Monday, January 31, 2011

పాల వలన జనులు పతితులైరి!!.

వనిత కళ్ళు కామ వాకిళ్ళుగా జేసి
పైట జార పిలిచె పడుచు వాణ్ని ,
పడెను వాడు వలలొ,పదమనె? వెగటు,రూ
పాల వలన జనులు పతితులైరి.
(శంకరాభరణం  బ్లాగు లో29-12 -2010 నాటి  సమస్యా పూరణ-184లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, January 30, 2011

గాంధి గారి గాంచ గర్వమ్ము గలుగును !!!

గాంధి గారి గాంచ గర్వమ్ము గలుగును ,
గలుగు దేశ భక్తి ,గలుగు ప్రేమ ,
గలుగ దేల, గనగ ఘనమైన దొరలకు
గలుగ,జనుల కెల్ల గలుగు మేలు!


(నేడు గాంధి గారి వర్ధంతి ,వారికి శ్రద్దాంజలి )



ఉప్పున్ కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చన్!

తీరని రోగమ్ములచే
పోరాడెను సాహసించి, ప్రొద్దును మాపున్,
ఆరోగ్యమునకు ఉప్పున్
కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చన్! 
(శంకరాభరణం  బ్లాగు లో28-12 -2010 నాటి  సమస్యా పూరణ-183లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, January 29, 2011

కాంత జూచి మౌని కన్ను గొట్టె!


 హింస పెరిగె పరమ హంసలు కఱువైరి
నీతి దప్పి కామ ప్రీతు లైరి,
సత్య మైన పథము సాధువు జూపగా
కాంత జూచి మౌని కన్ను గొట్టె! 
(శంకరాభరణం  బ్లాగు లో27-12 -2010 నాటి  సమస్యా పూరణ-182లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, January 28, 2011

సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా!

హరి కైనను, హరు కైనను
సురపతికైన,ధరనేలు శూరుని కైనన్,
నిరతము గావలె జీవన
సిరి,వలదనువానికిలను చిక్కులె గాదా!

అరకొర సాయము జేసిరి
మరి,యే తీరున సరిపడు?మంత్రుల చేతల్
ఉరితాడై పురిగొల్పగ,
సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా! 

సరకుల ధర మింటి కెగిసె,
వరి పంటలు నీట గలిసె, వరదలు రాగా,
చిరు సాయము సరి పోదని
సిరి వలదను వాని కిలను చిక్కులు గాదా!! 
(శంకరాభరణం  బ్లాగు లో26-12 -2010 నాటి  సమస్యా పూరణ-180లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, January 27, 2011

గొడుగెందుకు ? కుంభవృష్టి గురిసెడి వేళన్!!!

గొడవెందుకు?అడుగేయకు,
మడుగులు గట్టెను అడుసుల మయమై వీధుల్!
వెడలకు మావల యీవల,
గొడుగెందుకు ? కుంభవృష్టి గురిసెడి వేళన్!!!
(ఆవల ,ఈవల = బయటకు ,లోపటికి )
(శంకరాభరణం  బ్లాగు లో24-12 -2010 నాటి  సమస్యా పూరణ-178లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, January 26, 2011

తల్లి దండ్రి మించు దైవమెక్కడ నుండు?

కన్న వారి పైన కరుణ జూపని వారు
కాశి కేగ ఫలము గలుగ బోదు
తల్లి దండ్రి మించు  దైవమెక్కడ నుండు?
మంద వారి మాట మణుల మూట! 

దానవులంగొలుచు వాడు దామోదరుడే!

దానము జేసియు వటునుకి,
దానవ కులపతియగుబలి ధన్యుండయ్యెన్!
ప్రాణము తృణమని బల్కెడు
దానవులంగొలుచు వాడు దామోదరుడే!

లేనే లేడని యందును
దానవులం గొలుచు వాడు! దామోదరుడే
నా? నా మదిలోనున్నది?
ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!
(శంకరాభరణం  బ్లాగు లో23-12 -2010 నాటి  సమస్యా పూరణ-177లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, January 25, 2011

రాజు కోరి నపుడె రవియేల ఉదయించు ?

