Monday, September 30, 2013

వెధవ విబుధుడౌనె వేషంబుమార్చిన!!!

గళ్ళ జీనువేసి కళ్ళెంబు తగిలించ
ఖరము మారిపోయి తురగమగునె
వెధవ విబుధుడౌనె వేషంబుమార్చిన
మంద వారి మాట మణుల మూట!!!

Wednesday, September 25, 2013

పాదమ్ములులేని నరుడు పరుగిడజొచ్చెన్ !!!

వేదాద్యయనము, శ్రీహరి
పాదార్చన, గురువుసేవ వరహృదయమునన్
పాదుకొనజేయ దుర్బల
పాదమ్ములులేని నరుడు పరుగిడజొచ్చెన్ !!!

(శంకరాభరణం  బ్లాగులో 01-09-2013 నాటి  సమస్యా పూరణ-   1161లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)      

Tuesday, September 24, 2013

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను !!!

హరిని నిందించు రాజునకవని మెచ్చు
కొడుకు పుట్టె ;సన్యాసికి గురువు కృపను
భక్తిమార్గమ్ము జూపించు శక్తిబుట్టు,
పుచ్చునేతల కెపుడుసద్బుద్ధి పుట్టు?

(శంకరాభరణం  బ్లాగులో 31-08-2013 నాటి  సమస్యా పూరణ-   1160లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)      

“తెలుఁగు పద్యము”!!!

 “తెలుఁగు పద్యము”
గురువుల లఘువుల కుదురుగా కూర్చిన
.....పలు గణమ్ముల మాల పద్యమోయి,
ప్రాసలు యతులను పరిమితుల్ గల్గిన
.....విద్యయే రసరమ్య పద్య మోయి,
శార్దూల మత్తేభ చంపకోత్పలముల
..... పలువృత్తములమాల  పద్యమోయి,
సంధి సమాసాలు సహజోపమానాలు
.....ప్రాణంబు లైనట్టి పద్యమోయి,

పద్యమే తెల్గు భాషకు ప్రాణ మోయి,
పద్యమే తెల్గు కవులసౌభాగ్య మోయి,
 పద్యమేనాటకములకు  హృద్య మోయి,
పద్యమే వాణి కిష్ట నైవేద్య మోయి!!!

 (శంకరాభరణం  బ్లాగులో 31-08-2013 నాటి  “తెలుఁగు పద్యము”!!!   450 .తోటి మిత్రుల రచనలను బ్లాగులో వీక్షించవచ్చు






Monday, September 23, 2013

వెలుతురున్న చోట నిలుచునే తిమిరమ్ము?

తపన యున్న,యింటి తలుపుతట్టుగెలుపు
ఓటమితన మొగము చాటు వేయు
వెలుతురున్న చోట నిలుచునే తిమిరమ్ము?
మంద వారి మాట మణుల మూట!!!

వొడ్డాణమలంకరించెనువిదశిరమ్మున్!!!

రెడ్డీలయింతి   పంక్తిన
లడ్డూలనుచేతబట్టి లావణ్యమునన్
వడ్డనజేయగ తగిలిన
వొడ్డాణమలంకరించెనువిదశిరమ్మున్!!!

  (శంకరాభరణం 28 -08-2013 నాటి  సమస్యా పూరణ-   1157లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, September 22, 2013

భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు !!!

గతప్రాభవమునకు ప్రతిరూపమైనట్టి
....పలుకట్టడమ్ముల ప్రభలుతగ్గె
నిజమైన ప్రేమకునిలువెత్తుసాక్ష్యమౌ
....భాగ్యనగర సీమ పరువు తరిగె
విజ్ఞానగంధమ్మువిశ్వానికందించు
....విద్యాలయమ్ములు వికలమయ్యె
వాసిగాంచినమేటి  మూసీసుజలధార
....మురికి కాల్వగమారి పరుగు లాపె
భిన్న జాతుల మద్య బిగిసిన బంధమ్ము
....లన్నదమ్ములమద్య నతుకులూడె

తెలుగు నగరాన నాంగ్లమ్ము వెలుగు చుండె
బలము గలిగిన వారికే ఫలము దక్కె
మేటి నగరాల కెల్లను సాటి, నాటి
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు !!! 


 (శంకరాభరణం  బ్లాగులో  29-08-2013 నాటి  సమస్యా పూరణ-   1158 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)    

మురళీగానమ్ము మరణమును గలిగించున్!!!

