Tuesday, July 5, 2011

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ !!!

కుగ్రామపు వేడుకలో
నిగ్రహమును వీడి ,మత్తు నెక్కొన  దిఱుగ
న్నుగ్రాకృతిదాల్చి,నుఱికి
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్ '.
 (శంకరాభరణం  బ్లాగు లో26-06-2011 చమత్కార పద్యాలు -87     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, July 1, 2011

శంకరునకు గలవు వంకలెన్నొ!!!

సిగన చంద్ర వంక, చిత్తమెడమ వంక ,
గళమున గరళమ్ము కంటమంట,
మెడననాగవంక,నడుచుభక్తులవంక 

శంకరునకు గలవు వంకలెన్నొ




(శంకరాభరణం  బ్లాగు లో27-06-2011 నాటి  సమస్యా పూరణ-375లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Tuesday, June 28, 2011

ఓనమాలు రాని యొజ్జ మేలు!!!

విద్య వచ్చి యుండి ,వినయమ్ము లేనట్టి,
నీతి,రీతి లేని భీతి గొల్పు
పనులు జేయు నట్టి,బరమ మూర్ఖునికంటె

ఓనమాలు రాని యొజ్జ మేలు!!!


(శంకరాభరణం  బ్లాగు లో26-06-2011 నాటి  సమస్యా పూరణ-374లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

నవరత్న పద్య మాలిక!!!

 శ్రీ కొక్కు  అశోక్ కుమార్  B .Sc .B.Ed  మేడిపెల్లి(జగత్యాల)మండల M.E.O గారుఈ నెల జూన్ 30{2011) న   పదవీ విరమణ చేస్తున్న సందర్భమును పురస్కరించుకొని వారి చిన్న బావ మంద పితాంబర్  గారు సమర్పిస్తున్న నవరత్న పద్య మాలిక!!!  
1
"కొక్కు సత్య నారాయణ" కొడుకతండు ,
సుమతి "రాధకు " గారాల సుతుదతండు,
నామము "అశోక్ కుమారు"డు,నయము మీర
సతి "సుజాతకు" రాగాల పతియతండు.!!!
2
 ఆచార్యుని తనయుండై
నాచార్యుల కెల్ల మిగుల నాత్మీ యుండై
నాచార్యుండే నతడై 
నాచార్యు లకే నతండు నధికారయ్యెన్!!!


3
తెల్లని నవ్వుల రువ్వుచు,
పిల్లల మది దోచినావు ,ప్రేమగ వారిన్ 
మెల్లగ విద్యా గంధపు  
వెల్లువలో తడిపినావు  విజ్ఞాన నిధీ !
4
అధికారతనే యైనన్ 
నధికారిగగాక నతడు నాత్మీయతతో 
విధులన్నియు సంప్రీతిగ 
బుధులందరుమెచ్చ,జేసి  పూజ్యుండయ్యెన్ !!!

5
హంగులు లేవుజూడ , దరహాసము మోమున జిందులేయ ,నే
రంగుల నద్దినా వొగద ,రాళ్ళకు విద్దెల సారమద్ది,"సా
రంగ పు రంబునందు ",గిరి రాజుల పిల్లల కెల్ల వర్ణ  సా 
రంగమవై ,జనాదరణ రాజస మొప్పగ బొందినావిలన్ !!!    


6
వేడకనే వరము లొసగి 
తోడుగ నెప్పుడు నిలబడి త్రోవను జూపే 
వాడివనిరి "మేడి పెల్లి" న , 
వాడని బంధము గనబడె వారిజ నేత్రా!!!

7
పాఠశాల  లన్న ప్రాణంబు నిచ్చును
పిల్లలందుప్రేమ   వెల్లి విరియు
విద్య గొప్ప దనము వినయమ్ముగాజెప్పి
వినుతి కెక్కె నతను విమల మతుడు !
8
మాననీయుండు  విద్దెల  మాంత్రికుండు,
గర్వ మిసుమంతయునులేని కార్మికుండు
దాన ధర్మమ్ము జేసిన ధార్మి కుండు ,
భావి పౌరుల  మేలెంచు భావుకుండు ,
శుభ కరుండు సద్గుణ శోభితుండు ,
సత్య వచనుండు సజ్జన సమ్మతుండు!!!
9
మదిలో మల్లెలు  పూయగ
పదుగురు నిను మెచ్చినారు ,పరిణిత మతితో
పదవికి వన్నెల నద్దిన
చదువుల దొర ,నీకుగల్గు చక్కటి శుభముల్!

Monday, June 27, 2011

ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!


చెలువము మీరగ నాడిరి
వలపన్నియు మునిపనుపున వగలొలుకంగన్,
యిలనేలు హరిశ్చంద్రుని, 

యెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్!

 (శంకరాభరణం  బ్లాగు లో21-06-2011 చమత్కార పద్యాలు -82     లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   

Sunday, June 26, 2011

ఐక మత్యమ్ము, గలిగించు నధిక హాని!!!

ఐక్య మౌదురు నవినీతి నట్టె బెట్ట
ఐక మత్యమ్ము గనిపించు నణగ ద్రొక్క ,
దోచు కొనుటలో మిన్నగా  దొరల కున్న
ఐక మత్యమ్ము, గలిగించు నధిక హాని!!
!



(శంకరాభరణం  బ్లాగు లో24-06-2011 నాటి  సమస్యా పూరణ-373లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )     
  

Saturday, June 25, 2011

మందారము వంటి మోము

పొందుగ కందెన పూయగ
మందారము వంటి మోము మారెను,హోళీ
సందడి నందున,సుందరి
నందవికారమె బ్రతుకుననానంద మిడున్!!!



కందెన = ఒకవిధమైన నల్లని రంగు   

(శంకరాభరణం  బ్లాగు లో22-06-2011 నాటి  సమస్యా పూరణ-371లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )