Wednesday, May 14, 2014

నాలుగైదులు పదునాఱు నలిన నయన !!!

నడుప బోకు వాహనమును మెడనువంచి
చెవిన చర వాణి బెట్టుచు చెఱుపు గలుగు
దంతములు ముప్పదారులో తరుగు, మిగులు,
నాలుగైదులు,పదునాఱు నలిన నయన !!!

(శంకరాభరణం  బ్లాగులో 28-03-2014 నాటి  సమస్యా పూరణ-   1365లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Tuesday, May 13, 2014

రసమయమౌ జీవితములు!!!

ప్రసరించిన రవికిరణము
ముసిరిన  చీకట్లు తొలుగు, పుడమి తరించున్
బసవేశ్వరు కృప కలిగిన
రసమయమౌ జీవితములు రౌద్రత  తొలుగున్ !!!


 

బద్దకించు వాడె భాగ్య శాలి!!!

కష్ట జీవి ముందు కాలమే తలవంచు
వరమిడు సిరి యేల బద్దకించు?
వాడె భాగ్య శాలి వాడెపో ధీశాలి
యశము ,జయము వాని వశము గాదె !!!

(శంకరాభరణం  బ్లాగులో 27-03-2014 నాటి  సమస్యా పూరణ-   1364లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Monday, May 12, 2014

గీతా పారాయణమ్ము గీడొనరించున్ !!!

భీతిల్లితిగద పుత్రా
రాతిరి విషయమ్ము తెలిసి,రంగని సుతయౌ
ప్రీతిని పెండ్లాడుము "సం
గీతా" పారాయణమ్ము గీడొనరించున్ !!!

(శంకరాభరణం  బ్లాగులో 23-03-2014 నాటి  సమస్యా పూరణ-   1360లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

సాగర మథనంపు సారమే యిదికదా !!!

కష్ట సాద్య మైన కార్యమ్ము సాధింప
తగును చెలిమి చేయ పగను మరిచి
సాగర మథనంపు సారమే యిదికదా
మంద వారిమాట మణుల మూట !!!

Sunday, May 11, 2014

కామితార్థముల్ సిద్ధించు లేమి వలన !!!

ఉండెనే మున్ను యిన్నిన్ని యుర్విలోన
కృషిని నమ్మిన విజ్ఞాన ఋషులు కలిసి
సుఖమయమ్ముగ జేసిరి నిఖిల జగతి
కామితార్థముల్ సిద్ధించు లేమి వలన !!!

  (శంకరాభరణం  బ్లాగులో 22-03-2014 నాటి  సమస్యా పూరణ-   1359లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

వరుడు కావలెను ????

ఓపిక గలిగిన వాడును
కోపము లేనట్టి వాడు ,కోమలి మెచ్చే
రూపము గలిగిన వాడును
తా పసి గానట్టి గట్టి ధనికుడు చాలున్ !!!


Saturday, May 10, 2014

తండ్రినే భర్తగాబొంది తరుణిమురిసె!!!

నంద గోపాలు రూపమే డెందమందు
మెదల నార్యామహాదేవి పదములంటి
వేడి, శ్రీకృష్ణునే నాడు; వీడి కన్న
తండ్రినే ,భర్తగాబొంది తరుణిమురిసె


  (శంకరాభరణం  బ్లాగులో 12-01-2014 నాటి  సమస్యా పూరణ-   1291లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Friday, May 9, 2014

మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !

నింగి వాకి లంచు నెరజాణ తలపోయ
పండు వెన్న లంతపిండియయ్యె
చుక్కలన్ని కలసి చక్కనౌ నొక చంద
మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !!

(శంకరాభరణం  బ్లాగులో 11-01-2014 నాటి  సమస్యా పూరణ-   1290లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

జింకనుగనిబెదిరి పాఱె జిఱుతపులివడిన్!!!

సంకట హరుడౌ తిరుమల
వెంకటపతికొండపైన వేడుకగా ప
ల్వంకల్మెరియగ విద్యుత్
జింకనుగనిబెదిరి పాఱె జిఱుతపులివడిన్!!!

(శంకరాభరణం  బ్లాగులో 19-09-2013 నాటి  సమస్యా పూరణ-   1179లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Thursday, May 8, 2014

భవతారకమగును మాంస భక్షణ మెపుడున్!!!