 నరపాలా! రూపాయిని
పరికింపుము,లేనియెడల వాణిజ్యమునన్
సరళీ కృత రాగజనిత
మురళీగానమ్ము మరణమును గలిగించున్!!!


(శంకరాభరణం  బ్లాగులో 24-08-2013 నాటి  సమస్యా పూరణ-   1153లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)      

Saturday, September 21, 2013

తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!!

తల్లి దండ్రులక్షేమమ్ముదలపలేక
పలుకులందున సత్యమ్ము నిలపలేక
ప్రేమతత్వమ్ముశూన్యమై  వెళ్ళు చుండు
తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!!

(శంకరాభరణం  బ్లాగులో 23-08-2013 నాటి  సమస్యా పూరణ-   1152 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)     

బకమున్వడి మ్రింగుచున్నబల్లింగనుమా!!!

శుకమునకు పికమునకు మ
క్షికమునకు మశకమునకును జెప్పెద నేనే
శకునమ్మన,చూపులతో
బకమున్వడి మ్రింగుచున్నబల్లింగనుమా!!!

(శంకరాభరణం  బ్లాగులో 25-08-2013 నాటి  సమస్యా పూరణ-   1154 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)    

Friday, September 20, 2013

సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్!!!

మ్రానుసమానుని కవికుల
భానునిగాదీర్చినట్టి వాణీ! పదగీ
ర్వాణీ!! పంకజభవు దొర
సానీ!!! నీసాటి గలరె సాధ్వులలోనన్!!! (1)

ఆనాటికినీనాటికి
కోనలలోబ్రతుకుకోయ కూనలకెల్లన్
ప్రాణముపోసెడు కిన్నెర
సానీ! నీ సాటి గలరె సాధ్వుల లోనన్!!!  (2)


 (శంకరాభరణం  బ్లాగులో 21-08-2013 నాటి  సమస్యా పూరణ-   1150 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

యమమహిష ఘంటికానాదమతి హితమ్ము!!!

ధరలు, దౌష్ట్యమ్ము, నవినీతి పెరిగిపోయి
జీవనముఘోరనరక మై చింతహెచ్చి
దినదినముచచ్చుజీవుని దిగులుదీర్చు
యమమహిష ఘంటికానాదమతి హితమ్ము!!! 

 (శంకరాభరణం  బ్లాగులో 20-08-2013 నాటి  సమస్యా పూరణ-   1149 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)    

Thursday, September 19, 2013

వలదు వలదనుకొన్నసంప్రాప్తమగును!!!

కావలయునన్న పుట్టునే కరుణ రసము
పోవలయునన్న పోవునే పొగరు గుణము
కో పతాపాలు  మదిలోన  కొలువు దీర
వలదు వలదనుకొన్నసంప్రాప్తమగును!!! 

 (శంకరాభరణం  బ్లాగులో 19-08-2013 నాటి  సమస్యా పూరణ-   1148 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)   

భీమసేనుడు దేవకీ ప్రియసుతుండు!!!

భీమసేనుడు, దేవకీ ప్రియసుతుండు
జూచుచుండగ గదబూని చాచికొట్టి
మడుగులోనున్న కురురాజు తొడలపైన
పూర్తి జేసెను రణమును పుడమి మెచ్చ!!!


 (శంకరాభరణం  బ్లాగులో 18-08-2013 నాటి  సమస్యా పూరణ-   1147 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

Wednesday, September 18, 2013

పుస్త కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము!!!

ప్రజల మస్తకముల పఠియింప వలెనన్న
చదువుటొప్పు సకలశాస్త్రములను.
రహిని త్రుంచి మత్సరములబెంచెడుపుస్త
కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము!!!


 
(శంకరాభరణం  బ్లాగులో16-08-2013 నాటి  సమస్యా పూరణ-   1145 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)   

బుద్ధి శుద్ధి జేయు బుధుని మందు!!!

శంకరా భరణపు సంజీవినై యొప్పు
రామ జోగి మందు: ప్రాణ హరము
గాని, మాన హాని గాని లేనట్టిదౌ
బుద్ధి శుద్ధి జేయు బుధుని మందు!!!

(శంకరాభరణం  బ్లాగులో 09-08-2013 నాటి  సమస్యా పూరణ-   1138 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

Tuesday, September 17, 2013

త్రాగి పాడెనంట త్యాగరాజు!!!

శ్రుతుల సారమెల్ల కృతులలో బంధించి
రచన జేసి భక్తి రసములూర
రాగ తాళమిళితరామనామరసము
త్రాగి పాడెనంట త్యాగరాజు!!!


 (శంకరాభరణం  బ్లాగులో 08-08-2013 నాటి  సమస్యా పూరణ-   1137 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

పాండవులు దుష్ట చిత్తులై భంగ పడిరి!!!

ధర్మ నిరతులు ధరనేల తగిన వారు
పాండవులు: దుష్ట చిత్తులై భంగ పడిరి
కౌరవులుపెక్కు మారులు ధారుణముగ
ధర్మ సుతునకే చివరకు ధరణి దక్కె!!!

 (శంకరాభరణం  బ్లాగులో07-08-2013 నాటి  సమస్యా పూరణ-   1136లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

Monday, September 16, 2013

వావి వరుసలఁ జూడనివా రనఘులు!!!

రాజ రాజనరేంద్రుని రాణియైన
రమణిచిత్రాంగికోరగ రాచకొడుకు
వావి వరుసలఁ జూడనివా రనఘులు
కారుకారనివారించెగౌరవముగ!!!

 (శంకరాభరణం  బ్లాగులో05-08-2013 నాటి  సమస్యా పూరణ-   1134లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు) 

Sunday, September 15, 2013

సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్!!!

పెంపువహించినమునియే
సంపదలహరించిజేయ సత్యపరీక్షన్
కంపమునొందక పిడికెడు
సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్!!!
(సాధ్వి =చంద్రమతి)

కొంపను సంసారపుచిరు
గంపను నడుపగ సరి పడు కష్టపు ఫలమే
యింపనిదలచు నధర్మపు
సంపాదనలేనిమగని సాధ్వి నుతించెన్!!! 

(శంకరాభరణం  బ్లాగులో03-08-2013 నాటి  సమస్యా పూరణ-   1132 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

Saturday, September 14, 2013

మోఁకాలికిబోడిగుండు ముడివెట్టఁ దగున్!!!

శ్రీకరుడౌ యదు సింహుని
సూకరమనుకొని కిరాతశూరుడు గూల్చన్
రోకలియే కారణమట
మోఁకాలికిబోడిగుండు ముడివెట్టఁ దగున్!!! 

ఏకారణముననైనప
రాకున నమెరికనొబామ రాగముమారన్
వ్యాకులమౌ విపణివిలువ
మోకాలికి బోడిగుండు ముడివెట్ట దగున్!!!

(శంకరాభరణం  బ్లాగులో02-08-2013 నాటి  సమస్యా పూరణ-   1131 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు) 

కౌగిలిమరణమ్మునొసగుగదసరసులకున్!!!

భోగాలకుబానిసలై
చేగూడని పనులుజేయ చేదౌ బ్రతుకే
రాగూడని రోగపుబిగి
కౌగిలిమరణమ్మునొసగుగదసరసులకున్!

(శంకరాభరణం  బ్లాగులో  01-08-2013 నాటి  సమస్యా పూరణ-   1130 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
  

Friday, September 13, 2013

మనము శాంతించునెన్నొసమస్యలున్న!!!

వెలుగువచ్చిన చీకటి తొలగునట్లు
జ్ఞాన మార్జింప నజ్ఞానమంతరించు
బుద్దిశుద్దమౌ సత్యమ్ము బోధపడును
మనము శాంతించునెన్నొసమస్యలున్న!!! 

(శంకరాభరణం  బ్లాగులో  31-07-2013 నాటి  సమస్యా పూరణ-   1129 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు) 

లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్!!!

పలుకులరాణి సత్కళలవాణికి మోదము గూర్చనట్టిదౌ
జలనిధిపైననూగుజలజాయత నేత్రునికిచ్చగాని, లో
కులకురసానుభూతులను గూర్చగలేని వికార పూరమౌ
లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్!!!
.
(శంకరాభరణం  బ్లాగులో 30-07-2013 నాటి  సమస్యా పూరణ-   1128లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, September 12, 2013

పండగ నాడేలనాకు పాత మగడనెన్!!!

రెండుండ వాహనంబులు
నిండాపదహారురాని నీపుత్రుండౌ
పండరి కేలా క్రొత్తది
పండగ నాడేలనాకు పాత? మగడనెన్!!! 

