Wednesday, April 23, 2014

గుడి యున్న చాలురా!!!

సంఘ సేవ కొఱకు సంపదక్కర లేదు
సేవ సేయు  చొరవ, చేవ,వలయు
గుండె లోన కరుణ నిండియున్నను చాలు
మంద వారి మాట మణుల మూట !!!

Tuesday, April 22, 2014

డబ్బు కరిగి పోయె జబ్బు పెరిగె !!!


దగ్గుకొక పరీక్ష దమ్ముకు మరి రెండు 
డబ్బు కరిగి పోవు  జబ్బు పెరుగు
వ్యాధిగుర్తుబట్టు వైద్యులే కరువైరి
మంద వారి మాట మణుల మూట!!!

Monday, April 21, 2014

సాఫ్టు వేరు వరుని సంబంధ మొద్దురా !!!

నిన్నకాకినాడ , నేడు కామారెడ్డి
రేపు రేణి గుంట, మాపు గుత్తి
సాఫ్టు వేరు వరుని సంబంధ మొద్దురా
మందవారి మాట మణుల మూట !!!

Friday, April 18, 2014

వనజభవుని కైన !!!

చాలు మూర్ఖు డొకడె సంద్రాన బంగారు
నాణె ముబడవేయ  ;కాని తీయ
వశమె ఘనుని కైన వనజభవుని కైన
మంద వారి మాట మణుల మూట !!!

Thursday, April 17, 2014

సెలవులు లేనట్టి చదువు!!!

జలమును లేనట్టి చెరువు
నిలకడ లేనట్టి కొలువు నిజమేనాడున్
పలకని నేతయు నెపుడున్
సెలవులు లేనట్టి చదువు చేదౌ జగతిన్ !!!

ఉండ తగును !!!

ఉండ తగును గాదె నుచితమౌ స్థానాన
సున్న సంఖ్య ప్రక్క నున్న బలము
సున్న ప్రక్క సున్నలెన్నున్న శూన్యమే
మంద వారి మాట మణుల మూట !!!

Wednesday, April 16, 2014

సకల సద్గుణ వారాశి సత్య భాషి !!!

మునివెంట జని వనంబున తాటకిని జంపి
తపసుల గాచిన ధన్య జీవి!
నిటలాక్షు చాపమున్ తృటి లోన ద్రుంచిన
వీరాగ్ర గణ్యుoడు వినయ శీలి!!
తండ్రియానతివిని త్యజియించి రాజ్యమ్ము
కానల కేగిన కర్మయోగి!!!
నీతి రీతిని దప్పి సీతనపహరింప
దశకంఠు గూల్చె కోదండ పాణి !!!!

సకల సద్గుణ వారాశి సత్య భాషి
రుజువు లక్కర లేని కారుణ్య మూర్తి
దరణి పైనడ యాడిన ధర్మ మూర్తి
చరిత మరచునే శ్రీరామ చంద్ర కీర్తి !!!!!