రవికుల తిలకుని నామము
భవతారకమగును; మాంస భక్షణ మెపుడున్
కువలయమునసహజపుక్రియ
యెవరికి నెయ్యెది యుచితమొ యెవ్వడె రుంగున్ ?

(శంకరాభరణం  బ్లాగులో 10-01-2014 నాటి  సమస్యా పూరణ-   1289లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Wednesday, May 7, 2014

తాటకిని జంపె భరతుడు తపసి కనగ !!!

ధర్మ సూక్ష్మమ్ము నెరిగిన దాశరథియె
తాటకినిజంపె: భరతుడు తపసిగ నగ
రమును వీడెనాకేలయీ రాజ్యమనుచు 
పట్టమును గట్టె శ్రీరామ పాదుకలకు !!!
 
(శంకరాభరణం  బ్లాగులో 07-01-2014 నాటి  సమస్యా పూరణ-   1286లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

Monday, May 5, 2014

ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున!!!

నీతి తప్పినా , మాటలు నీటి మూట
లైన, కష్టాలు పెరిగినా ,పైన పిడుగు
పడిన భరియింత్రు ,దొంగలే ప్రభువులైన
ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున!!!

(శంకరాభరణం  బ్లాగులో 01-01-2014 నాటి  సమస్యా పూరణ-   1280లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

Sunday, May 4, 2014

ముట్లుడిగినసతికి, నొక్క పుత్రుడు బుట్టెన్!!!

చిట్లెనుతల మెట్లెక్కగ
ముట్లుడిగినసతికి, నొక్క పుత్రుడు బుట్టెన్
అట్లమ్ము వారి పడతికి
తొట్లెకురమ్మనెనుసతిని తోయలి వేడ్కన్ !!!

(శంకరాభరణం  బ్లాగులో 23-09-2013 నాటి  సమస్యా పూరణ-   1183లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Saturday, May 3, 2014

దనుజులు హరిభజన జేయు ధన్యులు సుమతుల్!!!

మనసే మందిరమనుకొని
మనసున హరిహరుల నిల్ప మంగళ ప్రదమౌ
మనుజులె కనబడు దివిజులు
దనుజులు ,హరిభజన జేయు ధన్యులు సుమతుల్!!!
(శంకరాభరణం  బ్లాగులో 21-09-2013 నాటి  సమస్యా పూరణ-   1181లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Friday, May 2, 2014

శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్!!!

అష్టమ గర్భమందు సురలందరు మెచ్చగ పుణ్య శీలికిన్
దుష్టుల మట్టుబెట్ట మును తోయజనేత్రుడు బుట్టెనంద్రు, ప
ల్కష్టము లన్నిదీర్చి మము కావగ బుట్టుము వెండి ,లేనిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్!!!

(శంకరాభరణం  బ్లాగులో 20-09-2013 నాటి  సమస్యా పూరణ-   1180లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

పుస్తకములఁ జదువువాని బుద్ధినశించున్!!!

విస్తార భారతావని
నిస్తే జమ్మయ్యెనేడునేతల కృపతో,
పస్తుల నార్పని  నార్థిక
పుస్తకములఁ జదువువాని బుద్ధినశించున్!

(శంకరాభరణం  బ్లాగులో 19-09-2013 నాటి  సమస్యా పూరణ-   1179లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, May 1, 2014

మూఢ మతులాదరింత్రు ముముక్షువులను !!!

శక్తి పరిపూర్ణ లలితాంబ చలువ గలుగ
మూఢ మతులు తత్వజ్ఞాన మూర్తు లవరె ,
సత్య మేలోన నిత్యమై నృత్యమాడ
మూఢ మతులాదరింత్రు ముముక్షువులను !!!

(శంకరాభరణం  బ్లాగులో 18-09-2013 నాటి  సమస్యా పూరణ-   1178లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

తా తను వివాహ మాడెను తరుణి మెచ్చి !!!

పలికె నిట్టుల శ్రీవల్లి , వనజ మున్ను
వలదు వలదని పలుమార్లు పలికి పలికి
వెంట దిరిగిన వాసునే ,వింటివా ల
తా ! తను వివాహ మాడెను తరుణి మెచ్చి !!!

(శంకరాభరణం  బ్లాగులో 17-09-2013 నాటి  సమస్యా పూరణ-   1177లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు