
జానకిరాములనిలిపిన చరితార్థుని నా
వానరయోధుని అంజన
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్!!!

 (శంకరాభరణం  బ్లాగులో  21-03-2013 నాటి  సమస్యా పూరణ-   1001  లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

మయసభ !!!

భూములుమాయమాయెగదభూరిగ సెజ్జులపేరుతో ,పరం
ధామునిసొమ్ములున్ కరిగెధర్మముతప్పెనుదారి నాయక
స్వాముల చేష్టతో ఖనిజసంపద గాలినగల్సెజూడగా
యేమనిజెప్పుదున్ మయసభేర్పడెరాష్ట్రమునందుసోదరా !

Wednesday, April 24, 2013

రావణ బ్రహ్మ!!!

                                                             రావణ బ్రహ్మ (ఏ కాంకిక )
(ఈ రచన 1969-1970 లో వ్రాయబడింది.  అప్పటి  నా సహ విద్యార్థి ,మిత్రుడు శ్రీ రామగౌడ్ గారు రావణ పాత్రను అభినయించి కాలేజి వార్షికోత్సవం లో ప్రశంసలను పొందాడు .వారి సహకారంతో ఈ ఏకాంకికను జ్ఞాపకం ఉన్నంత వరకు బ్లాగు లో ప్రకటిస్తున్నాను).

 (తన చెల్లెలు శూర్పనఖకు  రామలక్ష్మణులచే జరిగిన అవమానమునకు రావణుని ప్రతిస్పందన ఈ ఘట్టము)

చాలించుము చెల్లీ నీ పల్కులు చాలించుము, కర్ణ కఠోర దుర్గ్రాహ్య మైన నీ పల్కులు చాలించుము !రామా !ఏమీ కనక కింకి ణి  మంజుల మంజీర శింజనంబులచే జగజ్జన కర్ణ రంజనము చేయు మస్సహోదరి కుసుమ శరుని శ రా పరంపరా పరవశయై వలచి నిన్ మోహింపగా  నీవీ తెఱoగున మత్ చిన్నారి ముద్దు చెల్లల ముక్కు చెవులు కోయింతువా!దురభిమానా ! దురితమున కొడగట్టుదువా ! నిన్ను మస్సునిశిత గదా దండ ప్రహారములచే దండపాణి సదనమున కంపక పోదునా! అశేష శేముషీ దురంధరుడు  అవక్ర పరాక్ర మోపేతు డగునీ  రావణ సార్వ భౌమునితో దలపడు నిచ్చ గల్గెనా ! వరించి వచ్చిన అమాయకపు వనిత నవలోకించి వార కాంత యని దలచితివా లేక నిష్కళంక లంకా  ద్వీప నియమబద్ద  యగు  నద్దాన వాంగనను  దరిజేర హేయమని దలచివా మనోజ పుష్ప శరవిరుద్దా నీకు జనక మహీశు   పుత్రికా రత్నమే ప్రాణ ప్రాయమా! మస్సహోదరి తనువు తృణ ప్రాయమా ! అరాతి వాహినీ సందోహము నవలీలగ నోలలాడించు ఈ అనంగ రంగ సామ్రాట్టు సహోదరియని యెరుగవా!
లేక దివసాగ మదళ అరవింద దళాక్షుడగు యా ఫాలాక్షుని అనన్య భక్తి తాత్పర్య నిష్టా గరిష్టుడగు ఈ రావణ సార్వ భౌమునితో పంతమా!
 ఔరా లక్ష్మ ణా కుసుమ కోమలి కురంగ లోచని దేహ భాగంబు ఖండింపగా నీకు చేతులెట్లు వచ్చినవి  ? పశువను కొంటివా  లేక ఈ విశాల విశ్వములో నీకిది యశమను కొంటివా !
రామా నా పంతము వినుము  అయోధ్యాపుర సామ్రాజ్య పట్ట మహిషి నీ అర్ధాంగి సీతను ఆకాశాంత రంగమందుండనీలేక  మౌక్తిక ఘటిత చంద్రకాంతా స్పటిక నిర్మితంబైన  సౌధoబునందుండనీ గాక  అంభోధినీ గర్భమందుండనీమత్ మాయావిద్యదక్షతచే యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ది సాధ్య విద్యా ధరాది సమస్త దేవ గణం బులె దురొడ్డ నీ నీఅలికుల వేణి కనుగొలుకుల నుండి సలిలముల్ పొరలి జల జల నేల రాలనీ తద్లలనారత్నమున్దెచ్చిమద్లంకా పురి యన్దుంచెద అప్పుడు ఆప్త జన సంయుతుండవై వత్తువా సమస్త దేవగణాoభోది చే  రణో ర్విన్ జొత్తువా లేక అర్చుల్ పర్చు మద్నిశిత శర నికాయంబులకు నోర్తువా చూచెదను గాక !!!
                                                                                                                       

