Wednesday, April 30, 2014

మిసిమి బంగారమ్ము !!!

మధుర మైన వన్ని మంచివిగానట్లు
చదువు కొన్న   కాడు  సజ్జనుండు
మెరియు నట్టివన్ని  మిసిమి బంగారమే ?
మంద వారి మాట మణుల  మూట!!!

పాత్ర ననుసరించి ప్రాప్తమౌ నేదైన!!!

వనజ భవుడు నుదుట వ్రాసినదెటులైన
వచ్చిజేరు గాన వలదు చింత
పాత్ర ననుసరించి  ప్రాప్తమౌ నేదైన
మంద వారిమాట మణుల మూట !!!

Tuesday, April 29, 2014

శక్తి హీనత గాదు !!!

సహన శీలతెపుడు శక్తి హీనత గాదు
ప్రేమ తత్వమెపుడు పిరికి గాదు
అమ్మ కుండునట్టి నరుదైన గుణములే !
మంద వారి మాట మణుల మూట !!!

పనుల దాట వేయ ఫలమునిష్పలమౌను!!!

సమయము నెవరైన  సద్వినియోగమ్ము
చేయు  వారి చెంత జేరు జయము,
పనుల దాట వేయ ఫలమునిష్పలమౌను
మంద వారి మాట మణుల మూట !!!

Friday, April 25, 2014

పుస్తక పఠనము!!!


పుస్తక పఠనమ్ము వలన
మస్తకములుకాంతులీను మణిదీపములై
హస్త గతమౌను విద్య, స
మస్తముతెలియంగవచ్చు మాన్యత హెచ్చున్  !!!

Wednesday, April 23, 2014

గుడి యున్న చాలురా!!!

సంఘ సేవ కొఱకు సంపదక్కర లేదు
సేవ సేయు  చొరవ, చేవ,వలయు
గుండె లోన కరుణ నిండియున్నను చాలు
మంద వారి మాట మణుల మూట !!!

Tuesday, April 22, 2014

డబ్బు కరిగి పోయె జబ్బు పెరిగె !!!


దగ్గుకొక పరీక్ష దమ్ముకు మరి రెండు 
డబ్బు కరిగి పోవు  జబ్బు పెరుగు
వ్యాధిగుర్తుబట్టు వైద్యులే కరువైరి
మంద వారి మాట మణుల మూట!!!

Monday, April 21, 2014

సాఫ్టు వేరు వరుని సంబంధ మొద్దురా !!!

నిన్నకాకినాడ , నేడు కామారెడ్డి
రేపు రేణి గుంట, మాపు గుత్తి
సాఫ్టు వేరు వరుని సంబంధ మొద్దురా
మందవారి మాట మణుల మూట !!!

Friday, April 18, 2014

వనజభవుని కైన !!!

చాలు మూర్ఖు డొకడె సంద్రాన బంగారు
నాణె ముబడవేయ  ;కాని తీయ
వశమె ఘనుని కైన వనజభవుని కైన
మంద వారి మాట మణుల మూట !!!

Thursday, April 17, 2014

సెలవులు లేనట్టి చదువు!!!

జలమును లేనట్టి చెరువు
నిలకడ లేనట్టి కొలువు నిజమేనాడున్
పలకని నేతయు నెపుడున్
సెలవులు లేనట్టి చదువు చేదౌ జగతిన్ !!!

ఉండ తగును !!!

ఉండ తగును గాదె నుచితమౌ స్థానాన
సున్న సంఖ్య ప్రక్క నున్న బలము
సున్న ప్రక్క సున్నలెన్నున్న శూన్యమే
మంద వారి మాట మణుల మూట !!!

Wednesday, April 16, 2014

సకల సద్గుణ వారాశి సత్య భాషి !!!

మునివెంట జని వనంబున తాటకిని జంపి
తపసుల గాచిన ధన్య జీవి!
నిటలాక్షు చాపమున్ తృటి లోన ద్రుంచిన
వీరాగ్ర గణ్యుoడు వినయ శీలి!!
తండ్రియానతివిని త్యజియించి రాజ్యమ్ము
కానల కేగిన కర్మయోగి!!!
నీతి రీతిని దప్పి సీతనపహరింప
దశకంఠు గూల్చె కోదండ పాణి !!!!

సకల సద్గుణ వారాశి సత్య భాషి
రుజువు లక్కర లేని కారుణ్య మూర్తి
దరణి పైనడ యాడిన ధర్మ మూర్తి
చరిత మరచునే శ్రీరామ చంద్ర కీర్తి !!!!!

సర్వ మెరుగు వాడు సంసారమున లేడు !!!

తెలియనివిషయమ్ము తెలుసుకొనడమొప్పు
కూడ తెలిసి చెప్ప కునికి తప్పు
సర్వ మెరుగు  వాడు సంసారమున లేడు
మంద వారి మాట మణుల మూట !!!

Tuesday, April 8, 2014

పుట్టినట్టిజీవి !!!

ఏది శాశ్వతమ్ము యేది కాదనియెడు
విషయ మెరుగు నట్టి విభు వొకండె
పుట్టినట్టిజీవి గిట్టుటే సత్యంబు
మంద వారి మాట మణుల మూట !!!

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!!





 Wishing You A Very Happy Ram Navami

 Ram Navami 2014 Images


శివ ధనువును రఘురాముడు
నవలీలగ   నెత్తి ద్రుంచి నవనిజ సీతన్
ధ్రువ కీర్తిన పెండ్లాడెను
రవిచంద్రుల సాక్షిగాను రమణీయముగా !!!




Monday, April 7, 2014

రామ రామ యనిన!!!

రామ రామ యనిన దోమలే పోలేవు
పాప మెటులబోవు భజన వలన
దక్కు విజయ  మెపుడు ధర్మాచరణ చేత
మంద వారిమాట మణుల మూట !!!

Sunday, April 6, 2014

మాట మంత్రమౌను!!!

మాట మంత్రమౌను మహిలోన పరికించ
మదిని దోచు గాదె మంచి మాట
కటువు మాట లాడ  కార్యముల్ జెడిపోవు
మంద వారి మాట మణుల మూట !!!

Saturday, April 5, 2014

తెలిసియుండ వలెను తెలివిగా భాషింప!!!

తెలిసియుండ వలెను  తెలివిగా భాషింప
లేనియెడల చాలు మౌనవ్రతము
రెంటిలోన నొకటి ఒంటబట్టిన మేలు 
మంద వారి మాట మణుల మూట !!!