Friday, March 16, 2012

నివాళి !!!


నా చిరకాల మిత్రుడు శ్రీ ఆంజనేయులు ,విశ్రాంత హెడ్ క్యాషియర్  S.B.H    సిరిసిల్ల వాస్తవ్యుడు  14-03-2012 నాడు పరమపదించినారు వారి ఆత్మకు శాంతి చేకూరు గాక .

కల్మషమ్ము లేని కారుణ్య మూర్తివి 
దివికి జేరి నావు భువిని వీడి 
విశ్వ శాంతి గోరు విమల మతివి  నీవు
ఆంజనేయ నీకు అంజ లింతు 

రాజ రాజైన పట్టపు రాణి యైన
మాన్యు డైనను సర్వ సామాన్యుడైన
పుట్టి నటువంటి ప్రతిజీవి గిట్టవలయు
చిట్ట చివరికి శివునికి ముట్ట వలయు !!!

కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని భారతంబును!!!

దార్త రాష్ట్రుల దౌష్ట్యాల వార్త లేని
ధర్మ సూనుని తమ్ముల తలపు లేని
కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని
భారతంబును బొంకని పలుక దగును !!! 

 (శంకరాభరణం  బ్లాగు లో15-03-2012 నాటి  సమస్యా పూరణ-647 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, March 14, 2012

మేలు గోరంత కీడేమొ మేరువంత!!!

మేలు గోరంత కీడేమొ మేరువంత
జనుల ధనమంత పాలక ఘనుల చెంత
మంత్రి మాన్యుల మాయల తంత్ర మందు
దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు !!!

   
(శంకరాభరణం  బ్లాగు లో13-03-2012 నాటి  సమస్యా పూరణ-645 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, March 13, 2012

దార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పథము!!!

పాండు భూవరు కోడలి వలువ లొలిచి
నిండు పేరోలగంబున నీచు లైరి
దార్త రాష్ట్రులు !!! నడచిరి ధర్మ పథము
న సతతము పాండు సుతులు బడసిరి యశము !!!
   
(శంకరాభరణం  బ్లాగు లో12-03-2012 నాటి  సమస్యా పూరణ-644 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, March 11, 2012

రాజ భోగాల విడిచిన రాచ కొడుకు !!!

రాజ భోగాల   విడిచిన  రాచ కొడుకు
పసిడి జింకకై పరుగిడ పాడి యౌనె
రాక్షసాదుల నిర్జించు రచన యేమొ
రాముడిచ్చెను సీతను రావణునకు!!!
   
(శంకరాభరణం  బ్లాగు లో10-03-2012 నాటి  సమస్యా పూరణ-643 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, March 10, 2012

హీనునకు నమస్కరింతు!!!

దుష్ట శిక్షకునకు  శిష్ట రక్షకునకు
బోధకునకు సత్య శోధకునకు
జనుల సేవకునకు జనకునకు శత్రువి
హీనునకు నమస్కరింతు నెపుడు !!! 
   
(శంకరాభరణం  బ్లాగు లో09-03-2012 నాటి  సమస్యా పూరణ-642లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, March 9, 2012

వనితకు వందనము!!!

కనురెప్పతీరు కదులుచు
మనమున మమతానురాగ మాధుర్యముతో
అనునిమిషము ప్రేమించెడు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్!!!. 

 (శంకరాభరణం  బ్లాగు లో08-03-2012 నాటి  సమస్యా పూరణ-641లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)