Friday, September 30, 2011

భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు!!!

భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
లతుల బలశాలురిర్వురు, గతులు వేరు
ధర్మ బద్దుడీతడు, మానధనుడతండు,
ధర్మ మేగెల్చెచివరకధర్మమోడె!!!

(శంకరాభరణం  బ్లాగు లో15-09-2011 నాటి  సమస్యా పూరణ-460లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, September 29, 2011

మణి ముట్టఁగఁ జేయి గాలెమహిళామణికిన్!!!

ఫణిభూషణుసుతుగన జని
మణికుండలభూషితయగు మానిని మృదుభా
షిణిదీపముపైబడ చెవి
మణి ముట్టఁగఁ జేయి గాలెమహిళామణికిన్!!! 


(శంకరాభరణం  బ్లాగు లో14-09-2011 నాటి  సమస్యా పూరణ-459లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, September 22, 2011

పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!

సదమల వేదశాస్త్రచయ సారమునంతయుకొంతకొంతగా
పదములకద్ది  , పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని పోతన నాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో18-09-2011 నాటి  సమస్యా పూరణ-464లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, September 21, 2011

రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!!

క్షణము తీరిక లేనట్టి జనులకిపుడు
చింతయేగాని నిశ్చింత సుంతలేదు
రామ భద్రుడౌ జానకీ రమణుని స్మ
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!! 

కనక సింహాసనాసీన ఘనుల కిపుడు
కటిక నేలపై బవళిoచు గతులు బట్టె
పతన మైనట్టి తమగతవైభవస్ఫు
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!  

(శంకరాభరణం  బ్లాగు లో13-09-2011 నాటి  సమస్యా పూరణ-458లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Tuesday, September 20, 2011

గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!

దొడ్డ మనసుతో ,దొరికిన బిడ్డ నైన
నాదరముతోడ ప్రేమతో హాయిగూర్చి
బెంచి పోషించి మమతను పంచినట్టి
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!

(శంకరాభరణం  బ్లాగు లో12-09-2011 నాటి  చమత్కార పద్యాలు -126లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Monday, September 19, 2011

గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి !

ప్రమద గణముల తోడను పత్ని  తోడ
గరళకంఠుండు,పయనించె గరుడు నెక్కి
హరియు సిరితోడ గాంచిరి హస్త ముఖుని
వివిధ రూపాల శోభను విస్మయముగ !!!
(శంకరాభరణం  బ్లాగు లో12-09-2011 నాటి  సమస్యా పూరణ-457లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Sunday, September 18, 2011

వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!!!

ఘనుడౌ  రాముని పనుపున
జని,వీరుడు పవన సుతుడు జానకి మాతన్
కనుగొని రావణ లంకా
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!!! 

అనలుడు వేడగ ఖాండవ
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.
వినయుడు పాండవ తనయుడు
జనవంద్యుడుతోడుగాగ జయమున్గనియెన్ !!!
(శంకరాభరణం  బ్లాగు లో11-09-2011 నాటి  సమస్యా పూరణ-456లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

(జనవంద్యుడు= శ్రీకృష్ణుడు) 

Saturday, September 17, 2011

పండితునిజూచి నవ్వెను పామరుండు !!!

ధరల దించెడు మంత్రపు దండమేది
లేదు, వృద్ది రేటును బెంచు లెక్క లన్ని
రోజు గణియింతు మనిజెప్పు రాజకీయ
పండితునిజూచి నవ్వెను పామరుండు !!! 

(శంకరాభరణం  బ్లాగు లో10-09-2011 నాటి  సమస్యా పూరణ-454లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, September 16, 2011

కపిమనోజు గాంచి కుపితుడయ్యె!

ఎంత వార లైన కంతుని వశమౌట
వింత గొలుపు చుండు వినిన గనిన
గౌరి పైన రక్తి గలుగంగ తనలోని
"కపిమనోజు" గాంచి కుపితుడయ్యె! 

నిగమ శాస్త్ర హితుడు నిత్యాగ్ని హోత్రుండు
పురము విడిచి హిమపు గిరికి జనగ
రమణి నిలిచి వలపు రాగాలు గురిపింప
"కపిమనోజు"గాంచి కుపితుడయ్యె!!!  


