Wednesday, February 22, 2012

చెల్లి తమ్ముడు మాట్లాడు తల్లి భాష!!!

చెల్లి తమ్ముడు మాట్లాడు తల్లి భాష
కమ్మ దనమంత నిండిన అమ్మభాష
జగము మెచ్చిన గుడుల నజంత భాష
పలుకు పలుకున తేనియ లొలుకు భాష

వెలుగు దివ్వెల పరిభాష తెలుగు భాష
నవ రసాలను బలికించు కవుల భాష
రాగ భావాల తాళ స్వరాల భాష
మధుర పదబంధ  మంజూష మాతృ భాష !

Friday, February 10, 2012

శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!

గ్రాసము సమకూర్చని,ఆ
వాసములేర్పరచ లేని,  వస్త్రమ్ములపై
వేసిన మోసపు పన్నుల
శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా! 


(శంకరాభరణం  బ్లాగు లో07-02-2012 నాటి  సమస్యా పూరణ-614 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, February 9, 2012

బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు!!!

నీతి నియమాలు గాంధీకి నిలయ మౌట
భరత దేశమ్ము నకుగొప్ప భాగ్య మయ్యె
గుండె బలముకు నిండైన గుఱుతు, కండ
బలము లేనట్టి వాడె నిర్భయుడు ,ఘనుడు!!! 


(శంకరాభరణం  బ్లాగు లో07-02-2012 నాటి  సమస్యా పూరణ-615లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Monday, February 6, 2012

కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!!

నోరూరు వంటకములను
నోరారగ దినెడువాని నోటికి ప్రణతుల్ !
కూరల యందున ఉప్పును
కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!!

Friday, February 3, 2012

కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!

కోరిక లన్నియు  దీర్చెడు
కోరకనేకోట్లధనము కుదురుగ నివ్వన్ 
దారులనేర్పరిచెడు నధి
కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!! 


(శంకరాభరణం  బ్లాగు లో30-01-2012 నాటి  సమస్యా పూరణ-607లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు