Monday, September 20, 2010

మనువు సున్న.

తెలుగు వారి  సంస్కృతిలో  బొట్టు, మంగళసూత్రాలు,మట్టెలు, గాజులు   పూలు ఇత్యాదివన్నీ పుణ్య స్త్రీలకు పవిత్ర మైనవి.
తర తరాల నుండి వీటిని ధరిస్తూ సంప్రదాయాన్ని ఇష్టపూర్వకంగా  గౌరవిస్తూ ఉండడం  అందరికీ  తెలియ నటువంటిది  కాదు
కాని కేవలం  ఇవిమాత్రమే స్త్రీలకు ఆనందాన్ని కలుగజేస్తాయని,  వారి  వ్యక్తిత్వాన్ని పెంపోదిస్తాయని అనుకోవడానికి లేదు
వేదింపులకు వెటకారాలకు  గురి చేసే   అత్త మామలు , చులకనచేసి  గౌరవానికి భంగం  కలిగిస్తూ ఎత్తిపొడుపు మాటలతో
అధికారం చెలాయించే ఆడబిడ్డలు ,మనసు అర్థం చేసుకోలేని, అసలు  మనిషే అర్థం కాని భర్త  ఉంటే  అసలు ఆనందం
ఎక్కడ  ఉంటుంది ?   వ్యక్తికి    ఆదరణ   కరువై , ఆత్మీయత దూరమైతే,  ప్రేమగా చూసికోని, ఎన్నిచదివినా తన మనసు మాత్రం 
చదవని  ఎన్ని తెలిసినా  మమత మాత్రం  తెలియని  భర్త  అయితే  ఇక ఆనందం ఎలా ఉంటుంది ? డబ్బు,దర్పం  మనిషికి కొంత
వరకు సుఖాన్ని ఇవ్వగలవేమో గాని  సంతోషాన్ని మాత్రం   ఇవ్వలేవు  ఎందుకంటే సంతోషం, ఆనందం అనేవి మనస్సులో
జనించేవి అని పెద్దలు చెబుతారు .
                 కుదురుగా దిద్దిన ముదురు కుంకుమ రేఖ
                         బడతుల ప్రణయ సౌభాగ్య రేఖ
                మంగళ ప్రదమైన  మాంగల్య చిహ్నంబు
                         పుణ్యాంగనల ప్రీతి పుస్తె  త్రాడు .
  .              జడనిండ సొంపైన జాజి మల్లెల దండ
                         చెలువంపు గాజులు  చేతినిండ
                  వ్రేళ్ళకు  తోడైన  వెండి మట్టెల  జోడు
                         పాదాల కమరిన పట్ట గొలుసు
                   
                    ఇన్ని యున్నను ఇంతులకింపు గలదె
                     అత్త గయ్యాళి వెటకారి మామ యున్న
                    ఆడు బిడ్దల కవ్వింపు జాడలున్న
                     మనసు జదవని మొగడున్న మనువు సున్న.

1 comment:

  1. మీ బ్లాగ్ పేరు లో సరదా కి చిరు కవిత బదులు " చిరు కవిత " అని రాయండి. ఎందుకంటే మీ కవిత లు చాలా బాగున్నాయి . సరదాకి అన్నట్టు గా లేవు ...!
    పై కవితలో "జీవిత అనుభవాన్ని .." జోడించారు.చివరి వాక్యాల్లో ..!
    నాకు నచ్చింది ...!
    వుంటానండి ... మీ ప్రోత్సాహానికి దన్యవాదములు.

    ReplyDelete