Monday, April 22, 2013

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!

కన్నని దైవము కన్నను
కన్నులు మూడున్నవానికన్నను విషమున్
గొన్నను వెఱువని శశిధరు 
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే !!!

 (శంకరాభరణం  బ్లాగులో 09-04-2013 నాటి  సమస్యా పూరణ-1018 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, April 21, 2013

కరిచెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!

తరిగెనుజలములుకొలనున,
చురచురమనె  మండుటెండ,చోద్యంబాయెన్
నరులకు, త్వరపడదటతొల
కరి,చెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!
 (శంకరాభరణం  బ్లాగులో 13-04-2013 నాటి  సమస్యా పూరణ-1022 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

మరునిం బూజించమేలు మాతామహికిన్!!!

సురలకు నరులకు విద్యా
ధరులకుభూసురులకెల్ల దైవంబగు శ్రీ
కరునిన్ ఘనునిన్ శివునికు
మరునిం బూజించమేలు మాతామహికిన్!!!

 (శంకరాభరణం  బ్లాగులో 15-04-2013 నాటి  సమస్యా పూరణ-1024 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Saturday, April 20, 2013

సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!!

కంసాదుల తలదన్నుచు
హింసా మార్గమున నడుచు హీనుల వలనన్
ధ్వంసంబగుధర్మమిలను
సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!! 

 (శంకరాభరణం  బ్లాగులో 16-04-2013 నాటి  సమస్యా పూరణ-1025 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, April 19, 2013

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!


మిత్రులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!

ఆముని పనుపున  రఘుకుల
సోముడు హరువిల్లు ద్రుంచ సుమములు గురిసెన్
ఆమని మురియగ జరిగెను
రాముని తో సీత పెండ్లి రమణీయముగా  !!!

Wednesday, April 17, 2013

గజదొంగల హస్తమయ్యె!!!

నిజమున్ దెలియని వైనము 
ప్రజలను వంచించు మంత్రి వర్యులు మరియున్
రుజగ్రస్తమైనపాలన
గజదొంగల హస్తమయ్యె గదభారతమే !!!

Tuesday, April 16, 2013

తిరుమల దేవా !!!

తప్పని విద్యుత్కోతలు,
నిప్పులు గురిపించుయెండ, నీటికి చూడన్
యెప్పటి వలెనే కటకట
తిప్పలు దప్పించలేవ ?తిరుమల దేవా !!!