జరగ వెపుడు పనులు ధరలో తలచినట్లు 
దొరల కైన శూర వరుల కైన!
రాజు కోరి నపుడె రవియేల ఉదయించు?
మంద వారి మాట మణుల మూట !

హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!

హరి హరుల దారు లొక్కటే నరయ గాను,
వరము లిచ్చినా ,దృంచినా వసుధ లోన
సత్య మొక్కటే నిత్యమై సాగ !దురిత
హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!
(శంకరాభరణం  బ్లాగు లో22-12 -2010 నాటి  సమస్యా పూరణ-176లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, January 24, 2011

ధనము యొకటి గలుగ గనము జయము !!!

పెట్టు బడికి  ధనము పెద్ద భాగమెకాని
ధనము మాత్రమున్న గనము జయము
అసలు పెట్టు బడులు ఆలోచనలు గావె!
మంద వారి మాట మణుల మూట!   

పామరుడే కవిగా మారి ప్రస్తుతి లందెన్ !!!

ఏమని కూసెనొ కోయిల,
ఆమని పిలిచెనొ అతనిని అచ్చెరువొందన్ ,
రాముని కావ్యము వ్రాసెను
పామరుడే కవిగా మారి ప్రస్తుతి లందెన్ !


ఏమని వేడెనొ కాళిక,
నేమని కోరెనొ వరములు నేరుగ నిచ్చెన్!
రాము రఘువంశ కర్తగ
పామరుడే కవిగా మారి ప్రస్తుతి లందెన్ !
(శంకరాభరణం  బ్లాగు లో21-12 -2010 నాటి  సమస్యా పూరణ-175లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, January 23, 2011

పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!!!

రివ్వున ఎగిరిన వైయ్యెస్
నెవ్వడు గూల్చెను వనమున, నెఱుగగ తరమా!
అవ్వాని మహిమ వలనను,

పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!!!
( వైయ్యెస్= Y S రాజశేఖరరెడ్డి గారు)


నవ్వుల  పూవులు పూచెను,
సవ్వడి సర్కారు చేయ,సభలో మాయల్
గవ్వలు గువ్వలు కాగా ,
పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!

( సర్కారు = P C సర్కార్ ,ప్రసిద్ద ఇంద్రజాలికుడు )

Saturday, January 22, 2011

అపజయముల లోనె నవకాశముల జూచు !!!

అపజయములలోన  నవకాశముల జూచు 
ధీరు డైన వాడు ధీయుతముగ 
అతను భీరువైన యవకాశములుజారు !
మంద వారి మాట మణుల మూట!   

వృద్ద సౌందర్యమును జూడ ప్రేమ గలిగె!

శ్రద్ధ గలవాడు,జిజ్ఞాసి,బుద్ది జీవి,
హద్దు లెఱుగును,ఎఱుగడు ముద్దు లాడి,
బ్రతుకు పోరులో వయసంత చితికె! బ్రతుక,
వృద్ద సౌందర్యమును జూడ ప్రేమ గలిగె! 

(శంకరాభరణం  బ్లాగు లో19-12 -2010 నాటి  సమస్యా పూరణ-173లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, January 21, 2011

ప్రజల పీడనంబు పరమహీనము గాదె!!!

పదుగురి కొఱకెవడు పనిజేయ వెఱువడో
వాడె శక్తి యుతుడు! వాడె ప్రభువు  !
ప్రజల పీడనంబు పరమహీనము గాదె!!!
మంద వారి మాట మణుల మూట! 

పిట్ట నైన జూడ పుట్టవా బుద్దులు !!!

చెట్టు రీతి పెరిగి చేతలుకరువైన
గుట్ట లన్ని కరుగు , గోయి మిగులు ,
పిట్ట నైన జూడ పుట్టవా బుద్దులు
మంద వారి మాట మణుల మూట! 

