Wednesday, April 16, 2014

సర్వ మెరుగు వాడు సంసారమున లేడు !!!

తెలియనివిషయమ్ము తెలుసుకొనడమొప్పు
కూడ తెలిసి చెప్ప కునికి తప్పు
సర్వ మెరుగు  వాడు సంసారమున లేడు
మంద వారి మాట మణుల మూట !!!

Tuesday, April 8, 2014

పుట్టినట్టిజీవి !!!

ఏది శాశ్వతమ్ము యేది కాదనియెడు
విషయ మెరుగు నట్టి విభు వొకండె
పుట్టినట్టిజీవి గిట్టుటే సత్యంబు
మంద వారి మాట మణుల మూట !!!

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!





 Wishing You A Very Happy Ram Navami

 Ram Navami 2014 Images


శివ ధనువును రఘురాముడు
నవలీలగ   నెత్తి ద్రుంచి నవనిజ సీతన్
ధ్రువ కీర్తిన పెండ్లాడెను
రవిచంద్రుల సాక్షిగాను రమణీయముగా !!!




Monday, April 7, 2014

రామ రామ యనిన!!!

రామ రామ యనిన దోమలే పోలేవు
పాప మెటులబోవు భజన వలన
దక్కు విజయ  మెపుడు ధర్మాచరణ చేత
మంద వారిమాట మణుల మూట !!!

Sunday, April 6, 2014

మాట మంత్రమౌను!!!

మాట మంత్రమౌను మహిలోన పరికించ
మదిని దోచు గాదె మంచి మాట
కటువు మాట లాడ  కార్యముల్ జెడిపోవు
మంద వారి మాట మణుల మూట !!!

Saturday, April 5, 2014

తెలిసియుండ వలెను తెలివిగా భాషింప!!!

తెలిసియుండ వలెను  తెలివిగా భాషింప
లేనియెడల చాలు మౌనవ్రతము
రెంటిలోన నొకటి ఒంటబట్టిన మేలు 
మంద వారి మాట మణుల మూట !!!

Monday, March 31, 2014

జయ నామ సంవత్సర శుభాకాంక్షలు !!!

నోరు మంచిదైన యూరు మంచిదటంచు
యెరిగి యున్న నుర్వి నేలగలడు
పొంచి యుండు "జయ"ము మంచిమాట లయందె
మంద వారి మాట మణుల మూట !!!

అందరకూ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు !!!