(శంకరాభరణం  బ్లాగు లో08-09-2011 నాటి  సమస్యా పూరణ-452లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, September 15, 2011

రాముడాతడు తమ్ముడు రావణునికి !!!

రామలీల మైదానము రక్తిగట్ట
విజయదశమిన వెలిసెనువిగ్రహాలు
రాముడాతడు, తమ్ముడు,రావణునికి
చెంతనే కుంభ కర్ణుండు వింతగొలిపె!!!

(శంకరాభరణం  బ్లాగు లో08-09-2011 నాటి  సమస్యా పూరణ-452లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Wednesday, September 14, 2011

అన్యాయము సేయువారలతిపుణ్యాత్ముల్!!!

(నిత్యానంద స్వామి ని దృష్టిలోబెట్టుకొని)

సన్యాసులనుచు సరసపు
విన్యాసము జేయునట్టి వెధవల నెడ కా
ఠిన్యత జేయకపోవడ
మన్యాయము! సేయువారలతిపుణ్యాత్ముల్!!! 

(శంకరాభరణం  బ్లాగు లో07-09-2011 నాటి  సమస్యా పూరణ-451లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Tuesday, September 13, 2011

గాలికబురు లిపుడు గణన కెక్కె!!!

గాలి గాలి జేసి గనులన్ని కాజేసి
కోట్లు కొల్ల గొట్టి కోట గట్ట
బీట వారె రాచకోట,వీచెనెదురు
గాలి,కబురు లిపుడు గణన కెక్కె!!! 
(శంకరాభరణం  బ్లాగు లో06-09-2011 నాటి  సమస్యా పూరణ-450లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Monday, September 12, 2011

పోరు చేయకుండ వీరుడెట్లౌనురా!!!

జయము గలుగ దనుచు భయము జెందగనేల?
ఓడి పోదు ననుట పాడి యౌనె?
పోరు చేయకుండ వీరుడెట్లౌనురా!
మంద వారి మాట మణుల మూట!!!

కుజనుల సంగతి హితమని గురువు వచించెన్ !!!

సుజల స్రవంతులు గురువులు,
విజయ సుసారధులు వారు విజ్ఞాన గిరుల్,
నిజమైన శక్తి శిష్యుల
కు,జనుల సంగతి హితమని గురువు వచించెన్ !!!

(శంకరాభరణం  బ్లాగు లో05-09-2011 నాటి  సమస్యా పూరణ-449లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Sunday, September 11, 2011

కారు కంటఁ బడినఁ గంపమెత్తె!!!

అప్పు జేసె నాతడవసరమ్ముకొఱకు
వడ్డి కట్టి కట్టి నడ్డి విరిగె
అసలు దీర్చుమనుచు నప్పునిడిన షావు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె!!!

వెతల బడిరి ప్రజలు గతమందు మన తెలం
గాణమందు రజ్వి క్రౌర్యమునకు
కండకావరమ్ము దండిగా గల "రజా
కారు" కంట బడిన గంప మెత్తె!!!  

(శంకరాభరణం  బ్లాగు లో04-09-2011 నాటి  సమస్యా పూరణ-448లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Saturday, September 10, 2011

ఓడనేల పయిన్ నడయాడ దొడగె !!!

విశ్వ కప్పును గెలిచిన వీరు లకట
ఓడనేల? పయిన్ నడయాడ దొడగె
నేమొ గతజయ గర్వమ్ము,టీముకిపుడు
జబ్బుతొలగి ,నేడువిజయ మబ్బునేమొ !!!


(శంకరాభరణం  బ్లాగు లో03-09-2011 నాటి  సమస్యా పూరణ-447లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 


Friday, September 9, 2011

దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మున్ !!!

తాపము తొలుగును జ్ఞానపు
దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మున్ 
కోపము హెచ్చిన ,తమకే
లోపము లేదని దలచెడు  లోకుల కెల్లన్!!!

(శంకరాభరణం  బ్లాగు లో02-09-2011 నాటి  సమస్యా పూరణ-446లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Thursday, September 8, 2011

గణనాయకసుత! వినాయకా! వందనముల్!

జనగణముల ఘనమనమున
గణనాథా గురియజేయు కరుణామృతమున్
అణుమాత్రమైన, సద్గుణ
గణనాయకసుత! వినాయకా! వందనముల్! 