పామునకు బాలు వోసిన ఫలిత మిదియె!!!

గుడిసె మేడగ మార్చెద,రోడ్డు వేసి
తారు పూసెద ,సరిపోవు నీరు దెత్తు
మనిరి,గెలిచిరి యిపుడన్నిమరిచిరైరి
పామునకు బాలు వోసిన ఫలిత మిదియె!!! 

(శంకరాభరణం  బ్లాగు లో18-12 -2010 నాటి  సమస్యా పూరణ-172లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, January 20, 2011

మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్ !!!

(+ve) దానమ్మే చేయు ,సురా
పానమ్మే మానుమంచు పలికెడు వాడున్,
ద్యానమ్మే కోరు,దురభి
మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్ !!!


(-ve) ప్రాణమ్మే తీయ నెఱుగు,
గానమ్మే సేయు నెపుడు,గౌరవ మంత్రిన్!
పానమ్మే నా పథమను,
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్ !!!

(శంకరాభరణం  బ్లాగు లో17-12 -2010 నాటి  సమస్యా పూరణ-171లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )


 

Wednesday, January 19, 2011

తత్వ సార మెల్ల తండ్రియే జెప్పెను,

నేడు మా తండ్రి  గారైన శ్రీ మంద రాజన్న గారి 24 వ వర్ధంతి .వారు  ఎక్కువగా చదవక పోయినా తెలుగు సాహిత్యం పైన ఉన్న మక్కువతో పద్యాలు వ్రాసేవారు  వారు 33 సంవత్సరాల క్రితం వ్రాసిన ఈ పద్యాలను నా యీ బ్లాగులో  పెడుతున్నాను .


                                              " ఉపనిషత్తులు జెప్పిన యుక్తమైన 
                                    ధర్మ సూత్రములన్నినిదానముగను 
                                    బ్రహ్మ మందు నాసక్తత బరగు నాదు
                                    మనము నందుండు గాక సన్మానితముగ 


                                                  దేవ నీస్తుతి  జేతుము ధీయుతముగ
                                                  మా శరీరాంగములకును మంగళముగ
                                                  నీవు నిచ్చు దీర్ఘాయువు నిశ్చయముగ
                                                  అనుభవింతుము గాక యీ అవని లోన !


                                              మమ్ము పరమేశ మాయా తమస్సు నుండి
                                              ప్రబల తామసమజ్ఞాన పథము నుండి
                                              తొలగ జేసి నీ జ్యోతిలో మెలగ జేయు
                                              సాత్వికము లోన విజ్ఞాన కాంతిలోన !  " 
                     మా తండ్రిగారు మాకు .......
                             ధనము నీయ లేదు ,ధర్మ మేమిటొజెప్పె
                             నీతి దప్ప నట్టి రీతి జెప్పె,  
                             తత్వ సార మెల్ల తండ్రియే జెప్పెను,
                             సత్య పథము నందు సాగు మనుచు!


                        (ఆయన గారి ఆత్మకు శాంతి గలుగు గాక)

భాష్పాంజలి


   భాష్పాంజలి


నీవు లేనిదే గడువదనుకున్న నిమిషము గంటలయ్యె,
గంటలు గడిచె వడివడిగ ,   దినములు దొర్లిపోయె,
పక్షముల గతి మారె ,మాసముల్ మాయమయ్యె,
పలు వసంతాలు కాల గర్భాన పండిపోయె  ,
గడిచిన గతమెల్ల మీదు స్మృతులతో నిండిపోయె!     


అవియె తారకలు ,నెలరాజు,గగన మదియె ,
దిశలు,దిక్కులు దినములు రాత్రులవియె ,
ఏడు గుర్రాల రాయని పయన మదియె,
ఏడ్పు నగవుల కలబోత బ్రతుకు లవియె!


