Thursday, March 31, 2011

ఆడు వారిని తన్నుటే న్యాయమగును!!!


జనుల ఆకాంక్ష లన్నింటి జటిల పరచి
పూట పూటకో తీరుగా మాట మార్చి
నటుల తలదన్ను రీతిన  నాటకముల
నాడు వారిని తన్నుటే న్యాయమగును!!!
(శంకరాభరణం  బ్లాగు లో08-03 -2011 నాటి  సమస్యా పూరణ-248లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Wednesday, March 30, 2011

అవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్!

శివ సంకల్పమొ,పూర్వ జన్మ ఫలమో శ్రీవాణి కారుణ్య మో,
కవి రాజన్యుల పద్యకావ్యముల తా కన్నార వీక్షించెనో  ,
చవులూరించు కవిత్వతత్వ రసమా స్వా దించెనో, యాతడే
యవధానం బొనరించి పామరుడయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్! 
 (శంకరాభరణం  బ్లాగు లో20-03 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

పెండ్లి సేయఁ దగును ప్రేత మునకు!

ప్రేత మావహించి ప్రేలాపనలు జేసి
పేద పొట్ట గొట్టి బాధ పెట్టు
వెఱ్ఱి వార బట్టి వేప మండల చేత
పెండ్లి సేయఁ దగును ప్రేత మునకు! 
(శంకరాభరణం  బ్లాగు లో07-03 -2011 నాటి  సమస్యా పూరణ-247లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Tuesday, March 29, 2011

కాశికేగు వాడు ఖలుడు గాడె!

వేడ,ఆడ, పాడ విశ్వనాథుని లీల
వారణాసి జూడ నరగ జనులు,
ఈశు మ్రొక్కు వారి కిక్కట్లు గల్పింప
కాశికేగు వాడు ఖలుడు గాడె! 
 (శంకరాభరణం  బ్లాగు లో06-03 -2011 నాటి  సమస్యా పూరణ-246లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Monday, March 28, 2011

శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక !

దుష్టు లైన వారి దునుమంగ శంభుండు
పాశు పతము నీయ, పరమ శివుని
శిష్టు డెట్లు పల్కు శివ శివ యని గాక
వేరొకండ నేల వినుతి చేయు?
 (శంకరాభరణం  బ్లాగు లో02-03 -2011 నాటి  సమస్యా పూరణ-242లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Sunday, March 27, 2011

శంకరుండొసంగు సంకటములు.

వంకలు పలు బెట్టు వారికి ,శంకలు
కలుగుట సహజము, సకలము వంక
రగను, టింకరగను యగుపించెడుమతికే
శంకరుండొసంగు సంకటములు. 
(శంకరాభరణం  బ్లాగు లో01-03 -2011 నాటి  సమస్యా పూరణ-241లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )  

Saturday, March 26, 2011

తాళి గట్టిన వాడె నీ తండ్రి యగును!!!

తరళ ప్రాయము నందునే తనువు వీడి
తరలి వెళ్ళెను నీతండ్రి ,మరలి రాడు
నీకు ,నాకును నీడగా నిలువ నెంచి
తాళి గట్టిన వాడె నీ తండ్రి యగును. 

(శంకరాభరణం  బ్లాగు లో28-02 -2011 నాటి  సమస్యా పూరణ-240లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

 

Friday, March 25, 2011

వాజపేయిని ,శ్రీదేవి వలచి వచ్చె!

జనత మెచ్చిన నేతకు జయము గలిగి,
భరత భువినేలు భాగ్యమ్ము మరల గలుగ
పిలిచె నద్యక్షు  డానాడు    ప్రియము గొలుప
వాజపేయిని ,శ్రీదేవి వలచి వచ్చె! 
(శ్రీదేవి = కీర్తికాంత.) (శంకరాభరణం  బ్లాగు లో25-02 -2011 నాటి  సమస్యా పూరణ-237లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

 

Thursday, March 24, 2011

పతికి నమాస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

సతతము సత్య మార్గమున సాగ లభించు నదేమి ? నేటి భా
రతమున,యేలు రాజు ధృతరాస్ట్రుని బోల, యమాత్య శేఖరుల్
పతితులు గాగ , సూనుల కుపాది ని గోరగ తండ్రి ,పార్వతీ
పతికి నమాస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

 (శంకరాభరణం  బ్లాగు లో10-02 -2011 నాటి వారాంతపు  సమస్యా పూరణలోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!

