Wednesday, August 31, 2011

పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

పాలకుల పాప భారమ్ము పండి పోవ,
ప్రజలమేలుకై దారిజూప ,యవినీతి
రూపుమాప, హజారెగారు జనలోక
పాలు గావలెనని యన్న పట్టు బట్టె!!! 

తప్పు చేసినచో రాజ తనయుడైన
ధనికు డైనను తండ్రైన తమ్ము డైన
కడప నాయకు డైనను కడకు జైలు
పాలు గావలెనని యన్న పట్టు బట్టె !  
(శంకరాభరణం  బ్లాగు లో25-08-2011 నాటి  సమస్యా పూరణ-437లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, August 30, 2011

పంట పండించు రైతులే పాపజనులు!!!

ఇందు గలరందు లేరను సందియమ్ము
వలదు; దుష్టులన్నింటను గలరు వెతుక,
హాయి చేకూర్చు నంటు గంజాయి వంటి
పంట పండించు రైతులే పాపజనులు!!! 

(శంకరాభరణం  బ్లాగు లో24-08-2011 నాటి  సమస్యా పూరణ-436లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, August 29, 2011

హస్తగతుఁడయ్యె సూర్యుఁడత్యద్భుతముగ!


ఫేసు టర్నింగు నిచ్చిన బాసు గారు
వేషమును మార్చ,మార్చగా భాష గూడ
డిల్లి వెళ్ళెను పరివార మెల్ల ,రాహు
హస్తగతుఁడయ్యె సూర్యుఁడత్యద్భుతముగ!

(రాహు = రాహుల్ గాంధి)
(శంకరాభరణం  బ్లాగు లో23-08-2011 నాటి  సమస్యా పూరణ-435లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)


Sunday, August 28, 2011

కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద!

ధర్మ రక్షణ చేయగా ధరణిలోన
జనన మొందిరి పూజ్యులు జగతిమెచ్చ
క్రీస్తు,కృష్ణుడు నొక్కరే క్రియలలోన
కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద! 

(శంకరాభరణం  బ్లాగు లో22-08-2011 నాటి  సమస్యా పూరణ-434లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)


Saturday, August 27, 2011

నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్!!!


నేతలు గట్టిరి గద,యవి
నీతికి పట్టము ఘనముగ,నీతిని వారే
పాతర బెట్టిరి లోతున
నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్!!!

ప్రేతమువలె భూతమువలె
భీతిని గొల్పె,యవినీతి బీగము వేసె
న్నీతికి;పలునేతలదు
ర్నీతికి చెరసాలె నేడు నేస్తంబయ్యెన్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో20-08-2011 నాటి  సమస్యా పూరణ-431లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)




Friday, August 26, 2011

పచ్చ కామెర్ల రోగము పాలకులకు!!!

పదవి మదమున సత్యమ్ము పలుకలేరు,
కనగ జాలరు, చెవియొగ్గి వినగ లేరు
పిచ్చి ముదిరెనో యవినీతి హెచ్చి,వచ్చె
పచ్చ కామెర్ల రోగము పాలకులకు!!!
 
(శంకరాభరణం  బ్లాగు లో19-08-2011 నాటి  సమస్యా పూరణ-430లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, August 25, 2011

కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము!

వార తిథివర్జ్య  ఘడియల వాసి జూసి
మొదలు బెట్టిన పనులన్ని ముదము నిచ్చు
ననుట నెఱుగమే నేడును ,కనుక రాహు
కాలహరణమే చేకూర్చుఁ గార్యఫలము! 

(శంకరాభరణం  బ్లాగు లో18-08-2011 నాటి  సమస్యా పూరణ-429లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, August 24, 2011

కమలజునకు భార్య కమలయెగద!!!

వాక్కు వాక్కునందు వసియించుశారద
కమలజునకు భార్య ;కమలయెగద
అజుని కన్నతల్లి;ఐననేమిఫలము
విత్తముండుచోట విద్యగనము !!!

(శంకరాభరణం  బ్లాగు లో16-08-2011 నాటి  సమస్యా పూరణ-428లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, August 23, 2011

గురువు లైన నేమౌనురా కొట్టవచ్చు|

తల్లి దండ్రియు గురువులు తాత్వికులును
కంటి కగుపడు దైవాలు గాదె భువిన,
చెఱుపు గలిగించు రీతులు చెప్పువారు
గురువు లైన నేమౌనురా కొట్టవచ్చు| 
  
(శంకరాభరణం  బ్లాగు లో16-08-2011 నాటి  చమత్కార పద్యాలు -124లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  
 


Monday, August 22, 2011

స్వాతంత్ర్యముదేశ ప్రజల చావుకు వచ్చెన్!!!

ఏతీరైనను పౌరుల
స్వాతంత్ర్యము కొల్లగొట్టు శాసనములతో
భీతావహులై జచ్చిరి
స్వాతంత్ర్యముదేశ ప్రజల చావుకు వచ్చెన్!!! 


జాతికి ప్రథాని నీవెగ
ఖ్యాతియె మౌనంబుదాల్చ? ఖల్ నాయకులే
రీతిగహరించిరో నీ
స్వాతంత్ర్యము; దేశజనుల చావుకు వచ్చెన్!!! 

ఏతంత్రముతో జేసెనొ
సీతా హరణంబు,బడెను చిక్కున ,లంకా
నేతగు దశకంఠుని దు
స్స్వాతంత్ర్యము దేశ ప్రజల(కు)చావుకు(నుదె)వచ్చెన్ !!! 

(శంకరాభరణం  బ్లాగు లో15-08-2011 నాటి  సమస్యా పూరణ-427లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, August 21, 2011

సంహరించు వాడు సచ్ఛరితుడు!!!

మనిషి మనిషిలోన మంచియు,చెడునుండు
మనసులోకివెళ్ళి మథన జేసి
దైవగుణము లుంచి,దనుజగుణమ్ముల
సంహరించు వాడు సచ్ఛరితుడు!!! 

(శంకరాభరణం  బ్లాగు లో14-08-2011 నాటి  సమస్యా పూరణ-425లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, August 20, 2011

రక్షాబంధనమునాఁడు రావలదన్నా!

దక్షతగల "కనిమొళి" యనె
రక్షా బంధనము నాడు రావలదన్నా,
రక్షకులికమీరేగద
శిక్షను దప్పించలేరె,చెల్లిని గాదే !! 

లక్షణ మౌకొలువట" ఆ
రక్షణ" మూలమున దొరికె రక్షణ శాఖన్,
శిక్షణ పక్షము రోజులు
రక్షాబంధనమునాఁడు రావలదన్నా!
(ఆరక్షణ =రిజర్వేషన్) 

(శంకరాభరణం  బ్లాగు లో13-08-2011 నాటి  సమస్యా పూరణ-424లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Friday, August 19, 2011

వరలక్ష్మీ వ్రతము జేయ వలదనిరార్యుల్ !!!

 సిరివచ్చు,  పెరుగునాయువు
వరలక్ష్మీ వ్రతము జేయ; వలదనిరార్యుల్
పరపీడనమ్ము; మంగళ
కరమౌ శ్రీలక్ష్మిపూజ కమలాక్షులకున్!!!.

(శంకరాభరణం  బ్లాగు లో12-08-2011 నాటి  సమస్యా పూరణ-423లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Thursday, August 18, 2011

భద్ర కాళి బెదరి పారి పోయె!!!

ముఖ్య మంత్రిగారు మ్రొక్కంగ వెడలిరి
దార్లు మూసి వేసి కార్ల లోన,
భక్త జనుల గొట్ట భద్రతా బలగాలు
భద్ర కాళి బెదరి పారి పోయె!!! 
  
(శంకరాభరణం  బ్లాగు లో11-08-2011 నాటి  సమస్యా పూరణ-422లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, August 17, 2011

టప టప టప టప్పు టప టప టప !!!

