Monday, March 26, 2012

మోహ పాశమ్మె మేలు సన్మునులకెల్ల!!!

ఆత్మ సంయమమును పరమాత్మ నిచ్చె
కర్మయోగభక్తి జ్ఞాన మర్మములను
క్రీడికిన్ జెప్పి శ్రీకృష్ణ గీతపైన
మోహ పాశమ్మె మేలు సన్మునులకెల్ల!!! 


 (శంకరాభరణం  బ్లాగు లో25-03-2012 నాటి  సమస్యా పూరణ-657 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, March 25, 2012

చిరులతయె రావిచెట్టును చీరి యణచె!!!

విస్తరించిరి రాజ్యంబు విశ్వమెల్ల
నాంగ్లపాలకులానాడు నట్టిదొరల
మట్టి గరిపించె మనగాంధి పట్టుబట్టి  
చిరులతయె రావిచెట్టును చీరి యణచె!!! 


 (శంకరాభరణం  బ్లాగు లో24-03-2012 నాటి  సమస్యా పూరణ-656 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, March 24, 2012

జాగేల వేవేగ దివిని విడిచి రమ్ము!!!

శంకరార్యుని చుట్టిన సంకటముల
దీర్పజాగేల వేవేగ దివినివిడిచి
రమ్ము గురిపించు కరుణారసమ్మును యదు
నందనా ! నీకు వేవేల నతులొనర్తు!!! 


 (శంకరాభరణం  బ్లాగు లో23-03-2012 నాటి  సమస్యా పూరణ-655లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, March 23, 2012

ఉగాది శుభాకాంక్షలు!!!

అందరికీ శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కాల గర్భాన నొకయేడు కరిగిపోయె
ధరలు నెగబ్రాకె  నవినీతి సరళి పెరిగె
పన్ను భారమ్ము లెక్కువై వెన్ను విరిగె
బ్రతుకు దుర్భర  మైపోయి  భారమయ్యె!!!

వందనాలమ్మ నందన వత్సరమ్మ
పాలకులకింత సద్బుద్ధి  పంచుమమ్మ
మంచి మార్గాన వారిని మలుపు మమ్మ
బడుగు జీవుల నిడుముల బాపుమమ్మ

ఆరు ఋతువులు నీలోనె నణిగియుండు
నారు రుచులును నీ యందె నమరియుండు
జనుల కెయ్యది మేలౌనొ గణన జేసి
కాంతి నింపుము కటిక చీకటుల బాపి !!!


Monday, March 19, 2012

పుండు సతిని గాంచి మోద మందె!!!

సత్యవంతుడతను సావిత్రి పెనిమిటి
చనగ యమునివెంట తనువువిడిచె
వనిత పోరి పొంద పతిప్రాణములను నృ
పుండు సతిని గాంచి మోద మందె!!! 


 (శంకరాభరణం  బ్లాగు లో16-03-2012 నాటి  సమస్యా పూరణ-650 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, March 18, 2012

పాడు లోకము రాముని ప్రస్తుతించు !!!

ఎవడు శోకము తొలగించు భువన మందు
నెవని గొలువంగ మది పొంగు నెపుడు  నట్టి
రవికులాగ్రణి గుణమునే పవన సుతుడు
పాడు !!! లోకము రాముని ప్రస్తుతించు !!!

 (శంకరాభరణం  బ్లాగు లో15-03-2012 నాటి  సమస్యా పూరణ-649 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, March 16, 2012

నివాళి !!!


నా చిరకాల మిత్రుడు శ్రీ ఆంజనేయులు ,విశ్రాంత హెడ్ క్యాషియర్  S.B.H    సిరిసిల్ల వాస్తవ్యుడు  14-03-2012 నాడు పరమపదించినారు వారి ఆత్మకు శాంతి చేకూరు గాక .

కల్మషమ్ము లేని కారుణ్య మూర్తివి 
దివికి జేరి నావు భువిని వీడి 
విశ్వ శాంతి గోరు విమల మతివి  నీవు
ఆంజనేయ నీకు అంజ లింతు 

రాజ రాజైన పట్టపు రాణి యైన
మాన్యు డైనను సర్వ సామాన్యుడైన
పుట్టి నటువంటి ప్రతిజీవి గిట్టవలయు
చిట్ట చివరికి శివునికి ముట్ట వలయు !!!

కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని భారతంబును!!!

దార్త రాష్ట్రుల దౌష్ట్యాల వార్త లేని
ధర్మ సూనుని తమ్ముల తలపు లేని
కృష్ణ పరమాత్మ గీతార్థ కృతులు లేని
భారతంబును బొంకని పలుక దగును !!! 

 (శంకరాభరణం  బ్లాగు లో15-03-2012 నాటి  సమస్యా పూరణ-647 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, March 14, 2012

మేలు గోరంత కీడేమొ మేరువంత!!!

మేలు గోరంత కీడేమొ మేరువంత
జనుల ధనమంత పాలక ఘనుల చెంత
మంత్రి మాన్యుల మాయల తంత్ర మందు
దివియె భువి పైన గిర గిర తిరుగు చుండు !!!

   
(శంకరాభరణం  బ్లాగు లో13-03-2012 నాటి  సమస్యా పూరణ-645 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, March 13, 2012

దార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పథము!!!

పాండు భూవరు కోడలి వలువ లొలిచి
నిండు పేరోలగంబున నీచు లైరి
దార్త రాష్ట్రులు !!! నడచిరి ధర్మ పథము
న సతతము పాండు సుతులు బడసిరి యశము !!!
   
(శంకరాభరణం  బ్లాగు లో12-03-2012 నాటి  సమస్యా పూరణ-644 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, March 11, 2012

రాజ భోగాల విడిచిన రాచ కొడుకు !!!

రాజ భోగాల   విడిచిన  రాచ కొడుకు
పసిడి జింకకై పరుగిడ పాడి యౌనె
రాక్షసాదుల నిర్జించు రచన యేమొ
రాముడిచ్చెను సీతను రావణునకు!!!
   
(శంకరాభరణం  బ్లాగు లో10-03-2012 నాటి  సమస్యా పూరణ-643 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, March 10, 2012

హీనునకు నమస్కరింతు!!!

దుష్ట శిక్షకునకు  శిష్ట రక్షకునకు
బోధకునకు సత్య శోధకునకు
జనుల సేవకునకు జనకునకు శత్రువి
హీనునకు నమస్కరింతు నెపుడు !!! 
   
(శంకరాభరణం  బ్లాగు లో09-03-2012 నాటి  సమస్యా పూరణ-642లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, March 9, 2012

వనితకు వందనము!!!

కనురెప్పతీరు కదులుచు
మనమున మమతానురాగ మాధుర్యముతో
అనునిమిషము ప్రేమించెడు
వనితకు వందనము సేయవలె సద్భక్తిన్!!!. 

 (శంకరాభరణం  బ్లాగు లో08-03-2012 నాటి  సమస్యా పూరణ-641లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)