ఖ్యాతిని, జీవన గతిలో
జాతికి నీతిని, నియతిని ,జనులకు కడుసం
ప్రీతిని గూర్చే దైత్యా
రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!! 

భూతములందున , మరియున్
భూతే తరముల,విశాల భూతల మందున్
జ్యోతుల జిమ్మెడు తిరుమల
రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!
(శంకరాభరణం  బ్లాగు లో24-02 -2011 నాటి  సమస్యా పూరణ-236లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

Wednesday, March 23, 2011

తల్లి తల్లి మగడు తాత కాదు !

తల్లి తల్లి మగడు తాత ! కాదు/అవును
ప్రశ్న యొకటి యుండె పత్ర మందు
చిట్టి"అవును" పట్టి కొట్టి వేయ మిగిలె
తల్లి తల్లి మగడు తాత కాదు ! 

తల్లి తల్లి మగడు తాతయ్య నే గదా
తల్లి భర్త యగును తండ్రి నీకు!
బాల ,గోల యేల, బంగారు నాచిట్టి
తల్లి! తల్లి మగడు తాత కాదు !  

(శంకరాభరణం  బ్లాగు లో23-02 -2011 నాటి  సమస్యా పూరణ-235లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

Tuesday, March 22, 2011

చెడు గుణముల తోడ శిష్టు డలరె!

చెడు గుణములు వీడు, చేటు పనులకెల్ల
దూర ముండు మనిన , దుష్టు డలిగె !
గురువు బాట జూప, గుర్తించి ముదము బెం
చెడు గుణముల తోడ శిష్టు డలరె!

(ముదము బెంచెడు గుణములు = మంచి మార్కులు.
చెడు, మంచిమార్గముల బట్టిన విద్యార్థులకు గల తేడా . )
(శంకరాభరణం  బ్లాగు లో22-02 -2011 నాటి  సమస్యా పూరణ-234లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
  

Monday, March 21, 2011

మాతృ భాషాభి మానమ్ము మనకు! వద్దు !

పంచ దారలో అక్షరాల్ ముంచి రేమొ!
చెఱుకు రసములో వడగట్టి చెక్కి రేమొ!
తేనెలో వేసి ఊరించి తీసి రేమొ !
తీయ దనమబ్బెనీరీతి తెలుగు నకును!

లేదు పట్టింపు రోశమ్ము,లేదులేదు
మాతృ భాషాభి మానమ్ము మనకు! వద్దు
వద్దురా,మరువవలదు ,ముద్దు లొలుకు
తెలుగు భాషను, తెలుగేర వెలుగు మనకు!
(శంకరాభరణం  బ్లాగు లో21-02 -2011 నాటి  సమస్యా పూరణ-233లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Sunday, March 20, 2011

కాంతాలోలుండె మోక్ష గామి గనంగన్ !

కాంతా కనకములకు భూ
కాంతుల కమ్మక,కవియిడె కన్యను సీతా
కాంతున కాభాగవతా
కాంతాలోలుండె మోక్ష గామి గనంగన్ !
  (శంకరాభరణం  బ్లాగు లో19-02 -2011 నాటి  సమస్యా పూరణ-231లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Saturday, March 19, 2011

రాగ పూర్ణమి!

చెంగున దూకెడు జింకల 
భంగిన, ప్రియ కాంతులు తమ భామల పైనన్,
రంగులు జల్లిరి ,మన్మధ 
పొంగులు  తడియంగ,రాగ  పూర్ణమి వేళన్!!!

రాముని చరిత్రము జదువగరాదు కుమారా!

శ్యామా నేడును చదివెడు
దేమిటి?తెలుగా! పరీక్ష లిప్పుడు నీకున్
సామాన్య శాస్త్ర మంటివి

రాముని చరిత్రము జదువగరాదు కుమారా! 

కాముని పండగ గదరా!
రామ చరిత్రము జదువగ రాదు కు "మారా"!
కాముడు మదిలో నుండగ
రాముండేతీరు నుండు రాగవిధేయా! 
  (శంకరాభరణం  బ్లాగు లో20-02 -2011 నాటి  సమస్యా పూరణ-232లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Friday, March 18, 2011

మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము!

కలికి ముత్యమ్ము ,వజ్రమ్ము,కాంచనమ్ము
హరికి కస్తూరి  తిలకమ్ము, హరు కురగము
యతికి శాంతమ్ము,సత్యమ్ము,పతికి సతి ,  య
మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము!
  (శంకరాభరణం  బ్లాగు లో15-02 -2011 నాటి  సమస్యా పూరణ-227 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Thursday, March 17, 2011

తల్లిని దండించు వాడు ధన్యుడు గదరా!

