Thursday, April 11, 2013

వెలుగులొలికించు ఘనమైన విజయ మిచ్చి!!!

కవిపండితులకు పాఠకులకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

వృద్ధి గలుగని సర్వ సమృద్ధి గాను
జనము  కీయేడు ఘనమైన జయముగలిగి!
మంచికాలమ్ముకాదను మాట ,నిజము
గాదు !సంతోష దాయకమీ దినమ్ము!

జనవాణి వినలేని ఘనమైన ప్రభువాణి
మననౌనె మననేల మహిన జూడ
ఘనరీతి యవినీతి జనరీతి కడుభీతి
విధివ్రాత తలవాత విధము లవియె
కనలేము కొనలేము తినలేము మనలేము
ధర లేమొ పైపైకి తరలి పోయె
వత్సరములు మారె !మత్సరమ్ము లవియె
జనుల జీవితములు జటిలమాయె
ప్రజల పీడించు విధములు ప్రబలి పోయె
మార్పు  రాదాయె పాలక మాన్యులందు
కలలు గనుటలో కాలమ్ము కరిగి పోయె
వెలుగులొలికించు ఘనమైన విజయ మిచ్చి!!!



Wednesday, April 10, 2013

సేవయందు రక్తి జీవకారుణ్యంబు!!!

సేవయందు రక్తి జీవకారుణ్యంబు
ధర్మ నిరతి గలుగు దార్శ నికుని
నమ్మకున్న తనను , నారాయణుడు మెచ్చు !
మందవారిమాట మణుల మూట !!!

Saturday, April 6, 2013

కోరికుండుటొప్పు పేరాశయేముప్పు !!!

అనుభవించ గలడె యానంద మేనాడు
తృప్తి లేని నరుడు తృష్ణ వలన
కోరికుండుటొప్పు  పేరాశయేముప్పు
మందవారి మాట మణుల మూట !!!


Friday, April 5, 2013

నమ్మబోరు ప్రజలు నవ్వుచుంద్రు!!

పొగడు కొనగ నిన్ను పొగరుబోతనియేరు
నమ్మబోరు ప్రజలు నవ్వుచుంద్రు
నిజమనిదలిచేరు నిందించుకొన నిన్ను
మందవారి మాట మణుల మూట !!!

Thursday, April 4, 2013

గుప్త నిధులయొక్క గుట్టు విప్పినయట్లు!!

ఎదుటి వారితప్పు లెన్నుటే  కడుప్రీతి,
గణన చేయుచుంద్రు గంతులేసి
గుప్త నిధులయొక్క గుట్టు విప్పినయట్లు!!
మందవారి మాట మణుల మూట !!!

తగిన దేది ?విడువదగిన దేది ?

మనిషి మనిషి యందు మంచియు చెడునుండు
తగిన దేది ?విడువదగిన దేది ?
తెలుసుకొనిన వాడె తెలివైన మనుజుండు
మంద వారి మాట మణుల మూట !!!

Wednesday, April 3, 2013

పొగడగతగు!!!

పొగడగతగుశాస్త్రజ్ఞుల
పొగడగతగు శౌర్యధనుల,పొగడగ తగునా
తెగబడి దేశపు సంపద
దిగమింగెడు మగసగముల,తెగడగ వలదా !!!