(శంకరాభరణం  బ్లాగులో  29-07-2013 నాటి  సమస్యా పూరణ-   1127 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు) 

Wednesday, September 11, 2013

కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్!!!

‘ఆతడు తండ్రి యామెకట యాతని కర్మఫలమ్మదేమిటో
యాతన జెందసాగితను నాకలి దాహమటంచు దీనుడై
చేతులనెత్తి దీర్చుమని చెయగ సంజ్ఙలుజైలులోపలన్
కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్!!!

(ఎప్పుడోశ్రీగుమ్మడివెంకటేశ్వర్రావుగారుతనరష్యాపర్యటనజ్ఙాపకాలను ఒకపత్రికలో వివరిస్తూ అక్కడ తాను ఒక చిత్రాన్ని చూసి చలించి పోయినట్లు వ్రాసారు " ఆ చిత్రంలో జైలులో ఉన్న తండ్రిని సందర్శిస్తూ అతని దీనస్థితికి చలించి తన స్తన్యమిచ్చి దాహాన్ని తీర్చుచున్న కూతురి చిత్రమట అది " ఆ సంఘటన ఈ పూరణకు ప్రేరణ.)

(శంకరాభరణం  బ్లాగులో  28-07-2013 నాటి  సమస్యా పూరణ-   1126లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు) 

శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్ !!!

పరువమునందతి సహజము
మరుతాపము ప్రాణికోటి మనుగడ కెల్లన్
హరిణపు ప్రణయపు  తొలివిరి
శరమున్ గని జింకపిల్ల సంతసమందెన్ !!!

(శంకరాభరణం  బ్లాగులో  09-07-2013 నాటి  సమస్యా పూరణ-   1107లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Tuesday, September 10, 2013

పెండ్ల మయ్యెనుబార్వతివిష్ణువునకు!!!

భువనమోహనునకు ఫణి భూషణునకు
పరమ శివునకు పరితాపహరునకు తగు
పెండ్ల మయ్యెనుబార్వతి:విష్ణువునకు
మునిజనసురగణములకు మోదమలర!!!

మండు నేత్రము ఫాలమందుండు దొరకు
వెండి కొండపై కొలువుండు దండి దొరకు
పెండ్ల మయ్యెను బార్వతి :విష్ణువునకు
సకల జనులకు మోదమౌ సరళి నదియె !!!

(శంకరాభరణం  బ్లాగులో  08-07-2013 నాటి  సమస్యా పూరణ-   1106లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, September 9, 2013

వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!!!

బ్లాగు వీక్షకులకు, కవిపండిత మిత్రులందఱికిని వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు.

వందన మిదుగో శుభకర
వందనమందారమాల వరగుణ శీలా
వందనమిదె సురసేవిత
వందన శతములు గణేశ వైరివినాశా !!!

తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నలన్ !!!

లీలగ జెప్పినాడ మన లీలల నన్నిటి తల్లిదండ్రికిన్
కాలపుతీరుమారెగద కాదనలేరిక పెళ్లిచేయగన్
చాలనె చాటుమాటు సరసాలు, వివాహపుసంబరాలలో
తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నలన్ !!!

  (శంకరాభరణం  బ్లాగులో  07-07-2013 నాటి  సమస్యా పూరణ-   1105 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, September 8, 2013

సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁదగున్!!!

ఊహా సుందరివీవని
స్నేహమ్మును జేయుమనుచు చెడుయూహలతో
మోహావేశమున తగని
సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁదగున్!!!
 (శంకరాభరణం  బ్లాగులో  06-07-2013 నాటి  సమస్యా పూరణ-   1104 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)


Saturday, September 7, 2013

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్ !!!

పొరపడి నాగ్రహించి తగు పోరునుజేయగ నెంచి లేచు సో
దరునికి జెప్పె కూడదని ,తారకరాముడనుగ్రహించె నా
భరతుని ; జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
పరమపవిత్ర జానకిని బాధల నెట్టిన  పాపి రావణున్ !!

 (శంకరాభరణం  బ్లాగులో  05-07-2013 నాటి  సమస్యా పూరణ-   1103 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, September 6, 2013

బాట వీడి నడచు వాడె జ్ఞాని !!!

