Tuesday, November 15, 2011

భక్త మందారులే కదా శక్తి పరులు !!!

శబరి మల వాసు డయ్యప్ప శరణుగోరు
భక్త మందారులే కదా శక్తి పరులు 
జనుల వంచించ బూను దుర్జనుడు ,కపట

స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!! 

రమ్య గుణసాంద్రుడినకుల రామచంద్రు
దివ్య చరణాలు  విడువక  భవ్య రీతి   
గొలుచు భక్తుడే గద మహా బలుడు ,కపట
స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!!  

Monday, November 14, 2011

పాడు పున్నమయిది పండుగ కద !!!

గుండె గుండె లోన పండువెన్నలనింపు
పర్వదినము నేడు పరమ శివుడు
కోరికలనుదీర్చు గొలుచు భక్తులనుకా
పాడు పున్నమయిది పండుగ కద !!! 


(శంకరాభరణం  బ్లాగు లో 10-11-2011 నాటి  సమస్యా పూరణ-521 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, November 13, 2011

ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్ !!!

వినె నేమో రాతిని భా
మను జేసిన రామ పాద మహిమను ,గుణధా
ముని  రాముని రవికుల సో 
ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్ !!! 

(శంకరాభరణం  బ్లాగు లో09-11-2011 నాటి  సమస్యా పూరణ-520లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Saturday, November 12, 2011

భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్!!!

ధైర్యము హెచ్చును, బహువిధ
చౌర్యమ్ములు జేయవచ్చు చతురత మీరన్
ఆర్యా,యిక రాజీవుని
భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్!!!

(రాజీవుని భార్య = సోనియా గాంధి )

(శంకరాభరణం  బ్లాగు లో08-11-2011 నాటి  సమస్యా పూరణ-519లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, November 11, 2011

అల్లు డవినీతి పరుడైన నత్త మెచ్చు!!!

పసిడి మేడలు గట్టినా పట్టు బడని
కోట్ల సంపద దోచినా కోర్టు లేమి
చేయ లేనట్టి సిసలైన చేవ యున్న
నల్లు డవినీతి పరుడైన నత్త మెచ్చు!!!

(శంకరాభరణం  బ్లాగు లో 31-10-2011 నాటి  సమస్యా పూరణ-511లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, November 1, 2011

శివ నివాసము ముక్తి ధామము

శివ నివాసము   ముక్తి ధామము , చిత్తమందున పార్వతీ
ధవుని నిల్పిన జీవితమ్ములు ధన్య మౌనట మిత్రమా
భవుని రూపము దివ్య దీపము భక్తితో గొలువన్నుప
ద్రవము నెల్ల హరించి కాచును ను త్ర్యంబకుండు జగమ్ములన్!