తడవ తడవ గుడిసె తాటాకు కప్పుపై
టప టప టప టప్పు టప టప టప
చినుకు చినుకు పడగ కునుకేమొ రాదాయె
తడిసి తడిసి, చలికి తరుణి వణికె !!!

 (శంకరాభరణం  బ్లాగు లో10-08-2011 నాటి  చమత్కార పద్యాలు -123లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  
 

 

Tuesday, August 16, 2011

సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్!!!

మాయా మేయ జగంబున
సాయీ రూపము, పలుకులు  సర్వులకెల్లన్
శ్రేయోదాయకముగద,క
సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్!!! 
  
(శంకరాభరణం  బ్లాగు లో10-08-2011 నాటి  సమస్యా పూరణ-421లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, August 15, 2011

పొర్లు దండాలతో రాచపుండు మానె ?

ధరలు బెరుగంగ దొర్లెడు దొరలు లేరు,
పైర్లు మునుగంగ,యెండoగ పట్టి లేదు,
పొంగి పొర్లంగ యవినీతి, పోరు లేదు,
బరువు గుండెతో కళ్ళన్ని బైర్లు గ్రమ్మ
పొర్లు దండాలతో రాచపుండు మానె ? 

(శంకరాభరణం  బ్లాగు లో09-08-2011 నాటి  సమస్యా పూరణ-420లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, August 14, 2011

కేశవుడుసచ్చెగౌరవుల్ ఖిన్ను లైరి !!!

నిండు పేరోలగంబున నింద లేయ,
నూఱు తప్పుల వరకుతానూఱుకోని,
చక్ర మునువేసె శిశుపాలు సంహరింప
కేశవుడు,సచ్చె,గౌరవుల్ ఖిన్ను లైరి !!!
 (శంకరాభరణం  బ్లాగు లో09-08-2011 నాటి  చమత్కార పద్యాలు -122లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  
 

Saturday, August 13, 2011

ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

అవినీతి దొరల సంగతి
కవిపుంగవుడేల యెఱుగు? కాలుడెఱుoగున్,
సవినయ ప్రహ్లాదుని మా
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

Friday, August 12, 2011

విరులు దాకగానె వేడి పుట్టె!!!

విరులు దాకగానె వేడి పుట్టె ,వనిత
కురులు మెరియ గానె మరులు పెరిగె,
చిన్న దానికళ్ళు చిలిపి గొళ్ళాలాయె
వయసుచిత్రమదియె వలపుమొలిచె!
 (శంకరాభరణం  బ్లాగు లో08-08-2011 నాటి  సమస్యా పూరణ-419లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, August 11, 2011

సత్యమునకంటె మేటి యసత్యము గద.!!!

భూత హితమగు బొంకును పుడమి మెచ్చు ,
మేలొనర్పని సత్యంబు మూలజచ్చు
ప్రాణమానవిత్త పదవి భంగ మందు
సత్యమునకంటె మేటి యసత్యము గద.
 (శంకరాభరణం  బ్లాగు లో07-08-2011 నాటి  సమస్యా పూరణ-418లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, August 10, 2011

నల్లులకు జేతు కోటివందనము లిపుడు !!!

ఆడ మగ చిన్న పెద్దల తేడ లేక
కుట్టి రక్తము పీల్తురు బొట్టు బొట్టు
ప్రజల పీడించు నేతల పట్టికుట్టు
నల్లులకు జేతు కోటివందనము లిపుడు!!!
 (శంకరాభరణం  బ్లాగు లో06-08-2011 నాటి  చమత్కార పద్యాలు -120లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Tuesday, August 9, 2011

లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!!!

గోకులమందున,కృష్ణుడు
చీకాకులు బెట్టుచుండ,చెట్టుల చెంతన్
పోకిరని రో ట గట్టి రి
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!!! 

లోకులు పలుగాకులుగద,
చాకలి పలుమాటలాడ,సాద్విని సీతన్
కీకారణ్యము బంపెను
లోకాతీత పురుషుండు లోకువ యయ్యెన్!!! 

