Wednesday, September 9, 2015

సమస్యా పూరణలు


( శంకరాభరణం బ్లాగులో  ఈమధ్య  చేసిన కొన్ని  సమస్యా పూరణలు)

 (శ్రీకాళ హస్తిశ్వర శతకము స్ఫూర్తిగా పూరించినది)
వింతల్మేన చరించగ
కాంతా సంఘంబు రోయ కాయంబు జరా
క్రాంతంబవ "జీవితమే
కాంతారమ్మనెను" మోక్ష కామికుడు తమిన్ !!!

( జీవితమే కాంతారమ్మనెను = జీవితమునే ఒక పేరడవి గా భావించెను)


కలడు కలడుదేవుండని కథలు పెక్కు
భాగవతులు జెప్పిరిమున్నుభక్తిమీర
ప్రాణి ప్రాణిలో దేవుండు ప్రతిఫలించ
దేవుడే లేడనెడు వాడు దేవుడయ్యె!!!

 యుగయుగమునందు ప్రభవింత్రులుర్వి యందు
ధర్మ నిరతులు జ్ఞానులు దార్శనికులు
పాపకర్ములు దుష్టులు భాగవతులు
మార్గ దర్శకులౌటకు మంచిచెడుకు !!!

 జుట్రాలుట ,తిరుపతివెం
కట్ర్రాజునిజూడకుండగడపుట, యిట పా
క్కుట్రల నాపుట కంటెన్
చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్ !

( పాక్కుట్రల = పాకిస్తాన్ కుట్రల)

ఈగలు దోమలు విరివిగ
మూగిన పర్యావరణము మురికిగ మారున్
రోగము లొసంగు జనులకు
భోగములను నీరుగార్చు భూగోళమునన్!!!

 ఇష్టత ప్రక్రియపై,సు
స్పష్టత ఛందస్సుపైన ,చతురత,భాషా
పుష్టి తదాదియు గల్గిన
ష్టంబవధానవిద్యకాదనిరి కవుల్!!! 

నామ మేదైన నడయాడు భూమి యొకటె
మతము లేవైన మానవ హితము కొరకె
కులము లేవైన త్రాగెడు జలము లొకటె
పద్ధతులు వేరువేరైన ప్రార్థనొకటె
శాంతిలేనట్టి దేశాన సుఖము గనము
ధనము ధాన్యము లేక జీవనము లేదు
గంగచేయును జేయును గౌసియమ్మ
క్రిస్టినా చేయును వరలక్ష్మీ వ్రతమ్ము !!!


 దుస్ససేనుని యర్థాంగి, ద్రుపదతనయ
యిరువురొకయింటి కోడండ్రు నరయ గాను
రాజ్య కాంక్షయే చిచ్చును రగులజేయ
కౌరవ వినాశనమునకు దారితీసె !!!


 భీమడు పతిని వధియింప బేల యయ్యె
దుస్ససేనునియర్ధాంగి ,ద్రుపద తనయ
క్లేశ మణగగ ముడిచెను కేశములను
స్త్రీల హింసించ పడియెడు శిక్ష యిదియె !!!


 చండిక యేయన క్రీడా
భండనమున పోరుచున్న పత్నికి గెలుపే
పండగ యౌనను నమ్మక
ముండను వీక్షించి మగడు మోదమునందెన్!!!


 చెడునడతలులేవేమియు
నొడుదొడుకులులేవు లేనిదుద్యోగమ్మే
పడతులు నటనట తారస
పడుచున్నను పెండ్లియాడు వారే లేరే !!! 

 వేణీ భరమ్ము భూషణ
శ్రేణీ రుచిరమ్ము దోచె చిత్తము, చేతున్
పాణీ గ్రహణమ్మను ప్రియు
బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్ !!! 


 ఒకడు పల్లకి నెక్కును నొకడు మోయు
బడయు సుఖమును దుఃఖంబు బడయు నొకడు
పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలవి
శేషమే చాలు నెనలేని శ్రీలు గురియ!!! 

 పోరగ రథికుండుండగ
సారధి చక్రంబుబట్ట సరియే కృష్ణా ?
వీరులు మదిదలుతురిటుల
భారత యుద్ధమున నయ్యొ పార్ధుం డోడెన్!!! 

 పోర వరించెను విజయము
భారత యుద్ధమున నయ్యొ పార్థున్ డోడెన్
వీరవరేణ్యుడు కర్ణుడు
కారణములుగలవుపెక్కు కథపరికింపన్ !!!

అంధు డైనట్టి కురురాజు హరిని గాంచ
గర్వ మనుమబ్బు గ్రమ్మ సుపర్వు లైన
సత్యమును గాంచ లేరన్న తత్వ మతని
కన్నులబ్బెను ఫలమును గాంచె నెదుట !!!  భర్తృరహిత సంతుఁ బడసి మురిసె నన్న
ధర్మబద్ధ మౌనె ధర్మరాజ?
పతినిపొందు యముని వరమొందిసావిత్రి
సంతసంబు నొందె సచ్చరిత్రి!!!

 పుట్టిన గడ్డను మరువక
మట్టిని నమ్ముచు జనహితమౌచర్యల చే
పట్టుచు దురహంకారపు
బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!


 నిండుసభనప్రభువడిగెను
పండితుడననెవడు? పరమపామరుడుగ, దా
నుండగ నొప్పని వాడే
పండితుడని దెలిపెనొక్క పండితుడకటా !!!


పండ్ల నమ్ము నొక్క పడతి సాధువుతోడ
పలికె తినగ పళ్ళు బలము పెరుగు
మేలిమైనపండుమేడి,పురుగులు చే
రవిక,విప్పి డాసె రమణి యతిని !!! 

 ముద్దు లొలుకు బుడత బుద్ధిమంతుడు గాడు,
చిలిపి చేష్ట లెపుడు చేయు చుండు,
పంచ దార డబ్బ పడదోసి యీగలు
మూగ, వాడు పాడె మోహనముగ !!!...

No comments:

Post a Comment