ఏది ఆబాట, ఆపాట పలుకు తీరు,
ఏదిఆ నీతి, ఆ ప్రీతి మాట సౌరు,
ఏది ఆ కసురు,ఆ విసురు,
ఎదను పండించి,పిండించి
పంచిన అమృత తుల్య మైన
ఆ అవ్యాజ వాత్సల్య ధార నే
నడుపు చున్నది మమ్ము ,
యిది సునృతము సుమ్ము,


నీ మూర్తిత్వ మావిష్కరింప దలంపగా 
అక్షరాలేల పదములై అల్లు కోవు?
కలము సాగదు ముందుకు కవిత సేయ ,
భావములు రావు , ఎద యేల  పేదయయ్యె
మీ మహోన్నత వ్యక్తిత్వ మహిమ నేమొ ,
మాటల కతీత మైనట్లు తోచె
పలుకులాకృతి ఆలోచన పరిధి రాక
లోచనా భరితమై, భావనా వేశమై
సలిలమై, సరళమై 
మా అశ్రుభాష్పమ్ము లే  సుమ జల  కుంజములైనవి
నీ పద యుగ్మ మందు 
మేమంజలి ఘటి యింపగ
అందుకో తండ్రీ !
మమ్ము కరుణింపగ  బూనుము  యెల్ల వేళలన్ !
( మా తండ్రి గారైన శ్రీ మంద రాజన్న 24 వ వర్ధంతి సందర్భం గా వారికి  మా భాష్పాంజలి )
మంద నారాయణ , మంద పీతాంబర్  మరియు  కుటుంబ సభ్యులు  19 -01 -2011

Tuesday, January 18, 2011

సతి సతి గవయగ బుత్ర సంతతి గలిగెన్!!

పతి సతులకు సంతానపు
గతి లేదని వగయ వలదు,కాలము మారెన్,
రతుల తతిలేక పతితో,
సతి సతి గవయగ బుత్ర సంతతి గలిగెన్!!......
(నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్ (నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్న సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.) సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.)
(శంకరాభరణం  బ్లాగు లో16-12 -2010 నాటి  సమస్యా పూరణ-170లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, January 17, 2011

రాము డొసగెను జానకిన్ రావణునికి!!

చేవ గలిగిన వీరుల, చేటు, చెఱుపు
పనుల నాపగ, శక్తితో పాటు యుక్తి,
యుక్త మౌనని,దలపోసి ముక్తిదాత,
రాము డొసగెను జానకిన్ రావణునికి!! 

(శంకరాభరణం  బ్లాగు లో14-12 -2010 నాటి  సమస్యా పూరణ-169లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, January 16, 2011

దారి తప్పు వాడు!! ధర్మ విధుడు!!!

ధరను జూడ గలవు, దారులు పెక్కులు,
హరిని జేర, జార ,సురను గ్రోల!
ముక్తి దారి బట్ట ,ముప్పను గలిగించు
దారి తప్పు వాడు!! ధర్మ విధుడు!!!
(శంకరాభరణం  బ్లాగు లో13-12 -2010 నాటి  సమస్యా పూరణ-168లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, January 15, 2011

మేలే యగు యేదైనను,

కాలే కడుపుకు గంజియొ,
పాలో,పట్టెడు మెతుకులొ,బాసిన కూడో!
మేలే యగు యేదైనను,
కూలే గుడిసెను నిలుపెడు గుంజల రీతిన్ !

(వేలకొలది టన్నుల ఆహార ధాన్యాన్ని గోడౌన్ల లో కుళ్ళబెట్టి,ఎవరికీ తినడానికి కాకుండా చేసిన ప్రభుత్వ నిర్వాకం ,సుప్రీం కోర్టు
మొట్టి  కాయలు వేసినా పట్టించు కోని,కళ్ళు తెరవ దానికి కూడా బద్దకించిన వారు ప్రజలకు ,ఆచరణ సాద్యం కాని ఆహార భద్రత  చట్టాన్ని చేస్తామనడం హాస్యాస్పదంగా లేదా!!)  

వాపు వాపె గాని బలుపు గాదు !

