డింభకా యనిబిల్చి దిక్కులదరగొట్టు
ధీటైన నటమౌళి ధాటిగలరె !
చెల్లెలా యనితల చెయ్యేసినిమిరగా
అమ్మలక్కల కళ్ళు చెమ్మగిలవె !
వీర ఘటోత్కచ ధీరపటాటోప
మానాడుయీనాడు నవనిబొగడె !
పాత్రోచితమ్మగు ప్రతిభతో రాణించి
పరిణతి జూపించు ప్రాజ్ఞు డతడె !
చిత్ర సీమకు దొరికిన ఛత్రమతడు
నవ రసాలను పండించు నటుడతండు
మనసు దోచిన మాటల మాంత్రి కుండు
తెలుగు నేలలో నారని వెలుగతండు!!!
సార మెఱిగిన *సామర్ల చక్రవర్తి
విశ్వ విఖ్యాత నటమూర్తి విమల కీర్తి
మేటి ఎస్వి రంగారావు సాటి గలరె ?
అతనికాతండె సాటియౌ నవనియందు !!!
(శంకరాభరణం బ్లాగు లో 30-07-2012 నాటి పద్య రచన-66 లో వ్రాసినపద్యం ఇతర కవిపండితుల పద్య రచనలు ఆ బ్లాగులో వీక్షించ వచ్చును.)
No comments:
Post a Comment