తల్లిని ,చెల్లిని నాలిని
నుల్లము నందుంచు వాని నుత్తము డనరా !
పిల్లను కని వదిలెడు చెడు
తల్లిని దండించు వాడు ధన్యుడు గదరా!
 (శంకరాభరణం  బ్లాగు లో14-02 -2011 నాటి  సమస్యా పూరణ-226లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Wednesday, March 16, 2011

చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !

కిరణు పై జాలి వేసెనో ? కిటుకు లేమొ!
గాల మే వేసె సోనియా గాంధి, చిరుకు,
గంతులేవేసి  కాంగ్రేసు వింత లీను
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక ! 
(శంకరాభరణం  బ్లాగు లో13-02 -2011 నాటి  సమస్యా పూరణ-225లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 
 

Tuesday, March 15, 2011

నను నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్!!!

ఇనుడుండు నంత కాలము
నను గొలువగ హెచ్చుసత్య నైపుణి గుణముల్ !
మనసారగ నరహరియగు
నను నుతియించెడి జనులకు నవ నిధులబ్బున్!!! 
(శంకరాభరణం  బ్లాగు లో12-02 -2011 నాటి  సమస్యా పూరణ-224లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. ) 

Monday, March 14, 2011

మాఘ మందున స్నానమ్ము ,మరణ మొసగు!!!

మాఘ మందున స్నానమ్ము ,మరణ మొసగు
పాపములకని ,పలువురు పలుక వినమె?
గాన ,గంగలో మునుగంగ కదలి రమ్ము!
స్నాన మొసగును సౌఖ్యమ్ము ,సంతసమ్ము!
(శంకరాభరణం  బ్లాగు లో11-02 -2011 నాటి  సమస్యా పూరణ-223లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, March 13, 2011

వేదము జదివిన !!పురుషుడు వెధవగ మారున్ !!!

వైద్యము  దెలియును నాయు
ర్వేదము జదివిన!! పురుషుడు వెధవగ మారున్
బాదలు  కలిగించుజనా
మోదము లేనట్టి పనుల మురుయుచు జేయన్!

వేదన మూలము దెలియును
వేదము జదివిన !!పురుషుడు వెధవగ మారున్
ఖేదము గలుగించెడు చెడు
వాదమ్మును జేయగాను వసుధన నెపుడున్ !
(శంకరాభరణం  బ్లాగు లో02-02 -2011 నాటి  సమస్యా పూరణ-215లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, March 12, 2011

భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

ధైర్యము గలవాడని కిర
ణార్యుని మన రాష్ట్ర ముఖ్య నాయకుడన,నౌ
దార్యమునన్ రాజీవుని
భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

సూర్యుని సుతుడౌ కర్ణుని
శౌర్యము గని రాజ్య మిచ్చెసఖుడై ,తానౌ
దార్యముతో ద్రుత రాష్ట్రుని
భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

శౌర్యము గల మారుతి ప్రభు
కార్యము నెరవేర్చ బోయి, కనుగొనె సీతన్,
ధైర్యము గూర్చగ ,రాముని
భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

శౌర్యమ్మునిడు కరమ్ములు
ధైర్యముతోబోర పోయె , దన యిల్లాలే
కార్యమ్ము లన్ని చేయగ
భార్యకు బ్రణమిల్లె భక్తి భావము గదురన్!

(యుద్ద రంగములో తన చేతులను కోల్పోయిన వీర సైనికుడు
తనకు సేవలందిస్తున్నభార్యకు తాను చేస్తున్న ప్రణామం )

(శంకరాభరణం  బ్లాగు లో01-02 -2011 నాటి  సమస్యా పూరణ-214లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, March 11, 2011

"విద్య నేర్చిన వాడె పో వింత పశువు"

"విద్య నేర్చిన వాడె పో వింత పశువు"
విస్తు పోయిరి యిదివిని ,విబుధ వరులు,
తామెవరిమొననెడుశంక తమకు గలుగ!
శంకరయ్యను వేడిరి శంకదీర్ప!

విద్య వినయమ్ము నిచ్చును ,విత్త మిచ్చు,
నిచ్చు విజ్ఞాన ధనము దానిచ్చు యశము!
వెలుగు లార్పెడు, విలయమ్ము గలుగ జేయు
విద్య నేర్చిన వాడె పో ,వింత పశువు! 

(శంకరాభరణం  బ్లాగు లో31-01 -2011 నాటి  సమస్యా పూరణ-213లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, March 10, 2011

తలలు వంచి గగన తలము గనుడు!

ప్రజల ధనము దోచి పలురీతి సుఖముల
బడయు వారు నేడు ప్రభువు లైరి!
హితులు గారు పరమ హీనులు,వారల
తలలు వంచి గగన తలము గనుడు!
(శంకరాభరణం  బ్లాగు లో30-01 -2011 నాటి  సమస్యా పూరణ-212లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, March 9, 2011

చినుకా! వణుకేలనీకు ? చిందులు వేయన్!

కునుకా! మేఘము నందున?
విన బోకుము గాలి మాట , వినతులు సేతున్!
మనలేము నీవు లేకను ,
చినుకా! వణుకేలనీకు ? చిందులు వేయన్!

దద్దమ్మల కీ జగత్తు దండగ కాదా !

సుద్దులు రుద్దెడు బుద్దుల
ప్రొద్దున మాపున దలంప, పోవును చాలా !
ముద్దులు ,మురిపెము వద్దను
దద్దమ్మల కీ జగత్తు దండగ కాదా ! 
(శంకరాభరణం  బ్లాగు లో29-01 -2011 నాటి  సమస్యా పూరణ-211లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, March 8, 2011

చెడుగుడు, నాట్యమ్ము కొఱకు! చీనాంబరముల్!!!

గుడికిన్ వచ్చిన గుమ్మల
నడిగెను పూజారి భరత నాట్యము చేయన్!
పడతులు దెచ్చిరి శోభిo
చెడు, గు(డి)నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్! 

బుడతలు గావలె నాడగ
చెడుగుడు! నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్,
పిడికెడు నడుముల్ గలిగిన
పడతుల్ గావలెనుగాని పావడ లేలా!

గడుసరి గోపిక లాడిరి
చెడుగుడు, నాట్యమ్ము కొఱకు! చీనాంబరముల్
వడివడిగలాగ ,కృష్ణుని
మెడనుండి మరిమొలనుండి, మెఱుపులు రాలెన్! 
(శంకరాభరణం  బ్లాగు లో28-01 -2011 నాటి  సమస్యా పూరణ-210లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, March 7, 2011

కొడుకునకున్ వేనవేలు ! కూతున కొకటే!!!

ఒడిదుడుకులు, చెడునడతల
కొడుకునకున్ వేనవేలు ! కూతున కొకటే
ధృడ సంకల్పము కనబడె
చెడుతో తలబడ,నతండచేతను డయ్యెన్!
(శంకరాభరణం  బ్లాగు లో27-01 -2011 నాటి  సమస్యా పూరణ-209లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, March 6, 2011

గాడిదలకు దెలియు కుసుమ గంధపు విలువల్!!!

బూడిద సౌఖ్యము దెలియును
గాడిదలకు!! దెలియు కుసుమ గంధపు విలువల్
వాడిన వారికె!!తత్వము
కాడికి పోవగ దెలియును కలిమిన  గాకన్ !!!
(శంకరాభరణం  బ్లాగు లో26-01 -2011 నాటి  సమస్యా పూరణ-208లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, March 2, 2011

వరుడను, నాకేల వధువు వలదనె నతడున్!

హరుడను ,పావన గంగా
ధరుడను,శివుడను ,గిరిజకు ధవుడను ,నేనే
నిరువురి తరుణుల హృదయా
వరుడను, నాకేల వధువు వలదనె నతడున్!

(వేములవాడ ప్రాంతములో ఎందరో పడతులు రాజన్న సాన్నిధ్యం లో శివసత్తులుగా(శివసతులు)మారి శివుని స్తుతించే ఆచారమున్నది .భక్తితో ఒకడు తన సుతను శివసతిగా ఎలుకొమ్మన ,శివుడు భక్తునితో పై విధముగా అని ఉంటాడని భావన చేసాను.)
(శంకరాభరణం  బ్లాగు లో26-02-2011 నాటి  సమస్యా పూరణ-238లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, March 1, 2011

తల లైదు కరంబులారు తనువది యొకటే!

కలి కాలము పలు వింతలు
కలిగెనుమన కళ్ళ ముందె,కనెమృత శిశువున్
తొలి కాన్పున తరుణీ మణి
తల లైదు కరంబులారు తనువది యొకటే! 
(శంకరాభరణం  బ్లాగు లో25-01 -2011 నాటి  సమస్యా పూరణ-207లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )