అక్షరాలేబది యారుతో నలరారు
లక్షలారు పదాల లలిత భాష !
అచ్చులు హల్లులు అరుదైన అరసున్న
సున్నయును విసర్గలున్న భాష!
నెలవంక ముడులతో తలపైన గుడులతో
తలకట్టు కొమ్ముతో దనరుభాష !
ఏత్వాల ఓత్వాల ఔత్వాల ఋత్వాల
ఒత్తులైత్వాల గమ్మత్తు భాష!
పూర్ణచంద్రుని రూపమ్ము బోలుభాష!
భాను బింబంబు రీతి గన్పట్టుభాష !
గుండ్రముగనుండు నిండు భూగోళభాష!
వింత అనుభూతి నిడెడు అజంత భాష!
క్షీరాబ్ధి చిలుకంగ క్షితిపైన తెలుగింట
ఒలికిన తేనెయో తెలుగుభాష !
హరునిశిరంబందు సురగంగ దూకంగ
దివినుండి జారెనో తెలుగుభాష !
వాగ్దేవి నుదుటన బాలార్క బింబమై
వెలుగొందు తిలకమో తెలుగుభాష !
చంద్రవంకలపైన ఇంద్రచాపము లీల
వెలుగు వర్ణమ్ములో తెలుగుభాష !
చేవగల్గిన విశ్వ ప్రాచీన భాష !
దేవరాయలు మెచ్చిన జీవ భాష!
విశ్వ భాషల ధీటుగా వెలుగు భాష!
దేశ భాషల మణిపూస తెలుగుభాష !!!
పీతాంబర్ గారు!
ReplyDeleteఅతి మధురంగా ఉన్నాయి మీ పద్యాలు.
అభినందనలు!
శ్రీ ఆచార్య ఫణీంద్ర గారూ ధన్యవాదములు కంప్యూటర్ సమస్యవలన సకాలంలో స్పందించలేదు మన్నించగలరు
ReplyDelete