Tuesday, March 19, 2013

నిర్ణయములుతగవు నిండునిరాశలో !!!


వలదు  వరము లీయ  చెలగిసంతోషాన
కూయ బోకు మెపుడు కోపమందు
నిర్ణయములుతగవు నిండునిరాశలో
మంద వారి మాట మణుల మూట !!!


Monday, March 18, 2013

రాత్రి వెళ్ళి పోవు రవిమళ్ళి ప్రభవించు !!!

చెట్టు కొమ్మ విరుగ  చిగురించు తరుశాఖ
కలత జెందనేల కష్టములకు
రాత్రి వెళ్ళి పోవు రవిమళ్ళి  ప్రభవించు
మంద వారిమాట మణుల మూట !!!

Friday, March 15, 2013

అబ్బుచుండు మంచి యలవాట్లు వారికే!!!


సమయమెల్ల నెపుడు సద్వినియోగమ్ము
చేయువారిచెంత జేరు జయము
అబ్బుచుండు మంచి యలవాట్లు వారికే
మంద వారి మాట మణుల మూట !!!

Wednesday, March 13, 2013

విజయ పథమునకదె నిజమైన తొలిమెట్టు !!!

సాధ్య  పడదనుచిరు సంశయంబునువీడు
భయము తొలిగి నాత్మ బలము పెరుగు
విజయ పథమునకదె నిజమైన తొలిమెట్టు
మందవారి మాట మణుల మూట !!!



రాజులైన ప్రజకు రాళ్ళ సమానమే !!!

అర్థ శాస్త్రమెల్ల  ఆపోశనంబట్టి
కూడు బెట్ట లేని కుటిల మతులు
రాజులైన ప్రజకు రాళ్ళ సమానమే
మంద వారి మాట మణుల మూట !!!




Tuesday, March 12, 2013

మనసు జ్ఞానమందు మునుగంగ శుభ్రమౌ !!!

మనిషి శుభ్రమౌను మలినముల్ తొలుగును
నీటి లోన మునుగ నిక్కముగను
మనసు జ్ఞానమందు మునుగంగ శుభ్రమౌ !!
మంద వారిమాట మణుల  మూట!!!

Sunday, March 10, 2013

కదల లేని వారి కథమారిపోవులే !!!


కాల మాగ బోదు,కాలానుగుణముగా 
కదులు వారికెపుడు గలుగు శుభము
కదల లేని వారి కథమారిపోవులే
మంద వారి మాట మణుల మూట !!!

Saturday, March 9, 2013

జ్ఞాను లెదుట తిరుగ జ్ఞానౌనె మూర్ఖుడు !!

పానకమున మునిగి  పలుమార్లు తేలినా
యెఱుగబోదు తీపినెపుడు "గరిట"
జ్ఞాను లెదుట తిరుగ జ్ఞానౌనె మూర్ఖుడు
మంద వారిమాట మణుల మూట !!!

Thursday, March 7, 2013

బుద్దులు నేర్పని గురుండు


హద్దులు జెప్పని జనకుడు
యుద్డంబునుజేయలేని యోధుడు భార్యన్
ముద్దుగ జూడని మగడును
బుద్దులు నేర్పని  గురుండు  పూజ్యులె  దలపన్ !!!