(శంకరాభరణం  బ్లాగు లో01-09-2011 నాటి  సమస్యా పూరణ-445లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Wednesday, September 7, 2011

రంజానుకుచేయవలయురాముని భజనల్!!!

రాం,జయ జయరాం,సీతా
రాం,జయరాం శ్రీరఘుపతి రాఘవరాజా
రాం,జనరహీముని గొలువ
రంజానుకుచేయవలయురాముని భజనల్!!! 

అంజలి ఘటిత నమాజును
రంజానుకుచేయవలయు, రామునిభజనల్
రంజితముగ జేయందగు,
అంజనపుత్రుండుమెచ్చ నవనిజమెచ్చన్ !!!

(శంకరాభరణం  బ్లాగు లో31-08-2011 నాటి  సమస్యా పూరణ-444లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Tuesday, September 6, 2011

ఎద్దును జేరి పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్!!!

పద్దెము పద్దెమందు భగవానుని పావన లీలలద్దుచున్
ముద్దులు గారభాగవతమున్ రచియించిన పోతనార్యునిన్
ప్రొద్దున లేచివేడితిని పూవుల తోడ పొలమ్ముదున్న కా
డెద్దును జేరి,. పాల్పితుక నెంచెడి కృష్ణు దలంతు నెమ్మదిన్!!! 
(శంకరాభరణం  బ్లాగు లో28-08-2011 నాటి  సమస్యా పూరణ-441లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
 

Monday, September 5, 2011

కరుణామయులన్నవారు కాలాంతకులే!

కరములు మోడ్చిన నిత్తురు
వరములు హరిహరులుపెక్కు ,పరపీడనకై
వరములవినియోగించిన
కరుణామయులన్నవారు కాలాంతకులే! 

(శంకరాభరణం  బ్లాగు లో30-08-2011 నాటి  సమస్యా పూరణ-443లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)


Sunday, September 4, 2011

చెఱకువిలుకాఁడుచెలి, కాఁడు శివున కెపుడు.

లోకపావని పార్వతి శోక మణచ
రాగ దేహుండు భస్మాంగ రాయు కంటి
మంటలోమాడిపోయె పూవింటి తోడ,
చెఱకువిలుకాఁడుచెలి, కాఁడు శివున కెపుడు. 

Saturday, September 3, 2011

చేరె నవరసమ్ములలోననీరసమ్ము!!!

నవరసములన నివియని నళినిజెప్పె
చేరె నవరసమ్ములలోననీరసమ్ము,
చింత , మిరియాల రసములు, చెఱుకు రసము,
నిమ్మరసమును,ద్రాక్ష, దానిమ్మ రసము,
పాద రసమును, మామిడి పళ్ళ రసము.

(శంకరాభరణం  బ్లాగు లో28-08-2011 నాటి  సమస్యా పూరణ-440లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Friday, September 2, 2011

వానకాలమ్ము వచ్చిన,వైద్యు డేడ్చె!!!

కాలముకలిసి రాకవర్షాలు లేని
వానకాలమ్ము వచ్చిన,వైద్యు డేడ్చె,
యేడ్చె రైతన్న, జనులెల్ల యేడ్చిరకట
యెట్లు గడచును జీవించుటెట్లుననుచు !!!

(శంకరాభరణం  బ్లాగు లో27-08-2011 నాటి  సమస్యా పూరణ-439లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

Thursday, September 1, 2011

సౌరభము సుంత లేని పుష్పములె మేలు,

సౌరభము సుంత లేని పుష్పములె మేలు,
లేక పోయిన రంగుల రేకులున్న
కాగితపు పూలు చాలును ,వేగిరమున
తీసుకొని రమ్ము ,చిత్రమ్ము తీయవలెను. 

తులసి దళముతో తూచెను తోయజాక్షి,
పిడికె డటుకులతో గొల్చె పేదసఖుడు.
ఆత్మసౌందర్య మేగదా హరికినచ్చు ,
సౌరభము సుంతలేనిపుష్పములె,మేలు
జేయగనువచ్చు భక్తితోజేయ పూజ!!! 
(శంకరాభరణం  బ్లాగు లో26-08-2011 నాటి  సమస్యా పూరణ-438లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)