Thursday, March 9, 2017

అంతర్జాతీయమహిళాదినోత్సవశుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు. !!!

నవమాసముల్ మోసి, జవసత్వములపోసి
జన్మయొసంగిన జనని, మహిళ!

సహధర్మ చారియౌ సౌఖ్యప్రదాయియౌ
సంతాన భాగ్యయౌ సతియు, మహిళ!

తండ్రినే నడయాడు దైవంబుగానెంచి
ప్రేమించు పుత్రీలలామ, మహిళ!

అక్కగా,చెల్లిగా అనురాగ వల్లిగా
ఆత్మీయతనుబంచు యతివ, మహిళ!

జోడుచక్రాలలో తోడుగానొకటియై
తేరునీడ్చెడు వీరనారి, మహిళ!

సంసార నావను చక్కగా నడిపించి
తీరమ్మునకు జేర్చు ధీర, మహిళ!

ప్రకృతి స్వరూపమై, ప్రగతిసంకేతమై
సృష్టికి మూలమౌ స్రష్ట, మహిళ!

పరిపూర్ణ వృద్ధికి,పరమార్థ సిద్ధికి
పరమాత్మ నొసగిన వరము, మహిళ!

విజయమును గూర్చు విజ్ఞాన సృజన, మహిళ!
మమతలకుమారు పేరైన మగువ,మహిళ!
మహిళ లేకున్న మనుగడ మహిన లేదు
అట్టి మహిళా మణులకు జైకొట్ట వలయు !!!

Friday, February 24, 2017

మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

హరునకు గిరిజా మానస
హరునకు ఘనతాపపాప హరునకు త్రిపురా
సురసంహరునకు మంగళ
కరునకు కరమోడ్చి మ్రొక్క కలుగు శుభంబుల్ !!!

శివదండకం
(దండకం తొలి ప్రయత్నం,తప్పులను శివుడు క్షమించుగాక !!)

ఓంకారరూపా మహాదేవదేవా మహాదివ్యతేజా మహావేదవేద్యా మహాలింగరూపా మహాదేవశంభో ప్రభో దీనబంధో చిదానందరూపా నమో సాధుమిత్రా 
పవిత్రా త్రినేత్రా 
నమో భూతనాథా 
నమో చిద్విలాసా
గిరీశా సురేశా మహేశా ఫణీశా మహా పాపనాశా ఉమావల్లభా భక్తమందార గంగాధరా 
వీరభద్రా విరూపాక్ష 
భర్గాయ భద్రాయ రుద్రాయ  భీమాయ నిత్యాయ సత్యాయ శుద్ధాయ    నాగేంద్రహారాయ భస్మాంగరాగాయ
హేమాంశుకాయాయ త్రైలోక్యపూజ్యాయ
ముక్తీశ్వరా చంద్రమౌళీశ్వరా యర్ధనారీశ్వరా
 కాశి విశ్వేశ్వరా కాళ హస్తీశ్వరా 
దివ్య కాళేశ్వరా రాజ రాజేశ్వరా 
రామలింగేశ్వరా నీలకంఠేశ్వరా సిద్ధిరామేశ్వరా
పూర్ణ జ్ఞానేశ్వరా శూలపాణీ నమామీ జటాజూటధారీ మహాతాపహారీ
మమున్ బ్రోవరావా జగద్రక్షకా
ఆదిసద్భిక్షుకా
ప్రేమపూరా శుభాశీస్సులందించరావేల మాకష్టముల్ దీర్చి లోపాలమన్నించ రమ్మంచు రేయింబవళ్ళెల్లపంచాక్షరీమంత్రరాజమ్ము వల్లించి పూజించి సేవింతుమయ్యా మహాజంగమయ్యా దయాశాలివయ్యా శివయ్యా నమోశంకరయ్యా 
నమస్తే నమస్తే నమః

---మంద పీతాంబర్,
   అశోక్ నగర్,
   కామారెడ్డి.

Tuesday, October 25, 2016

మునికిన్ గోపమె భూషణంబగు ప్రజా మోదంబు సంధిల్లగన్ !!!

ఘనులే చూడగ మౌనమున్ విడరుగా క్రౌర్యంబు వీక్షించుచున్
వినబోరెవ్వరు ద్రౌపదీవ్యధను రావే దాసి రారమ్మనన్
అనిలో దున్మెద కౌరవాధముల నాకడ్డంబు నెవ్వాడు, భీ
మునికిన్ గోపమె భూషణంబగు ప్రజా మోదంబు సంధిల్లగన్ !!!

Monday, October 24, 2016

రైకనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!

వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ *
పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ
రై, కనువిప్పి  డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!

* జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం)

Saturday, October 15, 2016

అర్జునా యెట్టి దోసమ్ము నంటబోదు !!!

వడ ,పూరి ,దోస ,గారె ... లను అన్యార్థములో ఉపయోగిస్తూ భారతార్థంలో వ్రాసిన పద్యం 

సమర మందున చంపుటల్ చావడములు
సహజ మేగద... పూరించు శంఖమిపుడు
అర్జునా యెట్టి దోసమ్ము నంటబోదు

కౌరవుల్ గారె కారకుల్ కదనమునకు !!!

Tuesday, October 11, 2016

దసరా శుభాకాంక్షలు!!!

31 జిల్లాలతో రూపు దిద్దుకుంటున్న కొంగ్రొత్త తెలంగాణాకు సుస్వాగతం
దసరా శుభాకాంక్షలు.
వసుధన్ వర్ణ సువర్ణ పుష్పములతో భాసిల్లు బత్కమ్మ గి
న్నిసులో జేరి విరాజమానసుమమై నీరాజనాలందగా
కుసుమించెన్ తెలగాణరాష్ట్రమిల పల్ కొంగ్రొత్త జిల్లాలతో
మిసిమిన్ గొల్ప పసిండి కాంతులిట జిమ్మన్ గ్రామ గ్రామాలలో
దసరా వచ్చె వినూత్న శోభలతొ హృద్యమ్మై జనా రాద్యమై !!!

Saturday, October 8, 2016

శ్రీరాముడు!!!
ధీరుడు వీరుడు ధర్మవి
చారుడు శ్రీరాముడు గుణసాంద్రుడు దైత్యుం
జీరగ లంకకుజని గం
భీరుడు పోరాడె మిగుల బీభత్సమునన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో ఇచ్చిన సమస్యకు పూరణ )