వేంకటేశ్వరా !!!

కోపము, తాపమున్, తగని కోరిక ,బొంకును, దూకుడున్, పటా
టోపము ,మోసమున్, సుజన దూషణ, యీ ర్ష్య లసూయలాదిగా
లోపములన్ని నామనుసు  లోనికి జేరగనీయ బోక మా
యాపద లార్పవే  నభయ హస్తము నీయవె వేంకటేశ్వరా !!!

Tuesday, April 23, 2013

మారుతిని గొల్చు వారల మతులు చెడును !!!

భీతినార్పును రాముండు ప్రీతి తోడ
మారుతిని గొల్చు వారల ,మతులు చెడును
ధర్మ మార్గమ్ము దప్పునధర్మ పరుల
తలలు పదియున్న ఫలము నిష్ఫలము సుమ్ము !!!

 (శంకరాభరణం  బ్లాగులో  14-04-2013 నాటి  సమస్యా పూరణ-   1023  లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, April 22, 2013

ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్!!!

నిను సేవించదలంచి నామనసులో నీరూపు చిత్రించితిన్
మనసేచంచలమై నటున్నిటులుగామారాముజేసెన్ గదా
యినవంశోత్తమయెందుబోగలనునిన్నేరీతి ధ్యానింతు, సెల్
ధ్వనిచేతన్ రసభంగమౌను పరమార్థంబెల్ల వ్యర్థంబగున్!!!

 (శంకరాభరణం  బ్లాగులో  06-04-2013 నాటి  సమస్యా పూరణ-   1015  లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!

కన్నని దైవము కన్నను
కన్నులు మూడున్నవానికన్నను విషమున్
గొన్నను వెఱువని శశిధరు 
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!

 (శంకరాభరణం  బ్లాగులో 09-04-2013 నాటి  సమస్యా పూరణ-1018 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, April 21, 2013

కరిచెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!

తరిగెనుజలములుకొలనున,
చురచురమనె  మండుటెండ,చోద్యంబాయెన్
నరులకు, త్వరపడదటతొల
కరి,చెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!
 (శంకరాభరణం  బ్లాగులో 13-04-2013 నాటి  సమస్యా పూరణ-1022 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

మరునిం బూజించమేలు మాతామహికిన్!!!

సురలకు నరులకు విద్యా
ధరులకుభూసురులకెల్ల దైవంబగు శ్రీ
కరునిన్ ఘనునిన్ శివునికు
మరునిం బూజించమేలు మాతామహికిన్!!!

 (శంకరాభరణం  బ్లాగులో 15-04-2013 నాటి  సమస్యా పూరణ-1024 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Saturday, April 20, 2013

సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!!

కంసాదుల తలదన్నుచు
హింసా మార్గమున నడుచు హీనుల వలనన్
ధ్వంసంబగుధర్మమిలను
సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!! 

 (శంకరాభరణం  బ్లాగులో 16-04-2013 నాటి  సమస్యా పూరణ-1025 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, April 19, 2013

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!


మిత్రులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!

ఆముని పనుపున  రఘుకుల
సోముడు హరువిల్లు ద్రుంచ సుమములు గురిసెన్
ఆమని మురియగ జరిగెను
రాముని తో సీత పెండ్లి రమణీయముగా  !!!