స్వార్థచింతవీడిసంఘపుమేల్గోరి
సేవజేయువాడె దైవసముడు
నీతినియమములకు నిలబడి యవినీతి
బాట వీడి నడచు వాడె జ్ఞాని !!!
(శంకరాభరణం  బ్లాగులో  04-07-2013 నాటి  సమస్యా పూరణ-   1102 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్య ఫలముగన్ !!!

వరమో, కలికాలపు కల
వరమో,తెలియంగ వశమె వార్తగ వచ్చెన్
కరిహెల్జరనెడు జర్మను
పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్య ఫలముగన్ !!!
(శంకరాభరణం  బ్లాగులో  03-07-2013 నాటి  సమస్యా పూరణ-   1101 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

Thursday, September 5, 2013

మధువు పైన వ్రాలు మక్షికమ్ముల తీరు !!!

వదలకుండు నట్టి మధుమేహ మొకటున్న
వ్యాధులన్ని జేరు వరసబెట్టి
మధువు పైన వ్రాలు మక్షికమ్ముల తీరు
మంద వారి మాట మణుల మూట !!!

నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!

నవ వధువౌ సీత వరుడు
రవికులతిలకుని ప్రతిమలు రమణీయమ్మై
నవమిన ధగధగ మెరియ
న్నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!!
(శంకరాభరణం  బ్లాగులో  01-07-2013 నాటి  సమస్యా పూరణ-   1099 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

Wednesday, September 4, 2013

శివుడు దశరథునకు చిన్నకొడుకు!!!

శివుడు దశరథునకు చిన్నకొడుకు కాదు
గాన కోడలమ్మ కాదుగిరిజ
కరిముఖుండుజూడ కాబోడుమనుమండు
ఎవరికెవరుతండ్రి యెఱుగతరమె !!!

(శంకరాభరణం  బ్లాగులో  30-06-2013 నాటి  సమస్యా పూరణ-   1098 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు )

కుందేలునుకోడిపిల్ల గుటుకున మ్రింగెన్ !!!

అందరి వలెనే భయపడి
మందును మ్రింగకయె బాల మరిమరి యేడ్వన్
పందిరిలో కనిపించెను
కుందేలును,కోడిపిల్ల ;గుటుకున మ్రింగెన్ !!!
(శంకరాభరణం  బ్లాగులో  29-06-2013 నాటి  సమస్యా పూరణ-   1097 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

Tuesday, September 3, 2013

కుండలోన బెట్టె గువలయమును !!!

నేత్ర యుగళమందు నెలరాజు దినరాజు
వక్షముపయి లక్ష్మి లక్షణముగ
నలరు శౌరి నుదరమను నట్టి కొండొక
కుండలోన బెట్టె గువలయమును
 
(శంకరాభరణం  బ్లాగులో  27-06-2013 నాటి  సమస్యా పూరణ-   1095లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

కలఁ గాంచితి మోదమలరఁ గనుమూయకయే!!!

అలకేదారముజని వర
దలచిక్కినమమ్ముగాచు  దైవముగ జవా
నులపలు  వైమానిక చిలు
కలఁ గాంచితి మోదమలరఁ గనుమూయకయే!!!

(శంకరాభరణం  బ్లాగులో  26-06-2013 నాటి  సమస్యా పూరణ-   1094లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, September 2, 2013

అవధానమ్మున జేయ కూడదు సమస్యా పూరణ మ్మెప్పుడున్ !!!

అవధానమ్మున జేయ కూడదు సమస్యా పూరణ మ్మెప్పుడు
న్నవమానంబులుజేయుచున్ విబుధులన్ సాహిత్య సన్మూర్తులన్ .
అవనిన్ పండిత శ్రేణి మెచ్చును గదాయత్యంత రమ్యంబుగా
నవదానమ్మునుజేయగా పదములందందాలుచిందించుచున్ !!!

(శంకరాభరణం  బ్లాగులో  25-06-2013 నాటి  సమస్యా పూరణ-   1093 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, September 1, 2013

కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!

బొమ్మకు ధగధగ మెరిసెడు
సొమ్ములు దట్టించి పెట్ట సోకుకు, ముద్దుం
గుమ్మలు ముట్టన్ పైబడి
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!


కుమ్మెను నిర్భయ పులిచం
దమ్మున కామాంధునికడు ధైర్యముతోడన్
గ్రమ్మిన మైకము తొలగన్
కమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలు ఘలుమనియెన్!


(శంకరాభరణం  బ్లాగులో  24-06-2013 నాటి  సమస్యా పూరణ-   1092 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)