Sunday, August 19, 2012

తరలి వచ్చిరి మ్రొక్కరే శిరసు వంచి !!!

 

ఫణిరాజు తల్పాన పవళించు పరమాత్మ
  ఖగరాజు భుజమెక్కి కదిలెనెటకొ?
కువలయంబంతయు  కుక్షిలో నిముడించు
  పురుషోత్తముడు నేడుబోవు  టెటకొ?
మకర కుండల కాంతి మహిని గప్పికొనంగ
  మధుసూదనునినేటి మార్గ మెటకొ?
ఘన శంఖచక్రముల్ కరయుగ్మమందున
  ధరియించి  రయమున పరుగు లెటకొ?
 వైకుంఠ పురమందు  వసియించు హరి నేడు
  సిరితోడ పయనించి తరలుటెటకొ?
సకిరీట ధారులై సత్కృపా కారులై
  గగన విహారులై గమన మెటకొ ? 


శ్రావణoబని కాబోలు సంతసమున
దీన జన రక్షణార్థమై దివిని వీడి
లక్ష్మి నారాయణులు సలక్షణముగ
తరలి వచ్చిరి మ్రొక్కరే శిరసు వంచి !!!

(శంకరాభరణం బ్లాగు లో  04-08-2012  నాటి పద్య రచన-71 లో  వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో  వీక్షించ వచ్చును.)

No comments:

Post a Comment