Friday, December 23, 2011

గంగ మునిగి పోయె గంగ లోన !!!

కాశివిశ్వనాథు కనులార గాంచంగ
వారణాసికేగె వనిత మంగ
పడతి ముక్కు పుడక  పడిజారి, తామును
గంగ, మునిగి పోయె గంగ లోన !!!

(శంకరాభరణం  బ్లాగు లో 22-12-2011 నాటి  సమస్యా పూరణ-568 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, December 22, 2011

ఏల రుచియించు నందగోపాలు రసము !!!

అమృత తుల్యమౌ జ్ఞానమ్ము నరయలేని
కర్మ కారణ తత్వమ్ము గనని మతుల 
కేల రుచియించు నందగోపాలు రసము
విష గుళిక యయ్యె గీతా వివేక రసము!!! 


(శంకరాభరణం  బ్లాగు లో 21-12-2011 నాటి  సమస్యా పూరణ-567 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, December 21, 2011

సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!

ఇంపుగ వేడిన నిడుముల
ముంపును తప్పించువాడు ముక్తేశ్వరు డే
సంపద గోరును? సద్గుణ
సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!

వంపులు దిరిగిన జడసుడి
గంపన గంగనునిలిపిన గంగాధరుడే
సంపదయౌ భువికి గుణసు
సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో 20-12-2011 నాటి  సమస్యా పూరణ-566 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, December 20, 2011

భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్!!!

కోమలమౌ గానమువిని
ఆమెయె పాడినదనుకొని నావేశములో
నేమియు  పలుకగ నేరని
భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్!!!

(లోగడ బహుశ శ్రీ s .v .కృష్ణా రెడ్డి తీసిన సినిమాకాబోలు   నటి శ్రీ లక్ష్మి ద్విపాత్రాభినయం  చేస్తూ  హాస్య బ్రహ్మ  బ్రహ్మానందం గారితో కలిసి నవ్వులు పూయించిన సన్నివేశం తలచుకొని పూరించాను )
(శంకరాభరణం  బ్లాగు లో 19-12-2011 నాటి  సమస్యా పూరణ-565 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, December 19, 2011

శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్!!!

ఏకృప మార్చెను కుబ్జను
నాకృపయేసోకి మార నటుకులు సిరిగా
తా కరువారగ నరయుచు
శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్!!!

ఆకలి దీర్చెడు దేవుని,
శోకమ్ముల రూపుమాపు శోభిత మూర్తిన్
తా కనులారగ జూచుచు
శ్రీ కృష్ణున కిచ్చెసిరి కుచేలుడు నెమ్మిన్ !!!


లోకపవిత్రుడు మిత్రుడు
చీకాకులముద్ర లేని చిత్ర విచిత్రుం
డే కటువటుకులనడుగగ
శ్రీ కృష్ణున కిచ్చెసిరి కుచేలుడు నెమ్మిన్ !!!

(శంకరాభరణం  బ్లాగు లో 16-12-2011 నాటి  సమస్యా పూరణ-561 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, December 3, 2011

హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు!!!.

పాహి యనిన చాలు వరము లిచ్చెడు వేల్పు
భక్తి తోడ వేడ ముక్తినిచ్చు
దీన జనులగాచు దేవదేవుడు,బల
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు!!!. 


(శంకరాభరణం  బ్లాగు లో 26-11-2011 నాటి  సమస్యా పూరణ-539 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)