Wednesday, April 17, 2013

గజదొంగల హస్తమయ్యె!!!

నిజమున్ దెలియని వైనము 
ప్రజలను వంచించు మంత్రి వర్యులు మరియున్
రుజగ్రస్తమైనపాలన
గజదొంగల హస్తమయ్యె గదభారతమే !!!

Tuesday, April 16, 2013

తిరుమల దేవా !!!

తప్పని విద్యుత్కోతలు,
నిప్పులు గురిపించుయెండ, నీటికి చూడన్
యెప్పటి వలెనే కటకట
తిప్పలు దప్పించలేవ ?తిరుమల దేవా !!!

Thursday, April 11, 2013

వెలుగులొలికించు ఘనమైన విజయ మిచ్చి!!!

కవిపండితులకు పాఠకులకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

వృద్ధి గలుగని సర్వ సమృద్ధి గాను
జనము  కీయేడు ఘనమైన జయముగలిగి!
మంచికాలమ్ముకాదను మాట ,నిజము
గాదు !సంతోష దాయకమీ దినమ్ము!

జనవాణి వినలేని ఘనమైన ప్రభువాణి
మననౌనె మననేల మహిన జూడ
ఘనరీతి యవినీతి జనరీతి కడుభీతి
విధివ్రాత తలవాత విధము లవియె
కనలేము కొనలేము తినలేము మనలేము
ధర లేమొ పైపైకి తరలి పోయె
వత్సరములు మారె !మత్సరమ్ము లవియె
జనుల జీవితములు జటిలమాయె
ప్రజల పీడించు విధములు ప్రబలి పోయె
మార్పు  రాదాయె పాలక మాన్యులందు
కలలు గనుటలో కాలమ్ము కరిగి పోయె
వెలుగులొలికించు ఘనమైన విజయ మిచ్చి!!!



Wednesday, April 10, 2013

సేవయందు రక్తి జీవకారుణ్యంబు!!!

సేవయందు రక్తి జీవకారుణ్యంబు
ధర్మ నిరతి గలుగు దార్శ నికుని
నమ్మకున్న తనను , నారాయణుడు మెచ్చు !
మందవారిమాట మణుల మూట !!!

Saturday, April 6, 2013

కోరికుండుటొప్పు పేరాశయేముప్పు !!!

అనుభవించ గలడె యానంద మేనాడు
తృప్తి లేని నరుడు తృష్ణ వలన
కోరికుండుటొప్పు  పేరాశయేముప్పు
మందవారి మాట మణుల మూట !!!


Friday, April 5, 2013

నమ్మబోరు ప్రజలు నవ్వుచుంద్రు!!

పొగడు కొనగ నిన్ను పొగరుబోతనియేరు
నమ్మబోరు ప్రజలు నవ్వుచుంద్రు
నిజమనిదలిచేరు నిందించుకొన నిన్ను
మందవారి మాట మణుల మూట !!!

Thursday, April 4, 2013

గుప్త నిధులయొక్క గుట్టు విప్పినయట్లు!!

ఎదుటి వారితప్పు లెన్నుటే  కడుప్రీతి,
గణన చేయుచుంద్రు గంతులేసి
గుప్త నిధులయొక్క గుట్టు విప్పినయట్లు!!
మందవారి మాట మణుల మూట !!!

తగిన దేది ?విడువదగిన దేది ?

మనిషి మనిషి యందు మంచియు చెడునుండు
తగిన దేది ?విడువదగిన దేది ?
తెలుసుకొనిన వాడె తెలివైన మనుజుండు
మంద వారి మాట మణుల మూట !!!

Wednesday, April 3, 2013

పొగడగతగు!!!

పొగడగతగుశాస్త్రజ్ఞుల
పొగడగతగు శౌర్యధనుల,పొగడగ తగునా
తెగబడి దేశపు సంపద
దిగమింగెడు మగసగముల,తెగడగ వలదా !!!