చూపు కేమొ చాల ఏపుగా నున్నాడు,
చేతలందు తగిన చేవలేదు.
పనిని చెబితె తిక్క,తినడానికేలెక్క,
వాపు వాపె గాని బలుపు గాదు !
(శంకరాభరణం  బ్లాగు లో12-12 -2010 నాటి  సమస్యా పూరణ-167లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, January 14, 2011

సంక్రాంతి మహలక్ష్మి ! స్వాగ తింతు నిన్ను సాదరముగ !!!

పాడి పంట లిమ్ము! ఫల పుష్పములనిమ్ము!
గిరులనిమ్ము !పాఱు ఝరుల నిమ్ము!
సంబరాలు తెమ్ము !సంక్రాంతి మహలక్ష్మి !
స్వాగ తింతు నిన్ను  సాదరముగ !!!

Thursday, January 13, 2011

ననన ననన నన్ను నినిని నిన్ను!!!

నాన్న! నిన్న నేను నిన్ననే నానోను
నెన్నినాను నాన్న! నాను,నాను ,
నోనొ నోనొ ననిన, నేనిన! నేనిన!
ననన ననన నన్ను నినిని నిన్ను.

( నాన్న నిన్నఅంటె నిన్ననే నేను నానో కారును ఎన్నుకొన్నాను (సెలెక్ట్) .నాన్న ఒప్పుకో, ఒప్పుకో !(నాను,నాను )
నో నో అని ఆనినను(ననిన) నేను వినను వినను (నేనిన నేనిన,)
సమస్య క్రొత్తగా ఉంది. మరి పూరణ ఎలా ఉందొ?)
(శంకరాభరణం  బ్లాగు లో09-12 -2010 నాటి  సమస్యా పూరణ-165లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

భోగి మంటలే "సంక్రాంతి" భోజనాలు!!

పట్టు పరికిణీల,పావడా కుచ్చుల,
పంజాబి  కుర్తాలు పట్టు కెళ్ళె!
   తల నిండ జాజులు,తనువెల్ల మోజులు,
   తన యెత్తు జడలెల్ల తరలె నెటకొ!
గంగి రెద్దుల వారి ఘన మైన తలపాగ
డూడుడూ బసవన్న డోల లెచట?
   హరి కీర్తనలు జేయు హరిదాసు పాటలు
   కడపు నింపెడు రాగి కలశ మెచట ?

ఏవి ధాన్యాలు? భొగ్యాలు? యేవి సిరులు?
వెలుగు లెక్కడ ? గొబ్బిళ్ళు వెలసె నెకట?
పంట పండించు రైతుల యింట నేడు,
భోగి మంటలే "సంక్రాంతి" భోజనాలు!!

Wednesday, January 12, 2011

కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!

ఏకాలము నందైనను
శాకాహారమె సరియని చదివితి నెపుడో ,
గ్లూకోజు లెవలు పెంచని
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ!
(శంకరాభరణం  బ్లాగు లో11-12 -2010 నాటి  సమస్యా పూరణ-166లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, January 10, 2011

ఉల్లీ నీవెక్కడనే, తల్లీ!

ఉల్లీ నీవెక్కడనే,
తల్లీ!కనబడుటలేవు  తగునా నీకున్
డిల్లీ పెద్దలు జెప్పిరి
కళ్ళూ నీ కొఱకు జూచె! కనబడి బోవా !!!

చలికాలమున వడదెబ్బ చప్పునరగిలెన్!

కలికాలముగద చూడగ ,
పలువింతల గానగలము పగలునురేయిన్,
కలచెదిరెను,పదవూడెను,
చలికాలమున వడదెబ్బ చప్పునరగిలెన్!
(కిరణ్ కూర్పులో పదవులూడిన మంత్రుల స్థితి, పూరణకు వస్తువు)
(శంకరాభరణం  బ్లాగు లో08-12 -2010 నాటి  సమస్యా పూరణ-164లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, January 9, 2011

అతి మధురము కాదా రఘుపతి నామము!!!

సతతము సీతా పతినే
నుతి చేయగ గలుగు, నూఱు నోముల ఫలముల్ !
అతి మధురము కాదా రఘు
పతి నామము! రామ రామ పలుకు కుమారా!!!

కార మొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!

కనులు చూపును గోల్పోయె,గాంచలేము
దారి తెన్నుల,మాపైన దయనుగురియ
నిండు!దారిజూపి,ముదమునిడు చిరుసహ
కార మొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!!
(శంకరాభరణం  బ్లాగు లో06-12 -2010 నాటి  సమస్యా పూరణ-162లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, January 8, 2011

ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా!

ఎడ్లనుపూజించిరి,వరి
మడ్లనుదున్ని,మనరైతు మహనీయులు,మే
ల్వడ్లను దెచ్చిరి యిండ్లకు,
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా!
(శంకరాభరణం  బ్లాగు లో05-12 -2010 నాటి  సమస్యా పూరణ-161లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Friday, January 7, 2011

ఎక్కడ వేసిన గొంగడి అక్కడె !!!

పలు మీమాంసలు జేసిరి
పలుహింసల పాలు జేసి,పాలును నీరున్
యిలవేర్జేయని నకిలీ
కలహంసల తప్పుగాని కాకుల తప్పే?

చిక్కులు విప్పగ కృష్ణుని
దిక్కుకు ఆనాడు జూడ  దినములు గడిచెన్,
ఎక్కడ వేసిన గొంగడి
అక్కడె అగుపించి నేడు అలజడి రేపెన్!!
   
(కమేటీల మీద కమేటీలు వేసి,ప్రకటనల మీద ప్రకటనలు చేసి ప్రజలను కాకులను జేసి, కష్టాలలోకి నెట్టి వేసి, సమస్యను పరిష్కరించడములో మళ్లీ  మొదటికొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసింది )

వెన్నలగురియ నావిరుల్ వెడెలెనయ్యొ!!!

కన్నెబుగ్గలు గులాబి వన్నెదాల్చె,
వనితకన్నులు నెలరాజు వంకలయ్యె!
చిన్నగా వెన్నులోరాగ సెగలుబుట్టె,
వెన్నలగురియ నావిరుల్ వెడెలెనయ్యొ!
(శంకరాభరణం  బ్లాగు లో03-12 -2010 నాటి  సమస్యా పూరణ-160లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Thursday, January 6, 2011

కంచె చేను మేయ కాపాడు నెవ్వరు?

ఊత మిచ్చు కర్ర చేతినే కాటేయ
చెట్టు లాంటి వాడు  చేష్ట లుడుగు !
కంచె చేను మేయ కాపాడు నెవ్వరు?
మంద వారి మాట మణుల మూట !!!

(మద్దెల చెరువు సూరి హత్య కు స్పందన.)

కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!!!

బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
వేదనమిగిల్చి,బాధించి,వెతలపాలు
జేసి,కంటకులై, కంపు జేయు వారి
కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!
(శంకరాభరణం  బ్లాగు లో30-11 -2010 నాటి  సమస్యా పూరణ-157లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Wednesday, January 5, 2011

తిరుమల రాయనికి లేవు తిండియు,సుఖముల్!!!

గిరి వాసిగ నుతి కెక్కిన
హరి వెంకట పతిని జూడ "హా"యని పించెన్!
కరిగిరి వెలగల వన్నియు ,
తిరుమల రాయనికి లేవు తిండియు,సుఖముల్!
(శంకరాభరణం  బ్లాగు లో24-11 -2010 నాటి  సమస్యా పూరణ-155లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Tuesday, January 4, 2011

తెలంగాణా తెచ్చేది మేమే!!ఇచ్చేది మేమే!!! తెలంగాణా ప్రజల స్పందన !!!

తెలంగాణా తెచ్చేది మేమే!!ఇచ్చేది మేమే!!!
అంటున్న పాలక పార్టి నాయకులకు తెలంగాణా ప్రజల నుండి వస్తున్న స్పందన ఇలా ఉంది.

అవును తెలంగాణాను 
                                    తెచ్చేదీ  మీరే  !
                                    ఇచ్చేది   మీరే !!
                                                                       మీ నేతల రీతులు మారక తెలంగాణా తేకపోతే!
ఎన్నికల్లోమళ్లీ జనం వద్దకు  ఓట్లనడుగ వచ్చేదీ  మీరే !     
                                     అవి పడక  చచ్చేదీ  మీరే !!
                                     యిది వచ్చే కాలంలో
                                     జరిగే పచ్చి నిజం !!!
                              
                               మారేవీ మీ తల రాతలే !
                               కాలేవీ మీకున్న చేతులే!!
                               మీకు చివరకు మిగిలేవి ప్రజల  వాతలే !!!
               
  అందుకే చెత్త బుద్దిని వదిలేయండి ! చిత్త శుద్ధితో పని చేయండి !!!

ఎలుకంగని పిల్లిచచ్చె నేనుగు పాఱెన్!!!

అలుపెరుగని రైతన్నలు,
పలుపంటలు శ్రమలకోర్చి పండింపoగన్,
పలురీతులతిను నాయక
ఎలుకంగని పిల్లిచచ్చె నేనుగు పాఱెన్!
(శంకరాభరణం  బ్లాగు లో23-11 -2010 నాటి  సమస్యా పూరణ-154లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Monday, January 3, 2011

ఆచరించరాని ఆలోచనలు మాను !!!

ఆచి తూచి తగిన ఆలోచనను జేసి
అడుగు వేయు వాడు బడయు సుఖము
ఆచరింప లేని ఆలోచనలు మాను !
మంద వారి మాట మణుల మూట!!

లెమ్ము? హరిని నమ్ము! లేమిలో కలిమిలో,!!!

లెమ్ము? హరిని నమ్ము! లేమిలో కలిమిలో,
వమ్ము జేయ బోడు మిమ్ము,మమ్ము!
వదల బోకు ధర్మ పదములు దరిచేర
రమ్ము!చేయ గలదు ప్రాణరక్ష!
(శంకరాభరణం  బ్లాగు లో22-11 -2010 నాటి  సమస్యా పూరణ-153లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Sunday, January 2, 2011

ఉట్టి కెగుర లేడు , ఊర్వశిన్ పట్టునా! !!!

చిన్నచిన్న పనుల చేయబూననివాడు,
పెద్ద  పనులు  చేసి పెట్ట గలడె ?
ఉట్టి కెగుర లేడు , ఊర్వశిన్ పట్టునా!
మంద వారి మాట మణుల మూట!

కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!!!

పరిమార్చగ కరవాలము,
పరివర్తనలకు కలమని,పరిణిత మతితో,
శిరముల దురుముట తగదని,
కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!
(శంకరాభరణం  బ్లాగు లో10-11 -2010 నాటి  సమస్యా పూరణ-147లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

Saturday, January 1, 2011

నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు!!!

ఎన్ని దాడులు చేసినా ఏమి కాదు,
ఎన్ని కూతలు కూసినా ఏది పోదు,
ఎదురు దాడియే నాకున్న పదును శరము,
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు!

(శంకరాభరణం  బ్లాగు లో09-11 -2010 నాటి  సమస్యా పూరణ-146లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2011......


                                                                          
    క్రొత్త వత్సరమ్ము          కోటి శోభల నిమ్ము     
   శాంతి నిమ్ము             నూత్న కాంతి నిమ్ము  
    సత్య వాక్కు నిమ్ము      సహన శీలత నిమ్ము  
    సర్వ జనుల కెల్ల  సౌఖ్య మిమ్ము
                                                                                     



 సర్వే జనా సుఖినో భవంతు .
అందరకూ
 నూతన సంవత్సర శుభాకాంక్షలు  2011