 (శంకరాభరణం  బ్లాగు లో06-08-2011 నాటి  సమస్యా పూరణ-417లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

Monday, August 8, 2011

కప్పు లోన బుట్టె గద తుఫాను!!!

మొగపు ఛాయ హెచ్చు , మొటిమలు మాయమౌ,
కురులు పెరుగు ననిన కొనెను క్రీము
కలువ వంటి మోము కారు మబ్బాయె,మే
కప్పు లోన బుట్టె గద తుఫాను!!! 

 (శంకరాభరణం  బ్లాగు లో05-08-2011 నాటి  సమస్యా పూరణ-416లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

Sunday, August 7, 2011

కవితా గానమ్ము లోకకంటక మయ్యెన్!!!

శివనామము నుడువక,మా
ధవు మహిమల మది దలుపక ,దానవ సములౌ
నవనీశుల తెగపొగడెడు
కవితా గానమ్ము లోకకంటక మయ్యెన్!!!
 శంకరాభరణం  బ్లాగు లో04-08-2011 నాటి  సమస్యా పూరణ-415లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, August 6, 2011

ప్రాసయతులు లేక పద్య మలరె !!!

సాంబ శివుని పైన ,శాంభవీసుతుపైన,
లచ్చి పైన, ప్రేమ పిచ్చి పైన,
పచ్చచేలలోన పడతులు పాడంగ
ప్రాసయతులు లేక పద్య మలరె !!! 
(శంకరాభరణం  బ్లాగు లో03-08-2011 నాటి  సమస్యా పూరణ-414లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, August 5, 2011

హితుల నెల్ల నెపుడు "హెచ్చు" వేయు !!!

సంతసముల "కూడు"+,చింతల "తీసేయు" - \!\,  
హితుల నెల్ల నెపుడు  "హెచ్చు"\times \!\,వేయు
పగతుల దినదినము "భాగించు" \div \!\,గణితమౌ 
మంద వారి మాట మణుల మూట!!!

(ఈనాడు ఆదివారపు (31 -08 -2011 ) సంచిక "మంచి మాట")       

గౌరి ముఖమును చుంబించె గరివరదుడు !!!

భాద్రపద శుద్ధచవితిన భాగ్యనగర
గణపతుల శోభ కనులార గాంచి మురిసి
గౌరి ముఖమును చుంబించె , గరివరదుడు
లేచి చెయిసాచి దలయూచి చూచి మెచ్చె!

(శంకరాభరణం  బ్లాగు లో02-08-2011 నాటి  సమస్యా పూరణ-413లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Thursday, August 4, 2011

అల్పు డెపుడు బల్కు నాదరమున!!!

అల్పు డెపుడు బల్కు నాదరమున మోస
గించు వేళ ,కొంప ముంచు వేళ .
అంతరంగ మెపుడు నధమాధమము గదా
చేటు గల్గు వాని మాట వినిన !!!

(శంకరాభరణం  బ్లాగు లో01-08-2011 నాటి  సమస్యా పూరణ-412లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Wednesday, August 3, 2011

కవితాతత్వమ్ము నడ్డగాడిద లెఱుగున్!

అవినీతి దొరల మలినపు
కవితాతత్వమ్ము నడ్డగాడిద లెఱుగు
న్నవియే భువి భారతమున
సవితునిసాక్షిగ పదవుల సరసనజేరెన్!
 (శంకరాభరణం  బ్లాగు లో18-07-2011 నాటి  సమస్యా పూరణ-397లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

Tuesday, August 2, 2011

దురిత ద్యూతమున నోడెదుర్యోధనుడే !!!

కురుసభ సాక్షిగ ద్రౌపది
కురులీడ్చివలువలొలుచుట ఘోరము గాదే,
ధరనేలగ తాబన్నిన
దురిత ద్యూతమున, నోడెదుర్యోధనుడే !!! 

(శంకరాభరణం  బ్లాగు లో20-07-2011 నాటి  సమస్యా పూరణ-399లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )